బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Sep 24, 2020 , 01:25:23

పట్టభద్రుల సందడి షురూ..

పట్టభద్రుల సందడి షురూ..

షెడ్యూల్‌ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

అక్టోబర్‌ 1 నుంచి షురూ

నవంబర్‌ 6 వరకు గడువు

డిసెంబర్‌ 1న ఓటరు ముసాయిదా జాబితా 

జనవరి 18న తుది జాబితా విడుదల

ఆన్‌లైన్‌ లేదా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం

2021 మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు పదవీకాలం 

నేడు వికారాబాద్‌ జిల్లా తాండూరులో మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం

వికారాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తున్న దృష్ట్యా కొత్త ఓటరు నమోదు, సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 2021 మార్చి 29తో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎన్నికైన వారి పదవీకాలం ముగియనుంది. గత ఎన్నికల్లో  మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంచందర్‌ రావు ఎన్నికైన సంగతి తెలిసిందే. కొత్తగా పట్టభద్రులు అక్టోబర్‌ 1వ తేది నుంచి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో ఓటరుగా నమోదైన వారు కూడా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు తాము నివాసముంటున్న ప్రాంతంలోని నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అర్హులైన వారు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఫాం 18, 19లను నింపి తాసిల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్లకు దరఖాస్తులను అందజేయవచ్చు. అక్టోబర్‌ 1 నుంచి ఓటరు నమోదుకు నోటీసు జారీ చేయనున్నారు. నవంబర్‌ 6 వరకు కొత్త  దరఖాస్తులను స్వీకరించి, డిసెంబర్‌ 1న ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్‌ 31 వరకు అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 12, 2021 వరకు అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. జనవరి 18న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. 

జిల్లాలో 10,727 మంది పట్టభద్రుల ఓటర్లు

పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదుతో పాటు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఓటర్లను బట్టి పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వికారాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం పట్టభద్రుల ఓటర్లు 10,727 మంది ఉన్నారు. వీరిలో తాండూరు మున్సిపాలిటీలో 1917, తాండూరు మండలంలో 459, యాలాల మండలంలో 395, బషీరాబాద్‌ మండలంలో 273, బంట్వారం మండలంలో 260, పెద్దేముల్‌ మండలంలో 300, వికారాబాద్‌ మున్సిపాలిటీలో 2003, వికారాబాద్‌ మండలంలో 429, ధారూర్‌ మండలంలో 360, మర్పల్లి మండలంలో 313, పూడూరు మండలంలో 421, మోమిన్‌పేట్‌ మండలంలో 349, కులకచర్ల మండలంలో 1123, దోమ మండలంలో 572, పరిగి మున్సిపాలిటీలో 756, పరిగి మండలంలో 797 మంది ఓటర్లున్నారు. గత ఆరేండ్లలో పట్టభద్రులైనవారు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ దఫా నమోదు చేసుకునే పట్టభద్రుల ఓటర్ల సంఖ్య పెరుగనుంది. కాగా.. 2015లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 1లక్ష 37వేల 261 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. 

కొనసాగుతున్న సన్నాహక సమావేశాలు...

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే దిశగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ  తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే సంబంధిత నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే మద్దతుదారుడిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో బరిలో నిలిచే అభ్యర్థిని గెలిపించుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అదేవిధంగా నేటి నుంచి నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ఆదేశించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి. నేడు రంగారెడ్డి జిల్లా తాండూరు ఆర్యవైశ్య కల్యాణమండపంలో, రేపు పరిగి పట్టణంలో సమావేశాలు నిర్వహించనున్నారు. 


logo