సోమవారం 26 అక్టోబర్ 2020
Vikarabad - Sep 29, 2020 , 00:41:48

వేగవంతంగా ‘ఆన్‌లైన్‌'..

వేగవంతంగా ‘ఆన్‌లైన్‌'..

వికారాబాద్‌ జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణ

పంచాయతీల్లో 1,84,000 ఇండ్లు .. 

మున్సిపాలిటీల్లో 36,122 వ్యవసాయేతర ఆస్తులు 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ వికారాబాద్‌ జిల్లాలో వేగంగా జరుగుతున్నది. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోగా వ్యవసాయేతర ఆస్తులను  ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే గ్రామ పంచాయతీల్లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణ దాదాపు పూర్తికాగా, మున్సిపాలిటీల్లో తుది దశకు చేరుకుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వివరాలను సేకరిస్తుండగా, మున్సిపాలిటీల్లో బిల్‌ కలెక్టర్లతోపాటు ఇతర సిబ్బంది  వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ప్లాట్లు, వ్యవసాయ భూముల వద్ద ఇండ్లు, ఫాంహౌస్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా మ్యుటేషన్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వ్యవసాయేతర ఆస్తులకు మెరున్‌ కలర్‌ పాసు పుస్తకాలను జారీ చేయనున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు ఉచితంగా నాలా కన్వర్షన్‌ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇకముందు ఒకరి పేరిట ఉన్న ఆస్తులు మరొకరి పేరిట బదిలీ కూడా ధరణి పోర్టల్‌ ద్వారానే కానున్నది. కాబట్టి తప్పనిసరిగా ఆన్‌లైన్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతోపాటు వారసుల వివరాలను, వారి పేర్లు, ఆధార్‌ నెంబర్లను కూడా సేకరిస్తున్నారు ఈ.ఆన్‌లైన్‌ ప్రక్రియతో సంబంధిత ఆస్తులపై పూర్తి హక్కులు రావడంతోపాటు, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావుండదు. దీని వల్ల ఆస్తుల విలువ పెరగడంతోపాటు అవరమైన వారు బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందే అవకాశముంది. 

తుది దశకు వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌...

జిల్లాలో వ్యవసాయేతర భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలతోపాటు వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో డప్పు చాటింపు చేస్తుండగా, మున్సిపాలిటీల్లో ఆటోల్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. వారికి సంబంధించిన వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి అందజేస్తున్నారు. జిల్లాలోని పూడూరు, వికారాబాద్‌, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌ తదితర మండలాల్లో హైదరాబాద్‌కు చెందిన వారి వ్యవసాయ భూముల్లో ఫౌంహౌస్‌లు ఉన్నాయి. వీటితో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్లు, ఇంటి నెంబర్‌, ఇంటి యజమాని పేరు తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శులు సేకరిస్తున్నారు. ఆయా ఆస్తులకు వారసుల పేర్లు, ఆధార్‌ నెంబర్ల వివరాలు తదితర వివరాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో టీపీఐఎన్‌ నెంబర్‌, యజమాని ఇంటి పేరు, పేరు, ఇంటి నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌, జిల్లా పేరు, వార్డు నెంబర్‌ తదితర వివరాలను సేకరిస్తున్నారు. అయితే వ్యవసాయ భూముల్లో నిర్మించిన ఇండ్లు, ఫాంహౌస్‌లను ఆన్‌లైన్‌ పూర్తైతే సంబంధిత ఆస్తులను వ్యవసాయ భూముల కేటగిరీ నుంచి తొలగించనున్నారు. అదేవిధంగా కుటుంబ యజమాని మరణించినట్లయితే మ్యుటేషన్‌ కావాల్సిన ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో 1,78,820 ఇండ్లు ఉండగా జిల్లా పంచాయతీ శాఖ అధికారులు ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఇప్పటికే 566 గ్రామ పంచాయతీల్లోని 1.84 లక్షల వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. అయితే వ్యవసాయ భూముల్లోని ఇండ్లు, ఫాంహౌస్‌లు మరో 25 వేల వరకు ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లోని వ్యవసాయేతర ఆస్తులకు(ఇండ్లు, ప్లాట్లు, ఫాంహౌస్‌లు) సంబంధించి వికారాబాద్‌ మున్సిపాలిటీలో 14,010 వ్యవసాయేతర ఆస్తులుండగా, ఇప్పటివరకు 13,500  ఆస్తుల ఆన్‌లైన్‌ పూర్తయ్యింది. తాండూరు మున్సిపాలిటీలో 12,950 వ్యవసాయేతర ఆస్తులుండగా ఇప్పటివరకు 1,965 వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. పరిగి మున్సిపాలిటీలో 5490 వ్యవసాయేతర ఆస్తులుండగా వీటిలో ఇప్పటివరకు 4350 వ్యవసాయేతర ఆస్తులను, కొడంగల్‌ మున్సిపాలిటీలో 3672 వ్యవసాయేతర ఆస్తులుండగా ఇప్పటివరకు 2700 వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. 


ఆక్టోబర్‌ 3లోగా ఆన్‌లైన్‌ పూర్తి చేస్తాం...

డీపీవో రిజ్వానాబేగం

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణతోపాటు ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. గ్రామ పంచాయతీల్లో ఇండ్ల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా, వ్యవసాయ భూముల్లో నిర్మించిన ఇండ్లు, ఫాంహౌస్‌ల వివరాల సేకరణ, ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్‌ 3లోగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 100 శాతం ఆన్‌లైన్‌ చేస్తాం. ప్రతీ ఒక్కరూ తమ వ్యవసాయేతర ఆస్తుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి తెలియజేయాలి. logo