శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 06, 2020 , 00:40:44

మూగ రోదన

మూగ రోదన

అంతుచిక్కని వ్యాధులతో అయోమయం

మందులు అందుబాటులో లేవంటున్న సిబ్బంది

బయటి నుంచి మందులు తెచ్చుకుంటున్న రైతులు

మోమిన్‌పేట్‌ : మూగజీవాలు అంతు చిక్కని వ్యాధులతో అనారోగ్యానికి గురవుతున్నాయి. మండలంలో ఆయా గ్రామాల్లో 8000 తెల్ల, నల్లజాతి పశువులు,7,800 చిన్న జాతి పశువులున్నాయి. మోమిన్‌పేట్‌, మెరంగపల్లి, చీమలదరి, దేవరంపల్లి తదితర గ్రామాల్లో పశు వైద్యశాలలు ఉన్నప్పటికీ  కొన్ని సెంటర్లలో డాక్టర్లు అందుబాటులో లేరు. ఇంకొన్ని సెంటర్లలో డాక్టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ మందులులేవని, బయటి నుంచి  కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పశువులకు ఉచిత టీకాలు వేయాలని కోరుతున్నారు.

పరికరాలు కూడా లేవు : రవీందర్‌రెడ్డి, రైతు, ఎన్కతల 

పశువుల చర్మంపై కంతులు, దద్దుర్లు వచ్చి అనారోగ్యంపాలవుతున్నాయి. గ్రామంలో పశు వైద్యశాల ఉన్నప్పటికీ సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదు. కావలసిన మందులు అందుబాటులో లేకపోవడంతో బయటి నుంచి మందులు కొన్నాం. సరైన పరికరాలు లేనందున పశువులను చెట్లకు కట్టి టీకాలు చేయించాం.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం 

డాక్టర్‌ అన్వేష్‌, పశువైద్యాధికారి, మోమిన్‌పేట్‌

వాతావరణ మార్పుల వలన పశువులకు లంపీస్కిన్‌ వ్యాధి సోకుతుంది. కొన్ని మందులు అందుబాటులో లేని మాట వాస్తవమే. డాక్టర్లు, కంపౌండర్ల కొరత కూడా ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లాం. వారం రోజుల్లో మందులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రైతులు ఆందోళన చెందకుండా పశువులకు ఎలాంటి సమస్యలున్నా అందుబాటులో ఉన్న డాక్టర్లను సంప్రదించాలి. logo