శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 26, 2020 , 01:08:05

ఇండ్లు, స్థలాలు, భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ఇండ్లు, స్థలాలు, భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం

వికారాబాద్‌ : నియోజకవర్గంలోని ఇండ్లు, వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఎంఆర్‌వోలు, ఎంపీవోలతో ఆయన సమావేశం నిర్వహించారు.  ఇండ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఉత్పన్నమయ్యే సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం అన్నిరకాల  చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటివరకు నిర్మించిన ఇండ్లు, గెస్ట్‌ హౌస్‌లు, వ్యవసాయేతర భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే యోచనలో ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని భూముల వివరాలను ఆదివారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, ఎంపీపీలు వసంత, విజయలక్ష్మి, చంద్రకళ, జడ్పీటీసీలు, మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవో, ఎంఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు. 

 క్రమబద్ధీకరించుకోవాలి..

మర్పల్లి : మండలంలో ఆన్‌లైన్‌లో లేని ఇండ్లు, స్థలాలు క్రమబద్ధీకరించుకోవాలని ఎంపీపీ లలితరమేశ్‌ అన్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో ఎల్‌ఆర్‌ఎస్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌తో స్థిరాస్తులు, ఇండ్లకు సంబంధించిన సమస్యలకు తక్షణ పరిష్కారం లభించనుందన్నారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని ఇండ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర భూముల వివరాలను రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్‌, ఎంపీడీవో సురేశ్‌బాబు, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు సోహెల్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

వేగవంతంగా చేపట్టాలి..

కోట్‌పల్లి : ఆన్‌లైన్‌ నమోదు వేగవంతంగా చేపట్టాలని ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆయన ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తాసిల్దార్‌తో కలిసి  మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, ఎంపీడీవో, తాసిల్దార్‌ మాట్లాడుతూ గ్రామాల్లోని ఇండ్లు, స్థలాలు, వ్యవసాయేతర భూముల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్‌, సర్పంచ్‌లు విజయలక్ష్మి, రాంచందర్‌, శోభారాణి, ఎన్కెపల్లి ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

logo