సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 29, 2020 , 00:59:14

12921 హెక్టార్లలో సాగు

12921 హెక్టార్లలో సాగు

గిట్టుబాటు ధరలు పెంచడంతో 

రైతుల్లో చిగురింపజేస్తున్న ఆశలు

ఆనందంలో అన్నదాతలు

బొంరాస్‌పేట : మండలంలో వానకాలం పంటలు కళకళలాడుతున్నాయి. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో ఈ ఏడాది వానకాలం పంటల సీజన్‌ ఆశాజనకంగా ఉంది. వానకాలంలో రైతులు మెట్ట పంటలైన కంది, పెసర, జొన్న, మినుములు, పత్తి వంటి పంటలను సాగు చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వానలు కురువడంతో రైతులు పొలాల్లో విత్తనాలు వేశారు. ప్రారంభంలో వర్షాలు జోరుగా కురిశాయి. విత్తనాలు వేసిన తరువాత కూడా వానలు రావడంతో మెట్ట పంటలైన కంది, పత్తి, పెసర పంటలు కళకళలాడుతున్నాయి. రేగడి పొలాలతో పాటు చెల్క భూముల్లో సాగు చేసిన కంది, పత్తి పంటలు ఏపుగా పెరిగి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. పెసర ప్రస్తుతం కాయ దశలో ఉంది. మండలంలో వానకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 12921 హెక్టార్లు కాగా వరి 2422 హెక్టార్లు, జొన్న 820, పెసర 1660, మినుములు 69, కంది 7063, పత్తి 313, వేరుశనగ 240 హెక్టార్లలో సాగు చేస్తారు. ఈసారి మక్కజొన్న పంట సాగును రైతులు విరమించుకున్నారు. కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను ఏటా రికార్డుస్థాయిలో సాగు చేస్తున్నారు. కంది, పత్తి, పెసర పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండటంతో రైతుల ఆశలన్నీ వీటిపైనే ఉన్నాయి. వాతావరణం అనుకూలిస్తే కంది, పెసర, పత్తి పంటలతో మంచి దిగుబడులు వస్తాయని, తమ కష్టాలు గట్టెక్కుతాయని అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధరలను పెంచడంతో రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వరిసాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. జూలై నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు, బురాన్‌పూర్‌ చిన్నవాగు ప్రాజెక్టు నిండాయి. ఈ చెరువుల కింద రైతులు వానకాలంలో వరినాట్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగడంతో వ్యవసాయ బోర్ల కింద వరిసాగు గణనీయంగా పెరుగుతున్నది. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తుండటంతో సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. వానకాలంలో మూడు వేలకుపైగా ఎకరాలలో వరినాట్లు వేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారైనా పంటలు బాగా పండి గిట్టుబాటు ధరలు వస్తే ఆరుగాలం శ్రమించినందుకు ఫలితం దక్కుతుందని రైతులు భావిస్తున్నారు. 


logo