గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 05, 2020 , 01:17:21

బంట్వారం మండలంలో జోరుగా పల్లె పకృతి వనాల నిర్మాణం

బంట్వారం మండలంలో  జోరుగా పల్లె పకృతి వనాల నిర్మాణం

మొత్తం 13 వనాలు ..  విడుదలైన నిధులు

పలు గ్రామాల్లో చివరిదశకు చేరిన పనులు

బంట్వారం: ప్రతి  పల్లెకు ఒక  ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ప్రజలకు స్వచ్ఛమైన వాతవరణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు  నిధులను సైతం విడుదల చేయడంతో ప్రతి గ్రామంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  ప్రకృతి వనాల్లో అనేక రకాల చెట్లను క్రమ పద్ధతిలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ప్రజలు సేద తీరెందుకుగానూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మండలంలో 13 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి  చర్యలు చేపట్టారు. వీటిలో ఇప్పటికే రెండు, మూడు గ్రామాల్లో నిర్మాణ పనులు చివరి దశలో ఉండగా, మిగతా గ్రామాల్లో  పనులు కొనసాగుతున్నాయి. ఎలాగైనా నెల రోజుల్లోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

బంట్వారం మండల కేంద్రంలో ప్రకృతి వనం నిర్మాణాకి 20 గుంటల స్థలాన్ని కేటాయించగా, బస్వపూర్‌లో 20 గుంటలు, నూరుళ్లపూర్‌లో 14 గుంటలు, బొపునారంలో  ఎకరం, మద్వపూర్‌లో 10 గుంటలు, మాలసోమారంలో  ఎకరం, నాగ్వారంలో  ఎకరం, రొంపల్లిలో 30 గుంటలు, మంగ్రాస్‌పల్లిలో 20 గుంటలు, సుల్తాన్‌పూర్‌లో ఎకరం, తొరుమామిడిలో  ఎకరం, యాచారంలో  ఎకరం స్థలాలను గుర్తించారు. కాగా సల్బత్తాపూర్‌లో ఇంకా స్థలాన్ని గుర్తించలేదు. అయితే ఇప్పటికే రొంపల్లిలో వన నిర్మాణ పనులు చివరి దశలో ఉండగా, బంట్వారం, బొపునారం, బస్వపూర్‌, మంగ్రాస్‌పల్లి, తొరుమామిడి లో పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు గుంతలను సైతం తీశారు.

ప్రతి గ్రామంలో  చిన్న అటవీ ప్రదేశం కనిపించేలా పలు రకాల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి రకంలో  వేప, ఇప్ప, నారఇప్ప, శ్రీగంధం, రోజ్‌హుడ్‌, టేకు, కుంకుడు, ఉసిరి, మారేడు, పనస, సీమ చింత, నెమలినార లాంటి మొక్కలను నాటనున్నారు.  రెండవ రకంలో చిన్న పొదరు, చిన్న చెట్ల లాంటివి ఈత, జిలుగు, హెన్నా, సీతాఫలం, జామ, దానిమ్మ, కరివేపాకు, మల్బరీ, వెదురు, జమ్మి, వావిలి లాంటి మొక్కలను నాటుతారు. మూడవ రకంలో వనమూలికల మొక్కలు తంగెడు, అడ్డసారం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి, గుగ్గుల్‌, నిమ్మగడ్డి లాంటి మొక్కలను పెంచనున్నారు. 


logo