సోమవారం 19 అక్టోబర్ 2020
Vikarabad - Sep 21, 2020 , 01:00:43

నిరంతరం ‘పల్లెప్రగతి’

నిరంతరం ‘పల్లెప్రగతి’

- మారిన పల్లెల రూపురేఖలు 

- సకల సౌకర్యాలతో అభివృద్ధి దిశగా గ్రామాలు

- ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్న అధికారులు

వికారాబాద్‌ రూరల్‌: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తిగా మార్చివేసింది. తొలుత 30 రోజుల ప్రణాళికగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది.  దానికి అనుగుణంగా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. వికారాబాద్‌ మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామానికో వైకుంఠధామం, కంపోస్టుషెడ్డు, ప్రకృతి వనం, హరిత నర్సరీలు, గ్రామ పంచాయతీకో ట్రాక్టర్‌, గ్రామ జనాభాకు అనుగుణంగా సఫాయి కార్మికులను ఏర్పాటు చేసి ప్రతి రోజు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. వారంలో చేయాల్సిన పనులను ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా అభివృద్ధి చేపడుతున్నారు. పల్లె ప్రగతి  ప్రారంభం నుంచి ప్రతి నెల గ్రామ పంచాయతీల్లో నిధులు వస్తుండడంతో  సర్పంచ్‌లు అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ  ముందుకు సాగుతున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా అభివృద్ధి పనులు ఆగకుండా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ కలలుగన్న గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వ ఆదేశించిన పనులన్నీంటిని  మండలానికి ఒక ప్రత్యేకాధికారికి కేటాయించి అభివృద్ధి పనులపై ప్రతి రోజు ఆరా తీస్తున్నారు. రూ. 12 లక్షలతో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా వైకుంఠధామాల నిర్మాణ పనులు, రూ. 2.50 లక్షలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా కంపోస్టుషెడ్లు, గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బట్టి ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామానికి అవసరమున్న ట్రాక్టర్‌, ట్యాంకర్‌ సమకూర్చుకొని పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. పల్లె ప్రగతి ప్రారంభమై సంవత్సరం పూర్తయింది. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా చివరి దశల్లో ఉన్నాయి. 

ప్రగతి  పథంలో  పంచాయతీలు...

 - అంజయ్య  సర్పంచ్‌  సిద్దులూరు

గతంలో గ్రామాల్లో ఏ పని చేయాలన్నా ఏ నాయకుడి చెంతకో వెళ్లి బతిమిలాడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకు వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. సర్పంచ్‌గా గెలిచాక ఏ పని చేయాలన్నా పంచాయతీల్లో నిధులు సరిగ్గా ఉండేవి కావు. ముఖ్యమంత్రి పుణ్యామా అంటూ ఏ గ్రామంలో చూసిన నిధుల కొరత తీరింది. గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చుకునేందుకు ట్రాక్టర్‌, క్రిమిటోరియం, పార్కులు అభివృద్ధి చేస్తే గ్రామాల్లోని ప్రజలు కూడ ఎంతో సంతోషిస్తారు. 

అధికారులు సూచనల మేరకు పనులు .. 

- మాధవరెడ్డి సర్పంచ్‌  పుల్‌మద్ది 

ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రణాళికను తూచతప్పకుండా పాటించేలా అధికారులు పదే పదే గుర్తు చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. వికారాబాద్‌ మండలంలో పుల్‌మద్ది గ్రామాన్ని ఆదర్శంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే అంతర్గత మురుగుకాలువల పనులు పూర్తి చేశాం. మరిన్ని అభివృద్ధి పనులు  కొనసాగుతున్నాయి.  ప్రజలు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. 


logo