శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 22, 2020 , 01:10:30

లెక్కతేలింది..

లెక్కతేలింది..

కోర్టు కేసుల్లో ఉన్న భూముల వివరాల సేకరణ పూర్తి

వికారాబాద్‌ జిల్లాలో మొత్తం వివాదాల్లో ఉన్న భూములు 49,200 ఎకరాలు 

అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పద భూములు 28 వేల ఎకరాలు

సివిల్‌ కోర్టులో 4200 ఎకరాలు, రెవెన్యూ కోర్టులో 2 వేల ఎకరాలు

కుటుంబాల మధ్య అపరిష్కృతంగా ఉన్నవి 15వేల ఎకరాలు..

వివరాలను ప్రభుత్వానికి అందజేసిన జిల్లా రెవెన్యూశాఖ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో వివిధ కోర్టుల్లో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న భూముల వివరాల లెక్కతేలింది. ఇకపై రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకోసం ప్రభుత్వం ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ శాఖ జిల్లాలో ఆయా కోర్టుల్లో ఉన్న మండలాల వారీగా ఉన్న భూముల వివరాలను సేకరించింది. ఈ వివరాలను జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నాలుగు రోజుల క్రితం అందజేశారు. ఇప్పటివరకు తాసిల్దార్‌, ఆర్డీవో, జేసీ కోర్టుల్లో భూ సమస్యల కేసులను పరిష్కరించేవారు. మూడు దశల్లో కోర్టులు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా చాలా కేసులు పెండింగ్‌లోనే ఉండడం, సరైన నిర్ణయం తీసుకోకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వం ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు, పునఃపరిశీలన కేసులన్నింటినీ ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదిలీ చేయనున్నారు. వీటి విషయంలో ఇకపై ట్రిబ్యునల్‌ కోర్టు నిర్ణయమే అంతిమం కానుంది. అయితే సివిల్‌ కోర్టులో ఉన్న కేసులు మాత్రం అక్కడే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ కోర్టులో ఉన్న పెండింగ్‌ కేసులతో పాటు అటవీ-రెవెన్యూ శాఖల మధ్య, కుటుంబాల మధ్య వివాదాలున్న కేసులకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ట్రిబ్యునల్‌ కోర్టుల్లో పరిష్కారం చూపనున్నారు. ప్రతీ వెయ్యి కేసులకు ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

వివిధ కోర్టు కేసుల్లో 49,200 ఎకరాలు...

 జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 49,200 ఎకరాల భూములపై కేసులున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అధికమొత్తంలో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య 28 వేల ఎకరాల భూములు వివాదంలో ఉండగా, రెవెన్యూ కోర్టుల్లో 2 వేల ఎకరాలు, సివిల్‌ కోర్టులో 4200 ఎకరాలు, కుటుంబ వివాదంలో 15 వేల ఎకరాల భూములున్నాయి. వీటిలో సివిల్‌ కోర్టులో ఉన్న భూములు మినహా మిగతా భూములకు సంబంధించిన కేసులన్నింటిని ప్రత్యేక ట్రిబ్యునల్‌లోనే పరిష్కరించనున్నారు. ఇప్పటివరకు రెవెన్యూలో తాసిల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ మూడు దశల్లో కోర్టులుండేవి. ఏదైనా వివాదాస్పద భూమికి సంబంధించి తాసిల్దార్‌ కోర్టులో ఒకరికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లయితే మరో వర్గం ఆర్డీవో కోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే జేసీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండేది. దీంతో చాలా ఏళ్లుగా భూ కేసులు ఆయా రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంటూ వస్తున్నాయి. అయితే తాసిల్దార్లు, ఆర్డీవోలు, జేసీలు ఆయా స్థాయిల్లో ఇప్పటివరకు వారే ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారు. 

అటవీ-రెవెన్యూ శాఖల మధ్య 

వివాదస్పద భూములే అధికం...

జిల్లావ్యాప్తంగా 1.06 లక్షల ఎకరాల్లో అటవీ భూములున్నాయి. అయితే జిల్లాలో వివాదాస్పద భూముల్లో అధికంగా అటవీ-రెవెన్యూ శాఖ మధ్యనే ఉన్నాయి. జిల్లా అంతటా 28 వేల ఎకరాలకు సంబంధించి అటవీశాఖ-రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతున్నది. జిల్లాలోని ధారూర్‌, బషీరాబాద్‌, కుల్కచర్ల, పెద్దేముల్‌, నవాబుపేట్‌. మోమిన్‌పేట్‌, బంట్వారం, పూడూర్‌ మండలాల్లో సంబంధిత రెండు శాఖల మధ్య వివాదాస్పద భూములున్నాయి. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ-రెవెన్యూ శాఖల మధ్య భూములకు సంబంధించి వివాదం కొనసాగుతూ వస్తున్నది. వివాదంలోని సంబంధిత భూములు తమవేనంటూ అటవీ శాఖ-రెవెన్యూ శాఖలు చెబుతూ వస్తున్నాయి. పదిహేనేళ్లకుపైగా సాగు చేసుకుంటున్న రైతులకు 10 వేల ఎకరాల వరకు ప్రభుత్వం ఇప్పటికే పట్టాలను అందజేసింది. మిగతా 28 వేల ఎకరాలు మాత్రం తమదేనంటూ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని అటవీ శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. వివాదంలో ఉన్న 28 వేల ఎకరాలకు సంబంధించి రెవెన్యూ శాఖ కొంత భూములకు పట్టాలను కూడా జారీ చేశారు. రికార్డుల్లో అటవీ శాఖ భూములని స్పష్టంగా ఉన్నప్పటికీ...రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడంతోనే రెండు శాఖల మధ్య వివాదం కొనసాగుతున్నది. ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో ఈ భూముల వివాదాలు సమసిపోనున్నాయి. logo