శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 29, 2020 , 00:41:55

ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు

ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు

రూ.6కోట్లతో చిట్లపల్లి-నాగారం రోడ్డు

త్వరగా ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి

 గ్రామ ఇన్‌చార్జిలు జాబితా సిద్ధం చేసుకోవాలి

రేపు రైతు సంబుర ర్యాలీ, మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌:  మార్చి నాటికి మిగిలిన ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు మంజూరుతో పాటు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఓటరు నమోదు, 30న కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతు ర్యాలీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రను సృష్టించేలా ముఖ్యమంత్రి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ట్రాక్టర్‌, ఎండ్లబండ్ల ర్యాలీ నిర్వహిస్తూ కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గంలో బుధవారం పెద్దఎత్తున రైతు సంబుర ర్యాలీని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, సర్పంచ్‌లు, నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. కొత్తచట్టం స్వాగతోత్సవ ర్యాలీకి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. అదేరోజు మండలంలోని అన్నారం గ్రామ సమీపంలో నిర్మించిన 33 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవం, కొడంగల్‌ మార్కెట్‌ యార్డ్‌లో మార్కెట్‌ కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం, చిట్లపల్లి నుంచి ఖాజాఅహ్మద్‌పల్లి మీదుగా అన్నారం, నాగారం వరకు రూ.6 కోట్లతో రోడ్డు భూమిపూజ కార్యక్రమాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో మధ్యాహ్నం సమావేశం ఉంటుందన్నారు. సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదికలు, వైకుంఠధామం, డంపింగ్‌యార్డ్‌, ప్రకృతి వనాల వంటి అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో పూర్తి చేసేలా సర్పంచ్‌లు బాధ్యత వహించాలని ఆదేశించారు. మండలంలో రుద్రారం నుంచి పాటుమీదిపల్లి మీదుగా గొటికె, ధర్మాపూర్‌ నుంచి ఇంధనూర్‌ రోడ్‌లతో పాటు పలుగురాళ్లతండా, టెకల్‌కోడ్‌ తండాలకు బీటీ రోడ్డు పనులు మంజూరు కావాల్సి ఉందని, త్వరలో మంజూరు చేయించి వచ్చే మార్చి నాటిని పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని అన్నారు.

1 నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ 

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇందుకు ఏర్పాటు చేసిన ఇన్‌చార్జిలతో పాటు సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఓటరు జాబితా తయారీపై అందిస్తున్న ఫారాలలో పూర్తి వివరాలు సేకరించి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులకు అందజేయాలని సూచించారు. ఇన్‌చార్జిలు ఇంటింటి సర్వే చేపట్టి పట్టభద్రుల జాబితా సిద్ధం చేయాలన్నారు. నవంబరు 2017లో డిగ్రీ పూరైన వారితో పాటు గతంలో ఓటరు జాబితాల్లో నమోదైన పట్టభద్రులు కూడా ఓటరు నమోదు చేయించుకోవాలన్నారు. పేర్లు నమోదు చేయించుకున్న వారికే ఓటు హక్కు ఉంటుందని తెలిపారు. 10 రోజుల్లో పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఇన్‌చార్జిలకు దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ముక్తార్‌, నాయకుడు సిద్దిలింగప్ప, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. logo