మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Sep 07, 2020 , 01:48:30

భవనాలపై భువనాస్త్రం..

భవనాలపై భువనాస్త్రం..

వికారాబాద్‌ : మున్సిపాలిటీల్లో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు సర్కారు నడుంబిగించింది. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా భువన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని ఇండ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో నమోదు చేసేందుకు మున్సిపల్‌ యంత్రాంగం సిద్ధమైంది. ఈ యాప్‌ ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఇండ్లకు సరైన పన్నులు నిర్ణయించడంతో మున్సిపాలిటీలకు అదనపు ఆదాయం సమకూరనున్నది. వికారాబాద్‌ జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. పురపాలికల్లో మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భువన్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నది. నిర్మాణాల సమగ్ర సమాచారాన్ని సేకరించి శ్లాబుల ప్రకారం పనులు చేపట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ప్రతి భవనాన్ని 360 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇందులోని వివరాల ఆధారంగా ఏ భవనానికి ఎంత ఆస్తిపన్ను, నల్లాచార్జీలు వసూలు చేయాలో నిర్ణయించి సంబంధిత కేటగిరిలో చేర్చుతారు. ఆయా భవంతులపై అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, సెల్‌టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలా ? వద్దా ? అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. 

సమకూరనున్న అదనపు ఆదాయం...

పట్టణాల్లో నివసిస్తున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరడం లేదు. ముఖ్యంగా ఆస్తి, నల్లా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అయితే పన్నుల మదింపు సక్రమంగా జరుగకపోవడంతో సర్కారు ఆదాయానికి గండి పడుతున్నది. పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేయడంతో గృహసముదాయాలను వ్యాపార అవసరాలకు వినియోగించినా అందుకు అదనపు పన్నులు చెల్లించడం లేదు. ఆస్తి పన్ను పరిధిలోకి రాని అక్రమ నిర్మాణాలను గుర్తించి, పన్ను విధించేందుకు గతంలో సరైన వ్యవస్థ లేదు. ఇలాంటి లోపాలకు యాప్‌తో తెరపడనున్నది. 

సెప్టెంబర్‌ చివరిలోగా సమాచారం సేకరించాలి

సెప్టెంబర్‌ చివరిలోగా సమాచారం సేకరించాలని మున్సిపాలిటీలను ప్రభుత్వం ఆదేశించడంతో వికారాబాద్‌ మున్సిపాలిటీలో సిబ్బంది అందుకు తగ్గట్టుగా పని చేస్తున్నారు. ఒక్కో నివాసానికి సంబంధించి 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వైశాల్యం, నల్లా కనెక్షన్లు, విద్యుత్‌ మీటర్లు, భవంతులపై అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, సెల్‌ టవర్‌ ఇతర వివరాలన్నింటినీ భువన్‌ యాప్‌లో పొందుపరుస్తున్నారు. విద్యుత్‌ శాఖ నుంచి మీటర్లు, వాణిజ్య శాఖ నుంచి వ్యాపార అనుమతులు, ప్లానింగ్‌ విభాగం నుంచి భవనాల వివరాలు సేకరిస్తున్నారు.


పన్నుల వసూళ్లు సక్రమంగా జరుగుతాయి 

భువన్‌ యాప్‌తో గృహ, వాణి జ్య సముదాయాలను సులభం గా గుర్తించవచ్చు. తద్వారా పన్నుల వసూళ్లు సక్రమంగా జరుగుతాయి. ఇది వరకు కొన్ని ఇండ్లను వ్యాపార అవసరాలకు వినియోగించినా అదనపు పన్నులు చెల్లించే వారు కాదు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని  సేకరిస్తాం. 

- భోగేశ్వర్లు, వికారాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ logo