బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Sep 26, 2020 , 01:04:55

అన్నదాతల ఆనందహేల

అన్నదాతల ఆనందహేల

రెవెన్యూ చట్టానికి సర్వత్రా హర్షామోదాలు

రైతుల కష్టాలు దూరం చేస్తున్న  సీఎం కేసీఆర్‌

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి 

దేశానికి తలమానికం: ఎంపీ రంజిత్‌రెడ్డి

ప్రజలకు మరింత మేలు: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

పరిగి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి సర్వత్రా హర్షామోదాలు లభిస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ చట్టంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్ధతుగా పరిగి మండలం రంగాపూర్‌ నుంచి పరిగి పట్టణం వరకు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం గొప్ప సాహసోపేతమైందని, తెలంగాణలో గొప్ప మార్పులకు ఈ చట్టం నాంది పలుకుతుందని పేర్కొన్నారు. భూములన్నింటినీ సర్వే చేసేందుకు సీఎం కేసీఆర్‌ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నార న్నారు. నిజాం కాలంలో భూముల సర్వే చేపట్టగా, ఇన్నేళ్ల తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేపట్టాలని నిర్ణయించిందన్నారు. నూతన రెవెన్యూ చట్టం, భూ సర్వేతో భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. రెవెన్యూ చట్టం పట్ల రైతులు  అత్యంత సంతోషంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి రైతుకు మేలుచేసే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. నూతన రెవెన్యూ చట్టం భూ సమస్యలన్నింటికీ చరమగీతం పాడుతుందని తెలిపారు. మ్రరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిందని, ఈ బిల్లును నిలిపివేయాలని రాష్ట్రపతిని అన్ని రాజకీయ పక్షాలు కోరాయన్నారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు నష్టం కలుగుతుందని ఆయన ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్సీ మహేంందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని, ఈ చట్టంతో ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తర్వాత పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూర్‌-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారని, తద్వారా పరిగి ప్రాంతం సస్యశ్యామలంగా మారబోతుందని తెలిపారు. వ్యవసాయం పండుగలా మారుతుందని అభిప్రాయపడ్డారు. భూ ప్రక్షాళనతోను అనేక సమస్యలు పరిష్కరింపబడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌళిక వసతుల కల్పన సంస్థ చైర్మన్‌ జీ.నాగేందర్‌గౌడ్‌, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. 

బీటీ రోడ్ల కోసం ప్రత్యేక నిధులు : మంత్రి సబితారెడ్డి

పూడూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల పరిధిలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే రోడ్డు రాకంచర్ల నుంచి పుడుగుర్తి గ్రామం వరకు పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి రూ.5 కోట్ల 10లక్షలతో బీటి రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల రహదారుల నిర్మాణాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి,  ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, సర్పంచ్‌ కమ్లీబాయి పెంటయ్య, ఎంపీటీసీ సిరిదేవిక, యోగానంద లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ జె.నర్సింహులు,  సొసైటీ మాజీ చైర్మన్‌ నర్సింహ్మరెడ్డి, సీనియర్‌ నాయకులు ఎడి.అజీం, ప్రభాకర్‌గుప్త, శ్రీనివాస్‌గుప్త, బి.గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బిక్యానాయక్‌, రాజురెడ్డి, తాసిల్దార్‌ కిరణ్‌ కుమార్‌, ఎంపీడీవో ఉష, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు  ఉన్నారు. 


భారీ ట్రాక్టర్‌ ర్యాలీ...ట్రాక్టర్‌ నడిపిన ఎంపీ రంజిత్‌రెడ్డి

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా శుక్రవారం పరిగి మండలం రంగాపూర్‌ నుంచి పరిగి పట్టణం వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌ నడిపించగా ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిలు ట్రాక్టర్‌పై ప్రయాణించారు. రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకుల జయజయ ధ్వానాల మధ్య ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగింది. కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులు తీరి ఈ ర్యాలీలో ఒకదాని వెంట ఒకటి చొప్పున వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఈ ర్యాలీ జరిగింది. రైతులు మరింత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాలుపంచుకున్నారు.  


logo