సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లు అంటే కేవలం మేల్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఫిమేల్ కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు మన దగ్గర. తెలుగులో రమాప్రభ, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మినహాయిస్తే లేడీ కమెడియన్లు అరుదుగా కనిపిస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఫిమేల్ కమెడియన్స్ వచ్చినా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండలేకపోయారు.
అయితే వీళ్ళందరి కంటే ముందు మరో లేడీ కమెడియన్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కోవై సరళ. తమిళ అమ్మాయి అయినా కూడా తెలుగులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బ్రహ్మానందంతో కోవై సరళ చేసిన కామెడీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది.
ఈ ఇద్దరి కాంబినేషన్ అద్భుతం అంతే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 800 సినిమాలకు పైగా నటించింది కోవై సరళ. కేవలం ప్రొఫెషనల్ గానే ఈమె అందరికీ తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ లో ఈమె చేసిన త్యాగం గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడు బయట చెప్పుకోలేదు కూడా. ప్రస్తుతం కోవై సరళ వయస్సు 59 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ కుమారిగా ఉండిపోయింది. అవును.. కోవై సరళ పెళ్లి చేసుకోలేదు. దీనికి కారణం ఏంటి అని ఆమెను చాలా మంది చాలా సార్లు అడిగినా సమాధానం చెప్పలేదు. సినిమాల్లో బిజీగా ఉండి పెళ్ళి గురించి పట్టించుకోలేదు అని చాలామంది అనుకున్నారు. కానీ దాని వెనక చాలా పెద్ద కథ ఉంది.
అసలు విషయం ఏమిటంటే కేవలం కుటుంబంలో ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈమె పెళ్లికి దూరం అయ్యారు. కోవై సరళకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ల బాధ్యత మొత్తం ఈమె తీసుకుంది. స్టార్ కమెడియన్ గా ఉన్నప్పుడు ఈమె సంపాదించిన ఆస్తి పాస్తులు మొత్తం తన చెల్లెళ్లకు ఇచ్చి.. వాళ్లకు పెళ్లిళ్లు చేసి లైఫ్ లో సెటిల్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలను చూసుకుంటూ జీవితంలో అలా ఒంటరిగా మిగిలిపోయింది కోవై సరళ.
ఈ మధ్యలో తనకు కూడా ఒక జీవితం ఉందని.. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తన సిస్టర్స్ కోసం జీవితం త్యాగం చేసింది. వాళ్లకు మంచి భవిష్యత్తు అందించడానికి తన బంగారం లాంటి భవిష్యత్తును తాకట్టు పెట్టుకుంది కోవై సరళ. అయితే పెళ్లి చేసుకోలేదు అని నేనెప్పుడూ బాధ పడలేదు.. ఎందుకంటే చెల్లెళ్ళకు మంచి ఫ్యూచర్ అందించినప్పుడే ఆ లోటు తనకు కనిపించలేదు అంటుంది కోవై సరళ. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మ లాంటి అక్కలు ఉన్నారంటే నిజంగానే చేతులెత్తి దండం పెట్టొచ్చు.