శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Feb 20, 2021 , 00:24:49

నేత్రపర్వం

నేత్రపర్వం

కొడంగల్‌ శ్రీవారి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

సప్త వాహనాలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి

మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవిలతో శ్రీనివాసుడి ఊరేగింపు

భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం

అనంతగిరిలోనూ వైభవంగా రథసప్తమి ఉత్సవాలు

కొడంగల్‌, ఫిబ్రవరి 19  : పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్‌ శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. ఉదయం నుంచి శ్రీనివాసుడికి  ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. రథసప్తమి రోజు భగవంతుడిని  దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మధ్యాహ్నం  శ్రీదేవి, భూదేవి సమేతుడైన మహావిష్ణువుకు పరిమళద్రవ్యాలతో పాటు పూలు, పండ్లతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం చంద్రప్రభ, సింహ, హంస వంటి సప్తవాహనాలపై శ్రీవారు కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగే రథసప్తమి ఒక రోజు ఉత్సవాలను పోలిన మాదిరిగా కొడంగల్‌ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజలతో సాక్షాత్తు తిరుమలేశుడిని దర్శించుకున్నంత భాగ్యం కలిగిందని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

అనంతగిరిలో..

వికారాబాద్‌, ఫిబ్రవరి 19 : వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపద్మనాభస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభ స్వామిని ఏడు వాహనాలపై పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు శేషగిరిపంతులు, ఆలయ ఈవో శేఖర్‌గౌడ్‌, శాంతకుమార్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo