బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Feb 20, 2021 , 00:24:45

వైకుంఠధామం.. నాసిరక నిర్మాణం

వైకుంఠధామం.. నాసిరక నిర్మాణం

గోధుమగూడలో నాణ్యతలేని పనులు

అప్పుడే వంకరలు పోతున్న స్లాబ్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 19: మండలంలోని గోధుమగూడ గ్రామంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా వైకుంఠధామం నిర్మాణం నాసిరకంగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల కండ్లుగప్పి కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండాపనులు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ పనులను ఇదివరకు ఒక కాంట్రాక్టర్‌ సగం వరకు చేసి వదిలేశాడు. మరో కాంట్రాక్టర్‌ ఆ పనులు ప్రారంభించినా, అవికూడా నాసిరకంగా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పిల్లర్ల వరకు పనులు బాగానే చేసినా స్లాబ్‌ మాత్రం వంకరలు తిరిగింది. దీర్ఘకాలం మన్నేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, కాంట్రాక్టర్‌ మాత్రంవైకుంఠధామం నాసిరకం పనులు చేసి, కొంతకాలానికే కూలిపోయేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు కూడా నిలిచిపోయాయి. జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు పల్లెప్రగతి పనులపై దృష్టి సారించి, పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇటువైపు ఒక్క అధికారి కూడా దృష్టిపెట్టడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మాణంలోనే నాసిరకంగా ఉంటే, తర్వాత కొన్నేైండ్లెనా ఉంటుందా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాసిరకంగా పనులు చేసి, బిల్లులు కాజేసేందుకు కాంట్రాక్టర్‌ ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని శ్మశాన వాటిక పనులు నాణ్యత జరిగేలా చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు. 

స్లాబ్‌ బాగా వేయలేదు

పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. స్లాబ్‌ మాత్రం నాసిరకంగా నిర్మించారు. ఇప్పుడే వంకరలు తిరిగిపోయాయి. కాంట్రాక్టర్‌ తప్పిదంతోనే నిర్మాణంలో నాణ్యత లోపించింది. 

 - కృష్ణ, గ్రామస్తుడు, గోధుమగూడ 

నాసిరకంగా నిర్మిస్తే బిల్లులివ్వం

గోధుమగూడలో వైకుంఠధామం స్లాబ్‌ వేసినప్పుడు చూశాం. మళ్లీ అక్కడకు వెళ్లలేదు. చాలా రోజుల వరకు శ్మశానవాటిక నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేరే ప్రాంతం కాంట్రాక్టర్‌తో నిర్మాణం చేయిస్తున్నాం. ప్రస్తుతం 50 శాతం బిల్లులు మాత్రమే చెల్లించాం. పనులు సరిగా జరుగకపోతే మిగతా బిల్లులు ఆపేస్తాం. 

- సుభాషిణి, ఎంపీడీవో, వికారాబాద్‌ 

VIDEOS

logo