శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Feb 19, 2021 , 02:50:13

లక్కు.. కిక్కు

లక్కు.. కిక్కు

  • వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌, 
  • రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో డ్రా వాయిదా
  • దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు గడువు 
వికారాబాద్‌, ఫిబ్రవరి 18, (నమస్తే తెలంగాణ) : గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో బార్ల కేటాయింపు కోసం లక్కీ డ్రా అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు. తాండూరులో రెండు షాపులకుగాను 67 దరఖాస్తులు వచ్చాయి.17వ నంబర్‌తో దరఖాస్తు చేసిన దుబ్బ సతీష్‌కుమార్‌ను, 18వ నంబర్‌తో దరఖాస్తు చేసుకున్న కల్వ ఉమాశంకర్‌లను అదృష్టం వరించింది. అలాగే పరిగిలో ఒక షాపునకు 80 దరఖాస్తులు రాగా...70వ నంబర్‌తో బర్కత్‌పల్లి రాంరెడ్డిని అదృష్టం తలుపుతట్టింది. మొత్తం నాలుగు బార్‌ షాపులకు 161 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1.61 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం మూడు బార్‌ షాపులకు సంబంధించి 147 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు. కొడంగల్‌లో అతి తక్కువగా 14 దరఖాస్తులు రావడంతో డ్రా వాయిదా పడింది. మరో వారం రోజులు గడువు పెంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ అధికారి వరప్రసాద్‌, సిబ్బంది ఉన్నారు. 

లక్కీ డ్రా ద్వారా ఆరు బార్లు కేటాయింపు

రంగారెడ్డి, ఫిబ్రవరి 18, (నమస్తే తెలంగాణ): జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సమక్షంలో బాలాపూర్‌లోని ఎస్‌పీఆర్‌ గార్డెన్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలో మొత్తం 9 బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. బండ్లగూడలో రెండు, శంకర్‌పల్లి, ఆమనగల్లు, తుక్కుగూడ, ఆదిబట్లలో ఒక్కో బార్‌ను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ఆరు బార్లలో రెండు బార్లు ఇద్దరు మహిళల పేరిట వచ్చింది. బార్లు పొందినవారు మూడు నెలల్లోగా బార్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎక్సైజ్‌ అధికారులు సూచించారు. జల్‌పల్లిలోని 3 బార్లకు కేవలం 36 దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా దరఖాస్తు చేసుకునేందుకుగాను మరో వారం రోజులు గడువు పొడిగించారు. జిల్లాలో 9 బార్లకుగాను 587 దరఖాస్తులురాగా రూ.5.87 కోట్ల ఆదాయం జిల్లా ఎక్సైజ్‌ శాఖకు సమకూరింది. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రఘురాం పాల్గొన్నారు. 

VIDEOS

logo