బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Feb 19, 2021 , 02:50:13

రిజర్వేషన్లు పెంచేలా ఒత్తిడి తెస్తా..

రిజర్వేషన్లు పెంచేలా ఒత్తిడి తెస్తా..

  • చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
  • సేవాలాల్‌ మహరాజ్‌ ఆశయసాధన కోసం గిరిజనులు కృషిచేయాలి
  • కులకచర్లలో సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి

కులకచర్ల, ఫిబ్రవరి 18 : గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతం పెంచేలా పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెస్తానని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. గురువారం కులకచర్లలో సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పునర్విభజన చట్టంతో తెలంగాణకు రావాల్సిన గిరిజన వర్సిటీ కోసం పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. లంబాడీలు అన్ని రంగాల్లో ముందుండేందుకు 500వరకు జనాభా ఉన్న గిరిజనతండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిందన్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులను కేటాయించిందని తెలిపారు. గిరిజనులు ఐక్యతతో తమ తండాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతుల కోసం అనుక్షణం తపించే కేసీఆర్‌ తెలంగాణకు సీఎం కావడం మన అదృష్టమన్నారు. గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్‌ మహరాజ్‌ గిరిజనుల అభివృద్ధి కోసం కృషిచేశారని.. ఆయన ఆశయాలను అనుసరించి మంచి సమాజం కోసం పాటుపడాలని సూచించారు. 

అధికారికంగా సేవాలాల్‌ జయంతి : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గిరిజనులపై ఉన్న ప్రేమతో వారి ఆరాధ్యదైవాన్ని పూజించేందుకు ఈ అవకాశం సీఎం కేసీఆర్‌ కల్పించడం అభినందనీయం. 

సంక్షేమ పథకాలతో సమస్యలు లేని గ్రామాలుగా..  : మనోహర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నేడు పల్లెలు సమస్యలు లేని గ్రామాలుగా మారుతున్నాయని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సేవాలాల్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు బాల్‌రాజ్‌నాయక్‌, కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాంచందర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్‌, ఎంపీటీసీ ఆనందం, టీఆర్‌ఎస్‌ నాయకుడు హరికృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్‌రావు, వివిధ గ్రామాలు, పలు పార్టీల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజన మహిళలున్నారు.


VIDEOS

logo