శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Feb 19, 2021 , 02:50:10

కోడ్‌ తర్వాత.. కొత్త రేషన్‌

కోడ్‌ తర్వాత.. కొత్త రేషన్‌

  • కొత్త  పింఛన్లు, రేషన్‌   దరఖాస్తుల  పరిశీలనలో వేగం
  • క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్న అధికారులు
  • లబ్ధిదారుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదుకు సన్నాహాలు
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ మరింత వేగవంతం
  • రెండు పథకాలకు కలిపి 17వేలకు పైగా దరఖాస్తులు

అర్హులైన మరింత ఎక్కువ మందికి త్వరలో కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల నాగార్జున సాగర్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించిన నేపథ్యంలో కొత్త లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో అది పూర్తయిన తరువాత ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ రెండు పథకాలకు సంబంధించి 17 వేలకు పైగా దరఖాస్తులు అందాయి.  వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు.  అనంతరం వీరి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జాబితాను సిద్ధం చేస్తారు. 

వికారాబాద్‌, ఫిబ్రవరి18,(నమస్తే తెలంగాణ): ఎన్నో రోజులుగా కొత్త పింఛన్‌, రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల బతుకుల్లో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పింఛన్‌, రేషన్‌ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇటీవల నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో వికారాబాద్‌ జిల్లాలో ఈ రెండు సంక్షేమ పథకాలకు సంబంధించి 17,682 దరఖాస్తుదారుల్లో ఆనందం వెల్లువెత్తింది. ఆగస్టు నుంచి వచ్చిన దరఖాస్తులకు లైన్‌క్లియర్‌ అయ్యింది. రేషన్‌కార్డులు, పింఛన్ల ఫైళ్లకు  కదలికలు రానున్నాయి. 

పెండింగ్‌లో 12వేల రేషన్‌ కార్డుల దరఖాస్తులు 

రేషన్‌ కార్డులపై ప్రస్తుతం సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆహార భద్రతా కార్డులకు మరింత డిమాండ్‌ పెరిగింది. కొంతకాలంగా కొత్త కార్డుల జారీ లేకపోవడంతో పేదలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉన్న కార్డుల్లో కొత్త వారిని చేర్చే ప్రక్రియ చేపట్టకపోవడంతో పేదలు రేషన్‌ కోసం అవస్థలు పడుతున్నారు.

ఆన్‌లైన్‌ పత్రాలతోనే రేషన్‌

ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో ఆన్‌లైన్‌లో కార్డుదారుల వివరాల ఆధారంగా అనుమతి పత్రాలు మాత్రమే అందుబాటులో ఉంచా రు. దీని ఆధారంగానే ప్రతి నెలా రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆ తర్వాత కుటుంబాల విభజన, కొత్త కుంటుంబాల ఏర్పాటుతో కొత్త కార్డులు మంజూ రు చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కొత్తగా కార్డు మంజూరుకు అర్హులైన వారి జాబితాలు సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ లాగిన్‌లో సిద్ధంగా ఉ న్నాయి. ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరుకు అనుమతిచ్చిన వెంటనే కార్డులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,34,560 రేషన్‌ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా ఆగస్టు నుంచి ఇప్ప టివరకు 12వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 

మరింత ఆసరా..

ఇప్పటి వరకు కొత్త పింఛన్ల మంజూరు లేకపోవడంతో చాలామంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి నెలా సామాజిక భద్రతలో భాగంగా అందించే పింఛన్లతో వృద్ధులు, వింతతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తమ బతుకుకు ఆసరాను అందుకోవాలని చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,682 మంది కొత్త పింఛన్‌ డబ్బులు ఏ నెలలో తమ చేతికి అందుతాయోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. వీరం తా ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీడీవోలకు దరఖాస్తులు చేసుకున్నారు. 

ప్రకటన రాగానే కలెక్టర్‌ అనుమతి

అక్కడి నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లాగిన్‌కు, అటు నుంచి కలెక్టర్‌ అనుమతి కోసం వెళ్తాయి. ఆయా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న వీటంన్నిటికి రాష్ట్రస్థాయిలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రకటనతో త్వరలోనే దరఖాస్తుదార్ల ఇండ్లలో సంతోషం కనిపింస్తుంది. జిల్లాలో 5,682 మంది కొత్త పింఛన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నారని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కృష్ణన్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.

ఆన్‌లైన్‌లో జాబితా సిద్ధం

ఇప్పటి వరకు జిల్లాలో 12 వేల దరఖాస్తులు వచ్చా యి. ఇవన్నింటి జాబితా ఆన్‌లైన్‌లో  సిద్ధంగా ఉంది. 7వేల వరకు కార్డుల్లో కొత్తగా పుట్టిన పిల్లల పేర్లు చేర్చేందుకు అనుమతి రావాల్సి ఉంది. 5 వేల వరకు కొత్త కార్డుల దరఖాస్తులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్డులు ఇచ్చేందుకు అవకాశం ఉంది.

- రాజేశ్వర్‌, సివిల్‌ సప్లయ్‌ జిల్లా అధికారి, వికారాబాద్‌

VIDEOS

logo