సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Feb 18, 2021 , 00:49:25

సంక్షేమ సారథికి సహస్ర హరితార్చన

సంక్షేమ సారథికి సహస్ర హరితార్చన

  • కోటి వృక్షార్చనకు అపూర్వ స్పందన
  • మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన జనం
  • రంగారెడ్డి జిల్లాలో 6 లక్షలు, వికారాబాద్‌ జిల్లాలో సుమారు 5.50 లక్షల మొక్కలు.. 
  • సేవాకార్యక్రమాలు  చేపట్టిన ప్రజాప్రతినిధులు, నేతలు

పల్లె, పట్టణం తేడా లేదు.. చిన్నా పెద్ద వ్యత్యాసం లేదు.. అందరూ ఒక్కటిగా కదిలారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు కోటి వృక్షార్చనలో మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు.. గ్రామానికి వెయ్యి చొప్పున మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్యులు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు.  తాండూరు  ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రక్తదానం చేశారు. పలువురు నేతలు ఆలయాల్లో సీఎం కేసీఆర్‌ పేరున ప్రత్యేక అర్చనలు చేయించారు. మరికొందరు అన్నదానాలు, రక్తదానాలతో పాటు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జీవకోటికి జీవనాధారం చెట్లు.. నేటి మొక్క రేపటి తరాలకు భవిష్యత్తు.. ప్రతి మొక్కను పసిపాపలా చూసుకుంటే మున్ముందు మానవాళిని చెట్లు అమ్మలా ఆదరిస్తయ్‌.. బుధవారం సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం ‘కోటి వృక్షార్చన’ దిగ్విజయమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పచ్చని మొక్కలతో ప్రతి పల్లె పచ్చ తోరణంలా మారింది. మీరంతా నేడు మాకు రక్ష.. మున్ముందు మీకు నేను రక్ష అన్నట్లుగా పచ్చని మొక్కలు పసిపాపలా బోసినవ్వులతో చూస్తున్నట్లుగా కళకళలాడాయి. మొక్కలను సంరక్షిద్దాం.. వనాలను పెంచుదాం.. హరిత తపస్వి సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరువేరుద్దాం..   

వికారాబాద్‌, ఫిబ్రవరి 17, (నమస్తే తెలంగాణ) 

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి, ఫిబ్రవరి 17, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమంలో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు 6 లక్షల మొక్కలు నాటారు. జిల్లా అంతటా ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్‌ గ్రామ జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో, తుక్కుగూడ మున్సిపాలిటీ తెలంగాణ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో మొక్కలు నాటడంతోపాటు మీర్‌పేట మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి నగరంలోని గణపతి దేవాలయంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. చేవెళ్ల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య కేక్‌ కట్‌ చేసి మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నం, దండుమైలారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆమనగల్లు మండలం రామనూతలలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, పరిగి రహదారిలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. ఆమనగల్లులో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు వెయ్యి చొప్పున మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు హరిత శుభాకాంక్షలు తెలిపారు. 

వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌, ఫిబ్రవరి 17, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటుగా తాండూరు, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ‘కోటి వృక్షార్చన’లో ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. జిల్లాలోని 566 పంచాయతీల్లో సుమారు 5.50 లక్షల మొక్కలు నాటారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ కేక్‌ కట్‌ చేసి పావురాలను ఎగుర వేశారు. అనంతరం రాజీవ్‌ గృహ కల్పలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించగా, ఎమ్మెల్యే ఆనంద్‌ వైద్య పరీక్షలు చేశారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్‌, యాలాల్‌, బషీరాబాద్‌ మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, స్వయంగా రక్తదానం చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని హస్నాబాద్‌, బొంరాస్‌పేటలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు.  

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ‘కోటి వృక్షార్చన’కు అపూర్వ స్పందన

మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నాటిన సుమారు 6 లక్షల మొక్కలు

వికారాబాద్‌ జిల్లా తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో మొక్కలు నాటిన పార్టీ శ్రేణులు

రక్తదానం చేసిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 

రాజీవ్‌ గృహకల్పలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆనంద్‌ 

పాల్గొన్న మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి


VIDEOS

logo