పండుగే.. అందరికీ

- వేడుకలకు టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సిద్ధం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం
- ‘కోటి వృక్షార్చన’కు సర్వం సిద్ధం
- మొక్కలు నాటనున్న సబ్బండ వర్ణాలు
- దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు.. రక్తదాన శిబిరాలు
కడుపులో ఉన్నప్పటి నుంచి వృద్ధాప్యం దాకా.. దాదాపు ప్రతీ వ్యక్తి, ప్రతీ దశలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తున్నారు. అందుకే ఆయన అందరి కుటుంబాల్లో ఒకడయ్యాడు.. అందుకోసమే... నేడు ఆయన పుట్టిన రోజు ప్రతి ఇంటా పండుగ రోజు అయ్యింది..
- కాన్పు చేసి పదమూడు వేల రూపాయలిచ్చి,
- కేసీఆర్ కిట్ ఇచ్చి పుట్టింటి సారె పెట్టి పంపుతున్నాడు..
- విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్లు, గురుకులాలు
- అనేక పథకాలతో.. విద్యాప్రదాతగా మారాడు..
- చదువు పూర్తయిన యువకులకు స్వయం ఉపాధి కల్పించి,
- ఉద్యోగ అవకాశాలు పెంచి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు..
- ఎదిగిన కూతురు భారమని బాధపడుతున్న తల్లిదండ్రులకు బాధ్యత తెలిసిన కొడుకై కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పేరిట లక్షా నూట పదహార్లు ఇస్తున్నాడు..
- వయసు మీద పడి కన్న బిడ్డలే పట్టించుకోకపోయినా,
- అండగా నిలిచి పింఛన్ అందిస్తున్నాడు..
- సాయం అవసరమైన వారికి ‘ఆసరా’గా నిలిచాడు.
- విధి వక్రించి అన్నదాత కాలం చేస్తే.. వారి కుటుంబానికి
- ఐదు లక్షలిప్పిస్తూ ఆపద్బాంధవుడవుతున్నాడు..
- కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు గొర్రెలిచ్చి, ఉచితంగా
- చేపలు పెంచే ఏర్పాట్లు చేసి కుల బాంధవుడు అయ్యాడు.
ఇంకా.. ఇంకా.. అనేకమందికి నేనున్నానని భరోసా ఇస్తున్నాడు.. అందుకే ఈ పుట్టినరోజును ప్రతీ ఇంటా పండుగలా భావిస్తున్నారు.. నేనున్నానని ఆదుకుంటున్న ఆపద్బాంధవుడిని ‘శతమానం భవతి’ అని దీవిస్తున్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించడమే కాకుండా, మిగతా రాష్ర్టాలతో పోటీగా అగ్రగామిగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేడు... ఈ సందర్భంగా కోటి వృక్షార్చన పేరుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పా ట్లు చేశారు.. ప్రతి గ్రామంలో కనీసం వెయ్యి మొక్కలు నాటాలని సంకల్పించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని హరితస్ఫూర్తిని చాటాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
- ప్రజాశ్రేయస్సుకు అనేక పథకాలు అమలు
- రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు అండ
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసా
- కుల సంఘాలకూ ప్రోత్సాహం
- సర్కార్ బడుల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం
- ఆసరా ఫించన్లతో వృద్ధులు, దివ్యాంగులకు ధీమా
- తాగునీటి కష్టాలు తీర్చిన మిషన్ భగీరథ
- దేశానికే ఆదర్శంగా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు
సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలిచింది. గర్భిణీ నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ బాంధవుడిగా నిలుస్తున్నారు. గతంలో పేరుకు సంక్షేమ పథకాలు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సంక్షేమ పథకాల అమలు తీరు పూర్తిగా మారింది. గతంలో పైరవీలు చేస్తే తప్ప సంక్షేమ ఫలాలు అందేవికావు. ఇప్పుడు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతుండడం హర్షణీయం. అలాంటి నేత, సీఎం కేసీఆర్ పుట్టినరోజు అంటే కేవలం సొంత పార్టీ వారికే కాకుండా అన్ని వర్గాల వారికీ పండుగగా చెప్పవచ్చు. ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందడంతో సకల జనుల హృదయాల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయారు.
వికారాబాద్, ఫిబ్రవరి 16,
రంగారెడ్డిజిల్లాలో సంక్షేమ పథకాలు ఇలా...
షాబాద్, ఫిబ్రవరి 16 : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ ఫలం అందింది. రైతుబంధు ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 14,24,474లక్షల మంది రైతులకు ఎకరాకు రూ. 5వేల చొప్పున రూ. 1,618కోట్లు అందించింది. ప్రతినెలా 1,66,820 మంది లబ్ధిదారులకు ఆసరా పథకంతో రూ.40కోట్ల వరకు పింఛన్లను అందజేస్తున్నది. గొల్ల, కుర్మల సంక్షేమానికి మొదటి విడుతలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 75శాతం సబ్సిడీపై రూ.141 కోట్లు ఖర్చు చేసి 11,312 యూనిట్లకు గాను 2,37,552 గొర్రెలను అందించింది. మత్స్యకారుల సంక్షేమానికి జిల్లాలోని 579 చెరువుల్లో 1,29కోట్ల ఉచిత చేప పిల్లలను వదిలారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల కోసం వచ్చిన మహిళలకు రూ. 52,83కోట్లతో 1,86,774 కేసీఆర్ కిట్స్ అందించారు. 19లక్షల మందికి కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు చేసి, మందులను పంపిణీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1,33లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. జిల్లాలో 54 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నది. జిల్లావ్యాప్తంగా అంతారం, కమ్మదనం, ముచ్చర్లలో మిషన్ భగీరథతో 662 గ్రామాలకు ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.లక్షా 116 సాయాన్ని అందజేస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలతోపాటు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
గర్భిణీ నుంచి మొదలుకొని...
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. గర్భంలోని శిశువు ఎదుగుదల కోసం, తల్లి ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం అమలులో ఉన్నది. ప్రతి నెలా బియ్యం, నూనె, కోడిగుడ్లు, పాలు, పప్పు అందిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 13,880 మంది గర్భిణులకు నెలకు 811.6 క్వింటాళ్ల బియ్యం, 5వేల లీటర్ల నూనె, 129.55 క్వింటాళ్ల కందిపప్పు, 12,89,422 కోడిగుడ్లు, 63,236 లీటర్ల పాలు అందజేస్తున్నది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు చిన్నారులు 33,974 మంది, ప్రీ స్కూల్ విద్యార్థులు 20,364 మందికి బాలామృతం నెలకు 2,667 క్వింటాళ్లు అందజేయడం జరుగుతున్నది.
చక్కటి చదువులకు అవకాశాలు..
తెలంగాణలో విద్యావకాశాలు మెరుగయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన విద్య అందుతున్నది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు అదనంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, షూస్, బ్లాంకెట్లనూ అందిస్తున్నది. నిరుపేద విద్యార్థులకు చక్కటి వసతులతో ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఏర్పాటుతో ఆయా వర్గాల వారికి విద్య అందుతున్నది. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి రూ.లక్ష ఖర్చు చేస్తుందంటే సీఎం కేసీఆర్ గొప్ప మనస్సును అర్థం చేసుకోవచ్చు. గతంలో నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల ఉండేది. నేడు ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి ఆరు వరకు ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,003 ఉండగా, 74,481 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
‘కేసీఆర్ కిట్'తో ప్రోత్సాహకం..
సర్కారు దవాఖానల్లో ప్రసవం జరిగితే ‘కేసీఆర్ కిట్'తోపాటు ఆడ శిశువు పుడితే రూ.13వేలు, మగ శిశువు పుడితే రూ.12వేలను ప్రభుత్వం అందజేస్తున్నది. గతంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వేల రూపాయలను ఖర్చు చేసేవారు. ‘కేసీఆర్ కిట్'తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 23,982 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు, రూ.25.74కోట్లను ప్రభుత్వం అందజేసింది.
‘ఆసరా’తో అండగా..
గతంలో పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఆరు నెలలకు ఒకసారి పింఛన్ డబ్బులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.వెయ్యి, దివ్యాంగులకు రూ.1500 వరకు పింఛన్ పెంచారు. ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ బాధితులకు, ఫైలేరియాతో బాధపడుతున్న వారికి పింఛన్లు అందుతున్నాయి. రెండోసారి గెలుపొందిన తర్వాత ‘ఆసరా’ పింఛన్లు వెయ్యి నుంచి రూ.2016, దివ్యాంగులకు రూ.3016లకు పెంచారు. తద్వారా వారి కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 98,333 మందికి నెలకు రూ.21.05కోట్లు పింఛన్ డబ్బులు అందుతున్నాయి.
రైతు సంక్షేమానికి..
రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా నిలిచారు. పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. మొదట రెండు పంటలకు ఎకరాకు రూ.8వేలు అందజేయగా, ప్రస్తుతం రూ.10వేలు అందుతున్నాయి. జిల్లాలో 2,15,700 మంది రైతులకు రూ.297 కోట్లు పెట్టుబడి సాయం అందుతున్నది. ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే, ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే సదుద్దేశంతో రూ.5లక్షలు బీమా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ప్రతి సంవత్సరం బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 2018 నుంచి ఇప్పటి వరకు 1,780 మంది రైతులు మృతి చెందగా, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున అందాయి.
ఆడబిడ్డల పెండ్లికి మేనమామగా..
ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ పేద కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి మేనమామ పాత్రను పోషిస్తున్నారు. మొదటగా రూ.50వేలు అందించగా, ప్రస్తుతం రూ.లక్షా116 ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ పథకాలతో వేలాది మందికి లబ్ధి చేకూరింది. కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం లబ్ధి చేకూరుతున్నది.
కంటికి వెలుగునిచ్చేలా..
గతంలో ఏదైనా సంస్థ వారు, దవాఖానలవారు కంటివైద్య శిబిరాలు నిర్వహించి, కంటి ఆపరేషన్లు చేసేవారు. రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 22 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంతో 3,88,267 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. వారిలో 56,047 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న 13,818 మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. 592 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. ఇలా అన్ని వర్గాల కోసం పని చేసే సీఎం కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకంపై ఉన్నది.