భళా.. యాలాల్

- గణనీయమైన ప్రగతి
- పచ్చదనం, పరిశుభ్రతతో పరిసరాలు
- అద్దంలా సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, జిగేల్మనే లైట్లు
- ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేందుకు ప్రకృతి వనం
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం యాలాల్ గ్రామాన్ని చూసిన వారెవరైనా భళా యాలాల్ అంటూ ప్రశంసించాల్సిందే. ‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలు దర్శనమిస్తాయి. ట్రాక్టర్‌తో నిత్యం చెత్త సేకరణ వల్ల ఏ వీధికెళ్లినా శుభ్రంగా కనిపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనంలో ప్రత్యేక కుర్చీలు, వాకింగ్ ట్రాక్, రకరకాల బొమ్మల చిత్రాలు వేయడంతో చిన్నారులకు ఆనంద వనంగా మారింది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు చదువుల నిలయమైంది. రాత్రి వేళల్లో వాడవాడలా ఎల్ఈడీ లైట్ల కాంతులు పట్టపగలును తలపిస్తున్నాయి. రైతు వేదిక, కల్లాలు, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, సీసీ రోడ్లనూ నిర్మించారు.
- ‘పల్లె ప్రగతి’కి తోడుగా గ్రామస్తుల
- ఐకమత్యంతో పల్లె రూపురేఖలే మారాయి.
తాండూరు, ఫిబ్రవరి 14: పల్లెల సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యాచరణ అమలుతో యాలాల్ పంచాయతీ కొత్తరూపును సంతరించుకున్నది. పల్లె ప్రగతితో పాటు గ్రామాభివృద్ధికి విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనులతో గ్రామం నందనవనంగా మారింది. పల్లె ప్రకృతి వనంలో విద్యార్థులు చదువుకునేందుకు, చిన్నారులు ఆడుకునేందుకు, ప్రజలు వాకింగ్ చేస్తూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు, ఆహ్లాదం, ఆనందంగా గడిపేందుకు ఉపయోగపడుతున్నది. ప్రతి వార్డులో అద్దంలా రోడ్లు, రాత్రివేళలో కాంతులు విరాజిమ్ముతున్న ఎల్ఈడీ లైట్లు పల్లెకు నూతన శోభను తీసుకొచ్చాయి. రైతుల సమావేశం కోసం ఏర్పాటు చేసిన రైతువేదిక, పంటల రాశి కోసం ఏర్పాటు చేస్తున్న కల్లాల నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి. తడి, పొడి చెత్త కోసం డంపింగ్ యార్డు, మొక్కల పెంపకానికి నర్సరీలతో పాటు పాడుబడ్డ బావులు, ఇండ్లు, గుంతలు పూడ్చడంతో ఊరు శుభ్రంగా కనిపిస్తున్నది. చెత్త సేకరణ, అత్యవసర పరిస్థితుల్లో నీళ్లతో పాటు పలు పనుల కోసం తెచ్చిన ట్రాక్టర్‌తో సులభంగా పనులు పూర్తవుతున్నాయి. వైకుంఠధామం నిర్మించడంతో అందరికీ ఉపయోగంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి యాలాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చింది.
అభివృద్ధికి నిదర్శనం..
యాలాల్ పంచాయతీ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. పల్లెల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడంతో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా రూ.3 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.50 లక్షలతో కంపోస్టు, డంపింగ్ యార్డు, రూ.2 లక్షలతో నర్సరీ, రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.8.50 లక్షలతో ట్రాక్టర్‌తో పాటు రూ.62 లక్షల 14వ ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్లు, రూ.7 లక్షల ఎస్ఎఫ్సీ నిధులతో మురుగు కాల్వలు, రూ.50 లక్షల స్టేట్ ఫైనాన్స్ నిధులతో కిలో మీటర్ బీటీ రోడ్డు, రూ.25 లక్షల జడ్పీనిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, రూ.2.50 లక్షల డీఎంఎఫ్ నిధులతో తాగునీటి శుద్ధి కేంద్రం, అభివృద్ధి పనులు జరిగాయి.
ఆటపాటల నందనవనం..
పల్లె ప్రగతిలో భాగంగా యాలాల్ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో (పార్కు) నీడ నిచ్చే చెట్లు, రకరకాలు పూల మొక్కలు, సేద తీర్చుకునేందుకు ప్రత్యేక కుర్చీలు, వాకింగ్ ట్రాక్, రకరకాల బొమ్మల చిత్రాలు కంటికి ఇంపుగా, విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల ఆటపాటలతో, విద్యార్థుల గ్రూప్ స్టడీతో ఆనందనవనం సందడిగా మారింది.
సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారు
మా ఊళ్లో అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి. ఏ సమస్య ఉన్నా ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పరిష్కరిస్తున్నారు. పల్లె ప్రగతితో పల్లెలు ఆదర్శంగా రూపుదిద్దుకుంటున్నాయి. అందరూ సమన్వయంగా పనిచేస్తూ గ్రామంలో గుణాత్మక మార్పు తీసుకురావడం చాలా సంతోషం.
- కే.నాగురావు, యాలాల్
రెండేండ్లలో చాలా అభివృద్ధి చేశాం
రెండేండ్లలో మా ఊరిలో చాలా అభివృద్ధి పనులు చేశాం. సీఎం కేసీఆర్ చెప్పినట్లు పల్లెప్రగతిలో ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికతో పంచాయతీలో నిత్యం పరిశుభ్రత, పచ్చదనం పనులు చేస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న 35 పాడుబడిన ఇండ్లు, 36 పాత బావులు కూల్చేశాం. పల్లెప్రకృతి వనం, కంపోస్టు యార్డు, డంపింగ్‌యార్డు, నర్సరీ, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, నీటి శుద్ధి కేంద్రం, ఇలా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నాం. చక్కటి ప్రణాళికను రూపొందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- సిద్రాల సులోచన, సర్పంచ్
గ్రామాభివృద్ధి జరుగుతున్నది
పల్లె ప్రగతిలో అందరూ ఉత్సహంగా పాల్గొంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయంతో గ్రామాభివృద్ధి వేగంగా జరుగుతున్నది. పల్లె ప్రగతిలో ప్రభుత్వం సూచించిన పనులన్నీ జరుగుతున్నాయి. పంచాయతీకి ప్రత్యేక నిధులు తీసుకురావడంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పచ్చదనం, పరిశుభ్రతతో యాలాల కళకళలాడుతున్నది. ఇందుకు సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
- పి.రేఖ, పంచాయతీ కార్యదర్శి
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!