ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఆదేశాలు జారీ
- 16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ
- 24న పరిశీలన, 26 వరకు ఉపసంహరణకు గడువు
- మార్చి 14న పోలింగ్
- వికారాబాద్ జిల్లాలో 25,544 మంది ఓటర్లు
- పురుషులు 17,802, మహిళలు 7739
- 38 పోలింగ్ కేంద్రాలు
వికారాబాద్, ఫిబ్రవరి 13, (నమస్తే తెలంగాణ) : మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 24న పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు, మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 17న హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలని, ఇందుకుగాను జిల్లా వైద్య శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జోనల్ ఆఫీసర్లు రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, తాసిల్దార్ సుధ పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ జిల్లాలో 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మోమిన్‌పేటలో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నందున ఒక కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2021 జనవరి 22 నాటికి 25,544 మంది ఓటర్లు కాగా.. ఇందులో పురుషులు 17,802, మహిళలు 7739 ఉన్నారని పేర్కొన్నారు.