శనివారం 06 మార్చి 2021
Vikarabad - Feb 14, 2021 , 01:00:28

నస్కల్.. జిగేల్

నస్కల్.. జిగేల్

  • పకడ్బందీగా పల్లె ప్రగతి పనులు
  • మారిన గ్రామ రూపురేఖలు
  • పల్లె ప్రకృతివనం, వర్మీ కంపోస్టు యార్డు, వైకుంఠధామం, రైతు వేదికల నిర్మాణం పూర్తి 
  • మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
  • పచ్చదనం, పరిశుభ్రతతో మెరుస్తున్న రహదారులు 
  • ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
  • సీసీ రోడ్లు, నర్సరీలో మొక్కల పెంపకం 
  • రైతువేదిక, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం,
  • సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్డు నిర్మాణం 

పరిగి, ఫిబ్రవరి 13 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా నస్కల్‌ గ్రామం ప్రగతి పథంలో సాగుతుండడంతో పల్లె రూపురేఖలు మారాయి. గ్రామంలో 700 పైచిలుకు కుటుంబాలుండగా, 3,100 జనాభా ఉన్నది. 30 గుంటల స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో 2వేల మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి అహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. నిత్యం నీరు పెడుతుండడంతో పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నాయి.  గ్రామ నర్సరీలో 11వేల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. వాటర్‌ట్యాంకర్‌ కొనుగోలుతో నీటి ఇక్కట్లు తొలిగాయి. 

రూ.22లక్షలతో రైతువేదిక..

క్లస్టర్‌ కేంద్రం నస్కల్‌ గ్రామంలో రూ.22లక్షలతో రైతువేదికను నిర్మించగా, ఇటీవల మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. గ్రామంలో అధిక శాతం కొత్తిమీర సాగు చేస్తుండడంతో ఉద్యానవన శాఖ కమిషనర్‌ లోక వెంకట్రామ్‌రెడ్డి రైతువేదికలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నస్కల్‌ను కూరగాయల హబ్‌గా మార్చేందుకు అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు.  గ్రామంలో రెండు ‘మిషన్‌ భగీరథ’ ట్యాంకుల నిర్మాణం పూర్తి కాగా,  నల్లా కనెక్షన్ల పనులు చివరి దశలో ఉన్నాయి. రూ.12లక్షల నిధులతో వైకుంఠధామం నిర్మాణం పూర్తయింది. ఇందులో రెండు దహనవాటికలు, విశ్రాంతి గది, మరుగుదొడ్లను సైతం నిర్మించారు. 

నిత్యం చెత్త సేకరణ.. 

రూ.11లక్షలు వెచ్చించి ట్రాక్టర్‌, ట్రాలీ, డోజర్‌, ట్యాంకర్‌ కొనుగోలు చేశారు. నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు.  రూ.2లక్షలతో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్డును నిర్మించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్డులో కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలకు జరిగిన శిక్షణ అనంతరం నస్కల్‌ షెడ్డులో చెత్తను వేరుచేసి, కంపోస్టు ఎరువును తయారీని చూపించారు.

ప్రతినెలా వచ్చే నిధులతో అభివృద్ధి పనులు.. 

‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించే నెలనెలా నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారు. నస్కల్‌ గ్రామానికి నెలకు సుమారు రూ.4.18లక్షల చొప్పున సంవత్సరానికి రూ.49.60 లక్షలను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను చేస్తున్నారు. 

పల్లె మారింది.. 

‘పల్లె ప్రగతి’తో పల్లె రూపురేఖలు మారాయి. ట్రాక్టర్‌తో నిత్యం చెత్తను సేకరిస్తున్నాం. కొనుగోలు చేసిన ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లు పడుతున్నాం.  వైకుంఠధామం, కంపోస్టు షెడ్డును నిర్మించాం. కంపోస్టు ఎరువు తయారీ కొనసాగుతున్నది. రైతువేదిక నిర్మాణంతో రైతులు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.  ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.4.18లక్షల నిధులు వస్తున్నాయి. సిబ్బంది వేతనాలు, కరెంటు బిల్లు చెల్లింపులు పోను మిగతా నిధులను అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నాం. 


VIDEOS

logo