ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Feb 11, 2021 , 00:17:33

అంగన్ వాడీల్లో చిన్నారులకూ పాలు

అంగన్ వాడీల్లో చిన్నారులకూ పాలు

  • ఆరేండ్ల వయస్సువరకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు
  • పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకే..
  • వికారాబాద్‌ జిల్లాలో 60,755 మంది చిన్నారులకు లబ్ధి 

ఆర్థిక ఇబ్బందులు, తదితర కారణాలతో కొందరు  తల్లిదండ్రులు చిన్నారులకు పోషకాహారం అందించడంపై దృష్టి పెట్టడంలేదు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నది. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో పేరు నమోదై ఉన్న 7 నెలల నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు పాలు పంపిణీ చేయనున్నది.  ఇప్పటివరకు గర్భిణులు, బాలింతలకే పాలు అందజేస్తుండగా..  ఇక నుంచి చిన్నారులకూ అందించాలని నిర్ణయించారు.  దీంతో వికారాబాద్‌ జిల్లాలోని 1107 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 60,755 మంది చిన్నారులకు మేలు కలుగనున్నది. ప్రతి రోజు ఒక్కొక్కరికి 200 మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేయనున్నది.  ఈ లెక్కన జిల్లాకు దాదాపుగా 13800 లీటర్ల పాలు అవసరం కానున్నాయి.

వికారాబాద్‌, ఫిబ్రవరి 10, (నమస్తే తెలంగాణ) : ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఎదిగే చిన్నారుల ఆరోగ్యం కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నది. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పాలను పంపిణీ చేయనున్నది. తొలిసారి జిల్లాలో 7 నెలల నుంచి 3 ఏండ్ల లోపు చిన్నారులు 35,175 మంది, 3-6 ఏండ్ల లోపు చిన్నారులు 25,580 మంది, మొత్తం 60,755 మంది చిన్నారులకు పోషకాహారం అందనున్నది. 

1,107 కేంద్రాలు..

వికారాబాద్‌ జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో మినీ అంగన్‌వాడీలు 969, మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 138, మొత్తం 1,107 కేంద్రాలు జిల్లాలో సేవలందిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలకు గుడ్లు, భోజనం, పాలను అందజేస్తున్నారు. 6 ఏండ్లలోపు చిన్నారులకు గుడ్డు, బాలామృతం అందజేస్తున్నారు. ఇక నుంచి చిన్నారులకు పాలనూ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో తెలిపారు. నిత్యం ఒక్కొక్కరికి 200 మి.లీ పాలను అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. 7 నెలల నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులకు పాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలోని 60,755 మంది చిన్నారులకు దాదాపుగా 13,800 లీటర్ల పాలను సరఫరా చేయనున్నారు. జిల్లాలోని కొడంగల్‌, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్‌ ప్రాజెక్టుల పరిధిలో 18 మండలాల్లోని 560 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపుగా 80 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయం, కూలీ పనులు, కార్మికులుగా పనులు చేస్తుంటారు. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చిన్నారులకు పాలను సరఫరా చేయాలని భావిస్తున్నది. 

ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం..

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో చిన్నారులకు పాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గర్భిణులు, బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలకు గుడ్డు, భోజనం, పాలను అందజేస్తున్నాం. ప్రస్తుతం చిన్నారులకు గుడ్డు, బాలామృతం మాత్రమే  అందజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత చిన్నారులకూ పాలను అందించనున్నాం. 

-లలితాకుమారి, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి 

VIDEOS

logo