ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Feb 05, 2021 , 00:31:19

కొక్కెర వ్యాధినా.. డయేరియానా..?

కొక్కెర వ్యాధినా.. డయేరియానా..?

  •  దోర్నాల్‌లో కోళ్లు, కాకుల మృతిపై పోస్టుమార్టం 
  •  గ్రామంలో పరిశీలించిన వైద్య బృందం, పోలీసులు
  •  రక్త నమూనాలను సేకరించిన వెటర్నరీ బయలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌  (వీబీఆర్‌ఐ) ఏడీ డాక్టర్‌ శిరీష

వికారాబాద్‌, ఫిబ్రవరి 4, (నమస్తే తెలంగాణ): ధారూరు మండలం దోర్నాల్‌లో ఐదు రోజులుగా అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడతున్న కోళ్లు, కాకులకు సోకింది కొక్కెర వ్యాధినా..? డయేరియానా..? అని పశువైద్యాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రెండు వ్యాధులేనా లేకపోతే ఇంకా ఏదైనా కలుషిత ఆహారం తిని మృతి చెందుతున్నాయా అని పశువైద్యాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా గ్రామంలో కోళ్లు, కాకులు 100 పైగా మృత్యువాత పడడంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పశు వైద్యుల బృందం రెండు, మూడు రోజులుగా గ్రామంలో పర్యటించి వ్యాధి బారినపడిన కోళ్లకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల బృందం, పోలీసుల ఆధ్వర్యంలో చనిపోయిన కోళ్లను పరిశీలించి, అక్కడే పోస్ట్‌మార్టం చేసి రక్త నమూనాలు సేకరించారు. నీరసంగా ఉన్న కోళ్లు, చనిపోయిన కాకుల రక్త నమూనాలు సేకరించారు. గురువారం వెటర్నరీ బయాలజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ హైదరాబాద్‌కు పంపించారు. ప్రధానంగా కోళ్లకు కొక్కెర వ్యాధినా..? డయేరియానా? లేకపోతే కలుషిత ఆహారం తినడం, మురుగు కాల్వల్లోని నీళ్లలో విషం కలిసిందా? లేదా గ్రామ శివారులోని పంట పొలాల్లో పురుగు మందు పిచికారీ చేస్తే కోళ్లు, కాకులు తిన్నాయా..? అని పశువైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కోళ్లకు ప్రత్యామ్నాయంగా యాంటిబయాటిక్‌ పౌడర్‌ ఇచ్చారు. ల్యాబ్‌ రిపోర్టు ఆధారంగా ఏ వ్యాధి సోకిందనేది మరో రెండు రోజుల్లో తేలనున్నదని వికారాబాద్‌ జిల్లా పశుసంవర్థ శాఖ అధికారి వసంత కుమారి తెలిపారు. గ్రామంలో మృతి చెందిన రెండు మూడు కోళ్లను వైద్యాధికారులు పరిశీలించారని, వాటిలో బర్డ్‌ ఫ్లూ లక్షణాలు, వైరస్‌ లేవని ఆమె వెల్లడించారు. కోళ్లకు పోస్టుమార్టం చేస్తే పొట్టలో నట్టలు (వైరల్‌ డీస్డీడ్‌) ఉన్నట్లు గుర్తించాం. కానీ ఇదే ప్రధాన కారణమని చెప్పలేమన్నారు. ల్యాబ్‌ ఫలితాల ఆధారంగానే చికిత్స చేస్తామన్నారు. 

గ్రామంలో పర్యటించిన అధికారులు

ధారూరు, ఫిబ్రవరి 4: దోర్నాల్‌లో ఐదు రోజులుగా అంతు చిక్కని వ్యాధితో కోళ్లు, కాకులు 100పైగా మృత్యువాత పడ్డాయి. దీంతో గ్రామంలో పశు వైద్య డాక్టర్ల బృందం రెండు రోజులుగా పర్యటించి, పరిశీలిస్తున్నారు. కోళ్లకు, కాకులకు ఏ వ్యాధి సోకిందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని బొక్కల ఫ్యాక్టరీతో ఈ వ్యాధి వస్తున్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

వైద్య పరీక్షల ఆధారంగా చికిత్స

దోర్నాల్‌లో ఐదు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయనే సమాచారంతో రెండు రోజులుగా గ్రామంలో కోళ్ల పెంపకందారులను కలుస్తున్నాం. మృతి చెందిన కోడి, నీరసంగా ఉన్న కోడి, కాకి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. వాటి ఫలితాల ఆధారంగానే చికిత్స చేస్తాం. 

 - ప్రహ్లాద్‌, సదానందం వికారాబాద్‌ ఏడీలు

ల్యాబ్‌ రిపోర్టు వచ్చేంత వరకు నిర్ధారించలేం 

దోర్నాల్‌లో మృతి చెందిన కోళ్లు, కాకుల రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని వీబీఆర్‌ఐ (వెటర్నరీ బయాలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) ల్యాబ్‌కు పంపిస్తున్నాం. గ్రామంలో మృతి చెందిన కోళ్లు, కాకులను పరిశీలించాం. ల్యాబ్‌ రిపోర్టు వచ్చేంత వరకు ఏ వ్యాధి అనేది నిర్ధారణ చేయలేం.  పరిశీలించిన వాటిలో బర్డ్‌ఫ్లూ, వైరస్‌ లక్షణాలు లేవు. నట్టలు ఉన్నాయి. ల్యాబ్‌ ఫలితాల ఆధారంగానే చికిత్స చేస్తాం.

- డాక్టర్‌ శిరీష, వీబీఆర్‌ఐ ఏడీ 

VIDEOS

logo