శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Feb 05, 2021 , 00:31:23

‘ప్రగతి’ ఫలం పూల వనమై

‘ప్రగతి’ ఫలం పూల వనమై

 • అభివృద్ధిలో నారాయణపూర్‌ నం-1
 • పల్లెకు పచ్చందం తెచ్చిన ప్రకృతి వనం
 • పల్లె ప్రగతిలో 99 శాతం సక్సెస్‌
 • రూ.30లక్షల వ్యయంతో  పలు అభివృద్ధి పనులు
 • నాడు పల్లెలంటే  సమస్యల 
 • నిలయాలు.. నిర్లక్ష్యానికి ప్రతీకలు. 
 • మరి నేడు.. పల్లెతల్లి పచ్చచీర కట్టి 
 • కొత్త సొబగులద్దుకుంటున్నది. 

‘ప్రగతి’ ఫలాలు పల్లె చిత్రాన్ని మార్చేస్తున్నాయి. చెత్త సమస్య పరి ష్కారమై కంపోస్ట్‌ షెడ్లుగా మారాయి... పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతుండడంతో వీధులన్ని పరిశుభ్రంగా మారాయి.  పల్లె ప్రకృతి వనాలుగ్రామాల రూపురేఖలనే మార్చాయి. వాకింగ్‌ ట్రాక్‌లు, ఊయలలు, దారికి ఇరువైపులా  పూలమొక్కలతో హరిత శోభను సంతరించుకున్నాయి. పల్లె ప్రగతి పనుల్లో 99 శాతం పూర్తి చేసి ఆదర్శప్రాయంగా నిలిచింది.. వికారాబాద్‌ సమీపంలోని నారాయణపూర్‌. గ్రామానికి పాలకవర్గం లేకున్నా.. నారాయణపూర్‌ గ్రామంలో అభివృద్ధి ఆగలేదు. పల్లె ప్రగతి అమలులో నంబర్‌వన్‌గా నిలిచి విజిలెన్స్‌ అధికారుల మెప్పు పొందింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, వంద శాతం ఇంటి పన్ను వసూలుతో ఆదర్శ గ్రామంగా నిలిచింది. రూ.30లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రకృతి వనాలు, వర్మీకంపోస్టు షెడ్లు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల తదితర వసతుల కల్పన పూర్తవడంతో గ్రామస్తులు మురిసిపోతున్నారు. 

 • వంద శాతం ఇంటి పన్ను వసూళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం 
 • ఇటు పంచాయతీ, అటు మున్సిపాలిటీ కాదు
 • ప్రత్యేకాధికారి పాలనలో పరుగులు తీసిన అభివృద్ధి 
 • ఆదర్శంగా నిలుస్తున్న నారాయణపూర్‌ గ్రామం

ఆ పల్లెకు పాలకవర్గం లేకున్నా ప్రగతిలో దూసుకెళ్తున్నది. విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేసి 99 శాతం ప్రగతి సాధించినట్లు  ధ్రువీకరించారు. వంద శాతం ఇంటి పన్ను వసూళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం గ్రామస్తుల ఐక్యతను చాటింది. పురాతన ఇండ్ల తొలిగింపు, పడావుపడ్డ బావుల మూసివేత పనులనూ పూర్తి చేశారు. ‘30 రోజుల ప్రణాళిక’లో రూ.30లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. ప్రతి నెలలో తాగునీటి ట్యాంకును మూడు సార్లు శుభ్రం చేస్తూ స్వచ్ఛతలోనూ ఔరా అనిపిస్తున్నారు. ప్రతి పనిలో ముందుంటూ పరిసర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది వికారాబాద్‌ మండలంలోని నారాయణపూర్‌ గ్రామం.

వికారాబాద్‌, ఫిబ్రవరి 4, (నమస్తే తెలంగాణ) : ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో నారాయణపూర్‌ గ్రామ రూపురేఖలు మారాయి. ప్రగతిలో ఫస్ట్‌ వరుసలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతికి 30 రోజుల ప్రణాళిక’ సత్ఫలితాలనిచ్చింది. గ్రామంలో వర్మీకంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీల ఏర్పాటుతోపాటు రైతు వేదికను నిర్మించారు. ప్రతి నెలా 14వ ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్నులు వసూళ్లు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనానికి రూ.31వేలు, రైతు వేదిక రూ.22లక్షలు, నర్సరీ ఏర్పాటుకు రూ.20వేలు, వైకుంఠధామం నిర్మాణానికి రూ.10లక్షలు, కల్లాల నిర్మాణానికి రూ.73వేలు, డంపింగ్‌ యార్డు నిర్మాణానికి రూ.2.50లక్షలు, వర్మీ కంపోస్టు రూ.20వేలు ఇలా నిధులు ఖర్చు చేశారు. 

25 గుంటలు.. 2800 మొక్కలు..

నారాయణపూర్‌ గ్రామంలో 25 గుంటల భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో 2800 మొక్కలను నాటడంతో అందమైన పచ్చని వనం తయారైంది.  తులసీ, దానిమ్మ, ఉసిరి, జామ, బంతి, కలబంద, కొబ్బరి, నిమ్మ, బాదం, లెమన్‌ గ్రాస్‌, మందారం, గులాబీ, మైదాకు, గుల్‌మోర్‌, టేకు, అల్లనేరేడు, కానుగ తదితర మొక్కలను నాటారు. ఆకర్షణీయమైన పూల మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దాతల సహకారంతో బల్లలు, ఉయ్యాలనూ ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరీ, మొక్కలకు డ్రిప్‌ పరికరాలను అమర్చారు. ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడుతుండడంతో చూపరులు మంత్రముగ్ధులు అవుతున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేసి అమ్ముతున్నారు. వర్మీకంపోస్టు తయారీతో పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్‌కు గణతంత్ర వేడుకల్లో బెస్ట్‌ అవార్డు దక్కింది. మేకల షెడ్‌, కల్లాల నిర్మాణం సాగుతున్నది. ‘మిషన్‌ భగీరథ’తో 270 నల్లా కనెక్షన్లతో తాగునీటిని అందిస్తున్నారు. గ్రామంలో 310 ఇండ్లు ఉండగా, 1000 మంది జనాభా ఉన్నది.  

వికారాబాద్‌ మండలం నారాణయపూర్‌ గ్రామాన్ని గడిచిన ఎన్నికల సమయంలో వికారాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. మండలంలోని ఏడు పంచాయతీలను వికారాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలుపాలని నిర్ణయించగా, కేవలం ఈ ఒక్క గ్రామానికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ కోడ్‌ నమోదు చేయకపోవడంతో ఇటు మున్సిపల్‌ పరిధిలో.. అటు పంచాయతీ పరిధిలో లేకుండా పోయింది. దీంతో రెండున్నర ఏండ్లుగా ఎన్నికలు జరుగలేదు. అధికారులు స్పెషల్‌ ఆఫీసర్‌గా మండల ఎంపీవో నాగరాజును నియమించారు. గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామ పాలకులు లేకున్నా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. 

ఒకప్పటి తీరు.. ఇప్పటి మార్పు

 • తెలంగాణ రాకముందు పల్లెంతా పాసిపాసిగా ఉండేది..!! 
 • పొద్దత్తమానం పనిజేసి వత్తుంటే తొవ్వెంట చీదారమే.. చీదారం..!!
 • అప్పుడున్న సర్కారోళ్లు పల్లెలను పట్టించుకోకపాయే..!!
 • రేత్తిరికి పడుకుంటే పురుగుబూసి వచ్చేది..!!
 • ప్రాణాలను అరచేత పెట్టుకునోటోళ్లం..!!
 • మనిషి జీవితం గప్పుడు గట్టుండే..!!
 • ఇది నారాయణపూర్‌ గ్రామ పెద్దమనుషుల మాట..!! 
 • ఇప్పుడు పొద్దుపొద్దున్నే పల్లె ‘అందాల’ హారాలు తళతళమంటున్నయ్‌..!!
 • పొద్దుపొద్దుగాల రోడ్లన్నీ శుభ్రం..!!
 • పచ్చని చెట్లతో పల్లెంతా అద్భుతమే.. 
 • పొద్దుగూకితే మసుక చీకట్లోనే కరెంట్‌ దీపాల ‘వెలుగులు’ చమక్కుమంటున్నయ్‌..!!  
 • నారాయణపూర్‌ గ్రామస్తుల ఇప్పటి మాట..!!

VIDEOS

logo