ప్రగతి.. పరుగు

- రూ.78 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు
- రూ. 24 కోట్లతో తాండూరు-తొర్మామిడి రోడ్డు
- రూ.18 కోట్లతో తాండూరు-అడికిచర్ల, తట్టెపల్లి రోడ్డు
- రూ.16.80 కోట్లతో కాగ్నానదిపై బ్రిడ్జి
- రూ.13.40 కోట్లతో జీవన్గీ బ్రిడ్జి
- రూ.11.81 కోట్లతో శివసాగర్ ప్రాజెక్టు పనులు
- రూ.8.90 కోట్లతో గాజీపూర్-బుద్దారం వంతెన
- రూ.2 కోట్లతో మినీస్టేడియం
- రూ.20 కోట్ల నిధులతో పల్లెల్లో పనులు
- రూ.4 కోట్లతో మున్సిపల్లో పనులు
- రూ.47.82 కోట్లతో చెక్‌డ్యాం పనులు
- త్వరలో ఇండస్ట్రీయల్ పార్క్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, లారీ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు
తాండూరు, ఫిబ్రవరి 2 : తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. దాదాపు రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా రూ.78 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు పనులు, రూ.24 కోట్లతో తాండూరు-తొర్మాడి రోడ్డు, రూ.18 కోట్లతో తాండూరు-అడికిచర్ల, తట్టెపల్లి రోడ్డు, రూ.16.80 కోట్లతో కాగ్నానదిపై ఆధునిక టెక్నాలజీతో వంతెన, రూ.13.40 కోట్లతో జీవన్గీ బ్రిడ్జి, రూ.8.90 కోట్లతో గాజీపూర్-బుద్దారం వంతెన, రూ.2 కోట్లతో అంతారం సమీపంలో మినీస్టేడియం, మరో రూ.2 కోట్లతో ఆడిటోరియం, రూ.20 కోట్ల జడ్పీ నిధులతో పల్లెల్లో పనులు, రూ.4 కోట్లతో మున్సిపల్ వార్డుల్లో పనులతో పాటు పలు పెండింగ్ పనులూ చురుకుగా సాగుతున్నాయి. రూ.11.81 కోట్లతో కొనసాగుతున్న శివసాగర్ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత తాండూరు ఏర్పాటుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో బషీరాబాద్ మండలం నవాల్గాలో 114 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్, తాండూరు మండలం జినుగూర్తి సమీపంలో 267 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అంతారం సమీపంలో 12 ఎకరాల్లో లారీ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి స్థలాన్ని పరిశీలించి సానుకూల వైఖరి తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు. 1220 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.47.82 కోట్లతో కాగ్నానదిపై ఏడు చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయి. పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
జోరుగా బైపాస్ పనులు..
తాండూరు ట్రాఫిక్, వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు చుట్టూ 12 కిలో మీటర్ల పొడవునా రెండు వరుసలతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకులు తొలిగి వారం రోజుల నుంచి జోరుగా పనులు కొనసాగుతున్నాయి. తాండూరు పట్టణం బయట నుంచి బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.78 కోట్లు విడుదల చేయడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు 2017లో ఫిబ్రవరి 4న శంకుస్థాపన చేశారు. భూములు కోల్పోయిన 91 మంది రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం వల్ల పనులు ముందుకు సాగలేవు. తాజాగా భూనిర్వాసితులకు ప్రభుత్వం రూ.9.21 కోట్లు చెల్లించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి తాండూరు-కొడంగల్ వెళ్లే రోడ్డును అనుసంధానం చేస్తూ యాలాల మండలం బషీర్మియా తండా, కోకట్, రసూల్పూర్, తాండూరు మండలం అంతారం, చెంగోల్, గౌతాపూర్, మీదుగా చించోళ్లి రోడ్డును ఆనుకొని ఉన్న గౌతాపూర్ శివారు వద్ద కలుస్తోంది. దీంతో తాండూరు పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నేతలు, కలిసి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పరిశీలిస్తున్నారు. బైపాస్ రోడ్డుకు కావాల్సిన మరో రూ.20 కోట్ల నిధులను సీఎంతో మాట్లాడి మంజూరు చేయించనున్నట్లు తెలిపారు.
ముగింపు దశలో రోడ్లు, బ్రిడ్జి పనులు..
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు ఊపందుకున్నాయి. తాండూరు-తొర్మామిడి రోడ్డుతో పాటు అడికిచర్ల, తట్టెపల్లి రోడ్డు పనులు చివరి దశకు చేరాయి. తాండూరు-తొర్మామిడి (జహీరాబాద్) మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు నరకయాతన పడేవారు. కాగ్నానదిపై బ్రిడ్జి, గాజీపూర్-బుద్దారం వంతెన పనులు చివరి దశకు చేరాయి. తుదిమెరుగులు దిద్ది త్వరలో మంత్రి కేటీఆర్‌చే ప్రారంభించేందుకు నేతలు కార్యాచరణ చేపట్టారు. యువత, విద్యార్థుల క్రీడల కోసం అంతారం సమీపంలో నిర్మిస్తున్న మినీస్టేడియం, ఆడిటోరియం పనులు వేగంగా సాగుతున్నాయి.
శివసాగర్ ప్రాజెక్టు పనులకు మోక్షం...
వెయ్యి ఎకరాల సాగు భూములకు నీరందించాలన్న సంకల్పంతో రెండు దశాబ్దాల కింద తాండూరు నియోజకవర్గం యాలాల మండలం కాక్రవేణి వాగుపై 2005-06 ఆర్థిక సంవత్సరంలో రూ.4.96 కోట్ల నిధులతో శివసాగర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో కొన్నేండ్లుగా పనులు నిలిచిపోగా, సీఎం కేసీఆర్ 2018లో రూ.11.81 కోట్లను కేటాయించారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. శివసాగర్ ప్రాజెక్టు 303 మీటర్ల పొడవు డ్యాం, 4.5 మీటర్ల ఎత్తు చెక్ వాల్, 12 మీటర్ల ఆప్రాన్, 4.8 కిలోమీటర్ల ఎడమకాలువ, 4.5 కిలో మీటర్ల కుడికాలువ నిర్మాణ పనులు అప్పుడప్పుడు బ్రేక్‌పడుతూ కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గం గుండా ప్రవహిస్తున్న కాగ్నా, కాక్రావేణి నదులపై ఏడు చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.47.82 కోట్లను కేటాయించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పారిశ్రామిక పార్క్‌కు..
పెరుగుతున్న అవసరాలు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తెలంగాణ సర్కార్ పారిశ్రామికీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నాపరాతి, సద్దగనులకు ప్రసిద్ధిగాంచింది తాండూరు. తాండూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బషీరాబాద్ మండలం నవాల్గా సమీపంలో 114 ఎకరాల స్థలంలో పారిశ్రామిక పార్క్, తాండూరు మండలం జిన్గుర్తి సమీపంలో 267 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. లారీ పార్కింగ్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి నిర్మాణ చర్యలు చేపట్టారు. ఇటీవల టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి వీటి స్థలాలను పరిశీలించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పారిశ్రామిక పార్క్‌కు అనుకూలంగా ఉండడంతో తప్పని సరిగా త్వరలో ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.