నిధుల మంజూరుకు కృషి చేస్తా

- పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి, జనవరి 29 : మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నందున దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. పనుల పర్యవేక్షణకు కాంట్రాక్టు పద్దతిన సివిల్ ఇంజినీర్లను నియమించుకోవాల్సిందిగా సూచించారు. పట్టణంలో మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపాలిటీలో 100శాతం పన్నుల వసూలు చేపట్టాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. హోర్డింగ్‌లు, సెల్ టవర్లకు సంబంధించి అద్దె వసూలు చేసి ఆదాయం పెంచుకోవాలన్నారు. వేసవికాలంలో నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిగి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.10కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రూ.50లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తారని తెలిపారు. డీఎంఎఫ్టీ నిధులతో పాఠశాలల్లో గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపాలిటీకి చెందిన 27 దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు వేలం నిర్వహించాలని, లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుకు రూ.5వేలు, డిపాజిట్‌గా రూ.2లక్షలు, దుకాణం అద్దె నెలకు రూ.12వేలుగా నిర్ధారించారు. పోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డులో వేసిన రాళ్లను తొలగించాల్సిందిగా తీర్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు కిరణ్, కృష్ణ, రవీంద్ర, నాగేశ్వర్, వెంకటేశ్, బద్రుద్దీన్, సమీనాబేగం, అర్చనకుమారి, షబ్బనూర్ సుల్తానా, శ్రీనివాస్, రాములమ్మ, కో-ఆప్షన్ సభ్యులు సానియా సుల్తానా, పార్వతమ్మ పాల్గొన్నారు.