సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 29, 2021 , 00:08:23

ప్రజలతో మమేకమై

ప్రజలతో మమేకమై

  • బార్వాద్‌లో బుధవారం ఎమ్మెల్యే ఆనంద్‌ పల్లె నిద్ర
  • రాత్రి 11 గంటల వరకు సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే
  • సమస్యల పరిష్కారంపై అధికారులపై ఆగ్రహం

వికారాబాద్‌, జనవరి 28 : పల్లెనిద్రలో ప్రజల నుంచి వెల్లువెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. బుధవారం బార్వాద్‌ గ్రామంలో రాత్రి 7 గంటల నుంచి ప్రతి ఇల్లు తిరిగి ప్రజల సమస్యలతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలపై ఆరా తీశారు. అనంతరం రాత్రి 10 గంటలకు గ్రామంలోని వృద్ధురాలు చాకలి అనసూజ ఇంట్లో బస చేశారు. తర్వాత గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో, రైతులు, ప్రజలతో కలిసి గ్రామంలో నెలకొన్న దీర్ఘ, స్వల్పకాలిక సమస్యలపై రాత్రి 11 గంటల వరకు ముచ్చటించి గ్రామపంచాయతీలోనే నిద్రపోయారు. ఉదయం మళ్లీ 6 గంటలకు లేచి గ్రామంలో ఇంటింటికి వెళ్లినపుడు ప్రజలు పలు రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. 

నెల రోజుల్లో కరెంట్‌ సమస్య లేకుండా పరిష్కారం

ఉదయం 8 గంటలకు గ్రామం నడిబోడ్డున సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో సబ్‌స్టేషన్‌ ఉన్నప్పటికీ తమ గ్రామానికి ప్రత్యేక ఫీడర్‌ లేక కరెంట్‌ వల్ల తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో చాలావరకు ట్రాన్స్‌ఫార్మర్లు పోయాయని, వాటిపై పోలీస్‌స్టేషన్‌లో సైతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్తంభాలు, విద్యుత్‌ వైర్లు ఉన్నప్పటికీ కనెక్షన్‌ ఇవ్వడంలో విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే కల్పించుకుని సంబంధిత విద్యుత్‌ ఏఈని అడుగగా.. నెల రోజుల్లో గ్రామంలో ఎలాంటి కరెంట్‌ సమస్య లేకుండా పరిష్కరిస్తామని చెప్పారు. 

గతంలో కోట్‌పల్లి తాసిల్దార్‌గా పనిచేసిన బిచ్చయ్య ప్రజల పట్టాలను తారుమారు చేశారని, అన్ని తప్పుల తడకగా చేసి వెళ్లిపోవడంతో గ్రామంలో సుమారు 200 మందికి పట్టాపాసుపుస్తకాలు లేవన్నారు. దీంతో వారికి రైతు బంధు కూడా రావడం లేదన్నారు. ఈ విషయమై తాసిల్దార్‌ సమాధానం చెప్పాలని అదేశించగా.. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వ్యవస్థ వచ్చిందని, పేపర్‌ వర్క్‌ లేదని, ఆప్షన్‌ వచ్చిన తర్వాత చేస్తామని తాసిల్దార్‌ చెప్పారు. 

గ్రామానికి రెండు ప్రధాన రహదారులైన మోమిన్‌పేటకు, వికారాబాద్‌కు వచ్చే రోడ్డు మార్గాలు పూర్తిగా అధ్వానంగా మారాయని.. ఈ రోడ్లపై రావడానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో మిషన్‌ భగీరథ పనులు 99 శాతం పూర్తి కావడంతో ఏఈని ఎమ్మెల్యే అభినందించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. 

కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఉమాదేవి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ వెంకటేశ్‌, పీఏసీఎస్‌  చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అనిల్‌, రైతు బంధు అధ్యక్షుడు సత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు సుభాన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo