మువ్వన్నెల మురిపెం

- ఉపాధి హామీలో జిల్లా 6వ స్థానం
- పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ పౌసుమి బసు
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
- ఉత్తమ సేవలకు పురస్కారాలు, ఆకట్టుకున్న పోలీసు కవాతు
త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.. జాతీయభావం వెల్లివిరిసింది.. దేశభక్తి ఉప్పొంగింది.. భరతమాత నినాదాలు మిన్నంటాయి.. స్వాతంత్య్ర సమరయోధుల స్మరణ మార్మోగింది. గణతంత్ర సంబురాలు అంబరాన్ని తాకాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పార్టీ ఆఫీసులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటాలు కనువిందు చేశాయి.
వికారాబాద్, జనవరి 26, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం గణంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ పౌసుమి బసు జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదికపై ఎమ్మెల్యే ఆనంద్, ఎస్పీ నారాయణలకు మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను కలెక్టర్ అందజేశారు. వేడుకల్లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో రూ.290.24 కోట్లు జమ
రైతు బంధు పథకంలో భాగంగా రూ.290. 24 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. రైతుబీమా పథకంలో 266 మంది లబ్ధిదారుల నామినీలకు రూ.13.30 కోట్లు అందించామన్నారు. జిల్లాలో 97 రైతు వేదికలను నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కంది పంట దిగుబడిలో వికారాబాద్ జిల్లా 44% పంట ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తు చేశారు. సీఎం గిరి వికాసం పథకం నుంచి చెంచులు, గిరిజనుల పొలాల్లో 500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సర్వే ప్రారంభించామన్నారు. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే గ్రామాలకు 265 అభివృద్ధి పనులకు గాను రూ.15.15 కోట్లు కేటాయించామని వెల్లడించారు. అనంతగిరి హిల్స్‌లో రూ.2.80కోట్లతో నూతన అతిథి గృహ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. 17 నూతన పంచాయతీ భవనాలను నిర్మించామన్నారు.
స్త్రీనిధి నుంచి రూ.36.35 కోట్లు మంజూరు...
స్త్రీనిధి నుంచి 13,855 సంఘాలకు రూ.36.35 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆత్మనిర్బర్ పథకంలో భాగంగా 4,447 మంది వీధి వ్యాపారులకు రూ.4కోట్ల 44లక్షల 70వేల రుణాలు అందించామన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కూలీలకు 62లక్షల 91,540 పని దినాలు కల్పించడంతో రాష్ట్రంలోనే జిల్లా 6వ స్థానంలో నిలిచిందన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 2,598 కిలో మీటర్ల పైపులైన్, 69 కట్టడాలు పూర్తి చేసి 2,03,688 నల్లాలను బిగించామన్నారు.
3,026 మందికి కరోనా వ్యాక్సిన్..
కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా మొదటి విడుత 3,026 మంది ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 5,380 కిట్లు అందించామన్నారు. ఆశ వర్కర్లు ప్రసూతి సిబ్బంది కృషితో గర్భిణుల పేర్లను నమోదు చేశారన్నారు. శిశువుల ఆరోగ్య భద్రత దృష్ట్యా 11,012 శిశువులకు వ్యాధి నిరోధక టీకాలను వేశామని వెల్లడించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. గ్రామ బాలల రక్షణ కమిటీ ఆధ్వర్యంలో 157 బాల్య వివాహాలను ఆపామన్నారు. టీసాట్, దూరదర్శన్ టీవీలతో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లానులు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 1 నుంచి 9, 10 ఆపై తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
‘పల్లె, పట్టణ ప్రగతి’తో అభివృద్ధి..
‘పల్లె, పట్టణ ప్రగతి’ కార్యక్రమాలతో ఎంతో అభివృద్ధిని సాధించామన్నారు. వైకుంఠధామాలు, స్మృతి వనాలు, పార్కులు, డంపింగ్ యార్డులు, నర్సరీల ఏర్పాటు, ప్రభుత్వ భవనాల మరమ్మతులు, ఇంకుడు గుంతల ఏర్పాటుతోపాటు పల్లెలకు ట్రాక్టర్లను అందజేశామన్నారు. భూగర్భ జలాల నిల్వలు పెంచడంలో జిల్లాకు జాతీయ స్థాయిలో 3వ స్థానం లభించిందన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 51,74,700 మొక్కలకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. హరితహారంలో జిల్లా 6వ స్థానంలో నిలిచినందుకు అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు..
ఉత్తమ సేవలు అందించిన జిల్లాకు చెందిన 85 మందికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో అధికారి కృష్ణన్, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీపీవో రిజ్వానా, డీఎస్వో రాజేశ్వర్, వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, పరిగి సీఐ లక్ష్మీరెడ్డి, తాండూరు సీఐ రవికుమార్, వివిధ శాఖల అధికారులు ప్రశాంసా పత్రాలను అందుకున్నారు.
తాజావార్తలు
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ