ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 26, 2021 , 02:14:28

కందికి బార్‌కోడ్‌

కందికి  బార్‌కోడ్‌

  • ప్రతి బస్తాపై పూర్తి వివరాలతో బార్‌కోడింగ్‌ స్టిక్కర్లు
  • వికారాబాద్‌ జిల్లాలో 1,85,104 ఎకరాల్లో సాగు
  • 7,40,416 క్వింటాళ్ల దిగుబడి
  • గతేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.5825, ఈసారి రూ.6వేలు
  • జిల్లాలో ఎనిమిది చోట్ల కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌ సన్నాహాలు 

వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ డివిజన్లలో 1,85,104 ఎకరాల్లో కంది పంట సాగుచేశారు. దీంతో ఏకంగా 7,40,416 క్వింటాళ్ల దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ఎనిమిది చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ సన్నాహాలు చేస్తున్నది. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల్లో బార్‌కోడింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. రైతులు తీసుకొచ్చిన కందుల నాణ్యతను పరిశీలించి తూకం వేస్తారు. రైతు పేరు, ధర, నాణ్యత తదితర వివరాలతో బస్తాపై బార్‌ కోడ్‌ స్టిక్కర్‌ వేయనున్నారు. బస్తాలు గోదాంకు పంపే సమయంలో బార్‌ కోడ్‌ తనిఖీ చేస్తారు. ఎలాంటి తేడాల్లేవని నిర్ధారించుకున్న తర్వాత నిల్వ చేస్తారు.

వానలు సమృద్ధిగా కురువడంతో అన్నదాతలు ఎక్కువగా పత్తి, కంది పంటలను సాగు చేశారు. అక్టోబర్‌, నవంబర్‌లో కురిసిన వర్షాల వల్ల పత్తి పంటకు కొంతమేర నష్టం వాటిల్లినా, కందికి మాత్రం ఢోకాలేదు. ఏపుగా పెరిగి కాత బాగా కాసింది. అధిక దిగుబడి వస్తుందని రైతులు ఎంతో ఆశగా నూర్పిళ్లకు సన్నద్ధమవుతున్నారు. కంది కొనుగోళ్ల విషయంలో అన్నదాతలు ఇబ్బందులు పడొద్దన్న సదుద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌ సన్నాహాలు చేస్తున్నది.

వికారాబాద్‌, జనవరి 25, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో అన్నదాతలు జైకొట్టారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ డివిజన్ల పరిధిలో కంది, పత్తి సాగు అధికంగా చేశారు. కొన్నిచోట్ల పత్తి పంటలో అంతర్‌ పంటగా కందిని సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా లక్షా 85,104 ఎకరాల్లో కంది సాగు చేయగా, 7,40,416 క్వింటాళ్ల కందులు దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. రైతులు ఇబ్బందులు పడకుండా కందులను కొనుగోలు చేసేందుకు ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కంది రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.   

బార్‌ కోడింగ్‌ అమలు.. 

కందుల కొనుగోలు కేంద్రాల్లో బార్‌ కోడింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. కందుల నాణ్యతను పరిశీలించి, తూకం వేసిన బస్తాలపై రైతు పేరు, ధర తదితర వివరాలతో బార్‌ కోడింగ్‌ స్టిక్కర్‌ను వేసి, గోదాముకు తరలించనున్నారు. అనంతరం సరుకును  ఆన్‌లైన్‌ టెండర్‌ విధానంలో విక్రయించనున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపాలని భావిస్తున్నది. ఈ విధానంతో సరుకు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.


VIDEOS

logo