సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 24, 2021 , 00:32:04

ట్రెక్కింగ్ ఇప్పుడిదే ట్రేండింగ్

ట్రెక్కింగ్ ఇప్పుడిదే ట్రేండింగ్

  • అనంతగిరి అందాలను ఆస్వాదించేందుకు చక్కని మార్గం
  • ఆహ్లాదకర వాతావరణం, వాచ్‌టవర్లు 
  • రోజురోజుకూ  పెరుగుతున్న సందర్శకుల తాకిడి
  • ఒక్కరికి టికెట్‌ ధర కేవలం రూ.20
  • సెలవు దినాల్లో మరింత సందడి

ఎటుచూసినా పచ్చదనం.. స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లు.. కిలకిల రావాలతో స్వాగతం పలికే రకరకాల పక్షులు పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి అనంతగిరి కొండలు. 400 ఏండ్ల చరిత్ర కలిగిన అనంతపద్మనాభ స్వామి దేవాలయం.. దీని చుట్టూ 1500 హెక్టార్లలో దట్టమైన అటవీ ఉండడంతో రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ ట్రెక్కింగ్‌, వాచ్‌ టవర్లకు  అత్యంత ప్రాధాన్యం ఉన్నది. అనంతగిరి చరిత్ర, ప్రకృతిని ఆస్వాదించేందుకు అటవీశాఖ అధికారులు 2017లో ట్రెక్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయగా.. ఇప్పుడది ట్రెండింగ్‌గా మారింది.  ఎక్కువగా యువతీయువకులు ట్రెక్కింగ్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే దీనికోసం ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండగా, ఒక్కొక్కరు కేవలం రూ.20 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు 200 మంది.. సెలవుదినాల్లో 500 మందికి పైగా ట్రెక్కింగ్‌ కోసం వస్తున్నారు. ఇక్కడి విశేషాలను సందర్శకులకు వివరించేందుకు అటవీశాఖ తరఫున గైడ్లు కూడా అందుబాటులో ఉంటారు. 

-వికారాబాద్‌, జనవరి 23

వికారాబాద్‌, జనవరి 23: హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశం వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండలు. ఈ కొండలు జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తాండూరు వెళ్లే మార్గంలో ఉన్నాయి. ఈ కొండల్లో నాలుగు వందల ఏండ్ల చరిత్ర కలిగిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి శని, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా, కర్ణాటక సమీప ప్రాంతాలు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఈ ఆలయం చుటూ 1500 హెక్టార్లలో దట్టమైన అటవీప్రాంతం విస్తరించుకుని ఉంది. ఎటుచూసినా అనంతగిరి అటవీ ప్రాంతంలో పచ్చదనంతో కూడిన చెట్లు, వందకు పైగా రకాల వివిధ రకాల పక్షులు ఉంటాయి. అనంతగిరికి వచ్చిన పర్యటకులు, భక్తులను పక్షులు కిలకిలరావాలతో స్వాగతం పలుకుతాయి. ఒకసారి ఈ కొండలకు వచ్చిన వారు మళ్లీమళ్లీ రావాలనిపిస్తుంది. 

ట్రెక్కింగ్‌కు పర్యాటకుల ఆసక్తి 

అనంతగిరి చరిత్ర, అటవీ ప్రాంతంలో ఉన్న రకరకాల చెట్లు, పక్షులు, తదితర విషయాలు తెలుసుకునేందుకు 2017లో ట్రెక్కింగ్‌ సదుపాయాన్ని అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్‌ చేసేందుకు అనంతగిరిలో రెండు మార్గాలు ఉన్నాయి. ఫారెస్టు గెస్టుహౌస్‌ వాచ్‌ టవర్‌ నుంచి మూసీ వరకు, రెండోది నంది ఘాట్‌ నుంచి వాటర్‌ పోల్‌ మీదుగా మూసీ వరకు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నంది ఘాట్‌ నుంచి వాచ్‌టవర్‌ వరకు పర్యాటకులు ట్రెక్కింగ్‌ చేస్తున్నారు. ట్రెక్కింగ్‌ చేయాలంటే ముందుగా ఫారెస్టు అధికారుల అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఫారెస్టు గెస్టు హౌస్‌ వద్ద ట్రెక్కింగ్‌ సదుపాయం మూసేసి, నంది ఘాట్‌ వద్ద నుంచి నిర్వహిస్తున్నారు. ట్రెక్కింగ్‌ చేసేవారు నంది ఘాట్‌ వద్ద తమ వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. ఒక్కో వాహనానికి రూ.20, ట్రెక్కింగ్‌ చేసేవారికి ఒక్కొక్కరికి రూ.20 చొప్పున టికెట్‌ ఉంటుంది. సెలవు దినాల్లో 400 నుంచి 500 వరకు పర్యాటకులు వస్తుంటారు. మిగితా రోజుల్లో 200 మంది వరకు ట్రెక్కింగ్‌ చేస్తున్నారు. 

అటవీ శాఖ నుంచి గైడ్‌..

ట్రెక్కింగ్‌ చేసే వారికి అనంతగిరి కొండల చరిత్ర, అటవీప్రాంత విస్తీర్ణం తదితర విషయాలు తెలిపేందుకు అటవీ శాఖ తరఫున గైడ్‌ కూడా ఉంటారు. టికెట్‌ తీసుకున్న తర్వాత వారిని ట్రెక్కింగ్‌ మార్గంలో తీసుకెళ్తారు. ట్రెక్కింగ్‌ దారి చూపుతూ అనంతగిరి అందాలను కూడా పర్యాటకులకు వివరిస్తారు. అధికంగా ట్రెక్కింగ్‌లో యువతే పాల్గొంటారు. ఈ దారి సుమారుగా 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 

తెలంగాణ ఊటీగా అనంతగిరి..

వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరిని తెలంగాణ ఊటీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ముఖ్యమంత్రి ఎన్నికల్లో వచ్చిన ప్రతిసారి అనంతగిరి ప్రాంతం అభివృద్ధి కోసం ఎన్నో సార్లు ప్రస్తావించారు. ఎకో టూరిజం పేరిట అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్లు కూడా మంజూరు చేశారు. ఇప్పటికే అనంతగిరిలో హరిత రిసార్టు ఉంది. ఎకో పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. రానున్న రోజుల్లో అనంతగిరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. సీఎం కేసీఆర్‌ హయాంలోనే అనంతగిరిని అభివృద్ధి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి కూడా హమీనిచ్చారు. 

ట్రెక్కింగ్‌ కోసం ..

ట్రెక్కింగ్‌ చేసే వారికోసం ఎలాంటి సమాచారం కావాలన్నా ఫారెస్టు సెక్షన్‌ అధికారి నంబర్‌ 9110789323లో సంప్రదించవచ్చు.

అనంతగిరిలో మంచి వాతావరణం

అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌ చేసే వారు చక్కటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.  ఔషధ మూలికలతో కూడిన చెట్లు ఉన్నాయి. రకరకాల పక్షుల కిలకిలా రాగాల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌ చేసేవారికి ఎలాంటి ప్రమాదం లేదు. అనంతగిరి ఫారెస్టులో ప్రకృతి, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అందుకే నిజాం కాలంలో అనంతగిరిలో టీబీ దవాఖాన నిర్మించారు. అనంతగిరి కొండల్లో గాలి పీల్చితే ఎలాంటి రోగాలున్నా తగ్గిపోతాయనే నానుడి ఉంది. సాయంకాలంలో గుండం వద్దకు వెళితే పక్షుల శబ్ధాలు వినిపిస్తాయి. అక్కడి నుంచి కదలాలనిపించదు. 

- తాండ్ర కృష్ణ, ఫారెస్టు రేంజ్‌ అధికారి, వికారాబాద్‌

VIDEOS

logo