ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 17, 2021 , 00:05:36

కరోనా అంతానికి ఆరంభం

కరోనా అంతానికి ఆరంభం

  • టీకా పంపిణీ షురూ
  • తొలివిడుతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే..        
  • మొదటిరోజు రంగారెడ్డి జిల్లాలో 235, వికారాబాద్‌లో 90 మందికి వ్యాక్సిన్‌
  • ప్రక్రియను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు   
  • పర్యవేక్షించిన కలెకర్లు, ఉన్నతాధికారులు 

కరోనా మహమ్మారి అంతం మొదలైంది. శనివారం తొలిదశ టీకా పంపిణీ విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లాలో 9 చోట్ల 235 మందికి, వికారాబాద్‌ జిల్లాలో మూడు చోట్ల 90 మందికి టీకా వేశారు. కరోనా సమరంలో ముందుండి పోరాడిన డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు టీకా వేశారు. ఆయా కేంద్రాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కలెక్టర్లు అమయ్‌కుమార్‌, పౌసుమిబసు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రక్రియను పర్యవేక్షించారు. కాగా, ఒక్కోక్కరికి  0.5 ఎంఎల్‌ చొప్పున రెండుసార్లు టీకా వేయాల్సి ఉంటుంది.  మొదటి డోస్‌ వేసుకున్నవారికి 28 రోజుల తరువాత రెండో డోస్‌ వేస్తారు. 

తొలి ప్రాధాన్యం అభినందనీయం..

అందరికంటే ముందుగా వైద్యసిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడం అభినందనీయం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా భయపడకుండా పనిచేసిన వైద్యారోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు తొలిప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉన్నది. దవాఖానలో పిల్లలకు వ్యాక్సినేషన్‌ చేసినట్లే ఉన్నది. వ్యాక్సిన్‌ పరిగికి చేరుకున్నప్పటి నుంచి ఓ పండుగలా అనుభూతి కలుగుతున్నది. టీకా వేసుకున్న తర్వాత ఎలాంటి సమస్య రాలేదు. ఎట్టకేలకు కొవిడ్‌కు చరమగీతం పాడడం శుభపరిణామం. 

-సునంద, స్టాఫ్‌నర్స్‌, పరిగి దవాఖాన 

  • రంగారెడ్డిలో 9 కేంద్రాల్లో 235 మందికి, వికారాబాద్‌ జిల్లాలోని 3 కేంద్రాల్లో 90 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ
  • ఒక వ్యక్తికి 0.5 ఎంఎల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేసిన వైద్య సిబ్బంది
  • మొయినాబాద్‌, నార్సింగి, పరిగిలో మంత్రి సబితారెడ్డి పర్యటన

అపోహలకు గురికావద్దు 

సోషల్‌ మీడియాతో పాటు ఇతరులు చెప్పే మాటలు నమ్మి  టీకా విషయంలో అపోహలకు గురి కావద్దు. కరోనాపై టీకా రావడం ప్రతిఒక్కరి అదృష్టం. ఈ టీకాతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కరోనా సంక్షోభంలో తీవ్ర ఇబ్బందులకు గురైన వైద్య సిబ్బందికి ఈ టీకా వేయడం దేశానికే గర్వకారణం. ఈ టీకాను మొదట వైద్య సిబ్బందికి వేయడం ఆనందంగా ఉంది. నేను కూడా టీకా వేయించుకున్నా. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. 

- పల్లవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఇబ్రహీంపట్నం

కరోనాపై ప్రజల్లో భయం పోతున్నది 

కొవిడ్‌ టీకా ముందుగా వైద్య సిబ్బందికి ఇవ్వడం వల్ల ప్రజల్లోనూ భయాందోళనలు తొలగిపోతాయి. టీకా వేయించుకున్న తర్వాత ఏమీ ఇబ్బంది లేదు. టీకా ముందుగా మాకే ఎందుకు ఇస్తున్నారని మొదట మేమూ భయపడ్డాం. ఒకరిద్దరు తీసుకున్న తర్వాత ఆ భయం పోయింది. వైద్య సిబ్బందికి ముందుగా టీకా ఇవ్వడం వల్ల ప్రజల్లో నెలకొన్న భయం పోతుందని ప్రభుత్వం ముందుగా మాకు ఇచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి వ్యాక్సిన్‌ వేయించుకుంటారు. 

- సుగుణ, స్టాఫ్‌నర్స్‌, పరిగి దవాఖాన

కరోనా నియంత్రిణకు చాలా పోరాడినం

కరోనా నియంత్రణకు చాలా పోరాడినం. గ్రామంలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే కుటుం బ సభ్యులు కూడా దగ్గరకు రాని పరిస్థితిలో వారిని టెస్టులకు తీసుకెళ్లడం, వారికి వైద్య సేవల కోసం దవాఖానకు పంపడం చేశాం. భయపడకుండా పని చేశాం. ఇంటి నుంచి బయటకు రాకుండా చాలా ఇబ్బందిపడ్డ పరిస్థితులు చూశాం. ఇప్పుడు నేను కూడా టీకా తీసుకున్నా. టీకా వచ్చింది కాబట్టి ధైర్యంగా బాధితులు, ప్రజలకు సేవలు అందిస్తా. చాలా సంతోషంగా ఉంది.

- వరమ్మ, ఆశకార్యకర్త, కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్‌

అందరూ ఆరోగ్యంగా ఉన్నారు

నేను కరోనా టీకా వేయించుకున్నాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. నాతోపాటు ఈ రోజు టీకాను వేయించుకున్న ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. మొదటిసారిగా వైద్య సిబ్బందికి టీకా వేయడం సంతోషకరం. ప్రభుత్వం సూచించిన విధంగా అందరూ టీకా వేయించుకోవచ్చు. కరోనా టీకాపై వస్తున్న అపోహలను నమ్మొద్దు. ప్రతిఒక్కరూ ధైర్యంగా టీకా వేయించుకోవచ్చు. 

- శ్రీనివాస్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, 

షాద్‌నగర్‌ క్లస్టర్‌కరోనాను జయించినట్లే 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి తో వచ్చిన వ్యాక్సిన్‌తో కరోనా ను జయించినట్లే. టీకా తీసుకున్న నాకు ప్రస్తుతం ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు లేవు. ఆరోగ్యంగా ఉన్నా. ప్రతిఒక్కరూ ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సైడ్‌ ఎఫెక్టులు రావచ్చు. కాని అవి కూడా ఏమీ కావు. ప్రతిఒక్కరూ ధైర్యంగా వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు. ఈ టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవు. అందుకే ముందుగా వైద్య సిబ్బందికే తొలి టీకా వేశారు.

- డాక్టర్‌ రమ్య, వికారాబాద్‌

వ్యాక్సిన్‌పైఅపోహలు నమ్మకండి

వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమైన ది. ఎలాంటి అపోహలు నమ్మ కండి. టీకా తీసుకున్నవారిని అరగంట పాటు పర్యవేక్షణలో ఉంచుతున్నాం. ఎవరికీ సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలే దు. టీకా తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అద్వితీయ చర్యలు తీసుకుంటుం ది. అర్హులైన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందజేస్తాం. తాండూరు కేంద్రంలో టీకాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశాం. అందరి సహకారంతో మొదటి రోజు విజయవంతంగా టీకా వేశాం.

- డా.స్పందన, వ్యాక్సిన్‌ కేంద్రం ఇన్‌చార్జి, తాండూరు

ధైర్యంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం  ఆనందంగా ఉంది. ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు రాలేదు. 30 నిమిషాలు ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకున్న. కరోనా వల్ల ఇన్ని రోజు లు ఎన్నో బాధలు పడ్డాం. ఇంత త్వరగా వ్యాక్సిన్‌ వచ్చినందుకు ప్రజలంతా సంతోషించాలి. ఎవరూ అపోహలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా ప్రపంచం  మమ్మల్ని గుర్తించి తొలి వ్యాక్సినేషన్‌ వైద్య సిబ్బందికి  కేటాయించడంతో మా బాధ్యత మరింత పెరిగింది.

- జయశ్రీ, దంతవైద్యురాలు, 

ప్రభుత్వ దవాఖాన, ఆమనగల్లు టీకా తీసుకోవడం హ్యాప్పీగా ఉంది..

వ్యాక్సిన్‌ రాకముందు చాలా భయాందోళనకు గురయ్యాం.  గతంలో కొన్ని ఆరోగ్య సమస్య లు ఉండే.టీకా తీసుకుంటే ఎమవుతుందోనని భయపడ్డాం. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. చాలా హ్యాప్పీగా ఉంది. టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రావని వందశాతం నమ్మకముంది. ఏమన్నా ఇబ్బందులుంటే అర గంటలో వస్తాయని చెప్పారు. టీకా రాకముందు ఏ వస్తువు ముట్టుకోవాలన్నా భయపడ్డాం. టీకా అందరూ తీసుకోవడానికి ముందుకు రావాలి.     

- ప్రియాంక, అంగన్‌వాడీ టీచర్‌, చిన్నషాపూర్‌, మొయినాబాద్‌

ఆరోగ్యం బాగుంది..

ఉదయం టీకా తీసుకున్నా. ఆరోగ్యం బాగుంది. ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు లేవు. భయపడకుండా అందరూ టీకా తీసుకోవాలి. కరోనా బారి నుంచి కాపాడుకోవాలి అంటే ఈ వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు టీకా తీసుకోవాలి. ఆరోగ్య సిబ్బందికి పూర్తయిన వెంటనే పోలీసులు, మున్సిపల్‌ కార్మికులకు వ్యాక్సిన్‌ వేస్తాం. 

- యాదయ్య, దవాఖాన 

సూపరింటెండెంట్‌, వికారాబాద్‌

చాలా సంతోషంగా ఉంది

కరోనాకు ఇన్నాళ్లు భయపడుతూ విధులు నిర్వహించాం. వైద్యనిపుణుల మేధస్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో కరోనా నివారణకు టీకా రావడం సంతోషం. తాండూరు కేంద్రంలో మొదటి టీకాను నేను తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. టీకా తీసుకునేందుకు భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదు. భయం లేకుండా విధులు నిర్వహిస్తాను.

- పర్వతాలు, ఐసీటీసీ ఇన్‌చార్జి, తాండూరు

అపోహలు వీడాలి

కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్‌ వచ్చింది. ఎలాంటి గాలివార్తలు, రూమర్స్‌ నమ్మవద్దు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎంతో  కృషి చేసి వ్యాక్సిన్‌ తీసుకొచ్చారు. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. వలంటీర్‌గా వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌  వేసుకోవడం బాధ్యతగా ఫీల్‌ అవుతున్నా. వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత  ఆరోగ్యంగానే ఉంది. అందరూ  స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

- వేణు,ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన

ముందుగా ఇవ్వడం సంతోషం

అందరికంటే ముందుగా మాకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం సంతోషంగా ఉంది. దవాఖానలో పిల్లలకు వ్యాక్సినేషన్‌ చేసినట్లే ఉన్నది. కరోనా వ్యాక్సిన్‌ పరిగికి చేరుకున్నప్పటి నుంచి పండుగలా ఉన్నది. కొవిడ్‌ వైరస్‌ విస్తరిస్తున్న సమయంలో ముందుండి పని చేశాం. అందుకు మంచి గుర్తింపు దక్కింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్య లేదు. 

- డాక్టర్‌ వైదేహి, పరిగి దవాఖాన

ఎలాంటి సమస్య లేదు

కరోనా టీకాను మొదటగా నేను వేయించుకోవడం చాలా  సంతోషకరం. టీకా వేయించుకున్న అనంతరం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. సాధారణంగానే ఉన్నాను. నొప్పి, జ్వరం, ఇతర సమస్యలు అయితే ఇప్పటివరకు లేవు. టీకా వేయించుకుంటే సమస్యలు వస్తాయనేవి కేవలం అపోహలు మాత్రమే. ఈ కరోనా వ్యాక్సిన్‌  చాలా సురక్షితమైనది.

- డాక్టర్‌.శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ దవాఖాన, షాద్‌నగర్‌

కరోనాపై భారత్‌ విజయం

కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడలాడింది. కానీ భారత్‌ భయపడకుండా కరోనాను అంతం చేసేందుకు అతితక్కువ కాలంలో వ్యాక్సిన్‌ తీసుకొచ్చి గొప్ప విజయాన్ని సాధించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో టీకాను కనుగొనడం సంతోషం. ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో నేను టీకా వేసుకున్నా. ప్రతిఒక్కరూ ఎలాంటి భయాలు లేకుండా టీకా వేసుకోవచ్చు. 

- హన్మంత్‌రావు, వైద్యుడు, ఇబ్రహీంపట్నం

VIDEOS

logo