సమ్మతి తెలిపిన వారికే టీకా

- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పరిగి, జనవరి 15 : జిల్లాలో తొలిరోజు మూడు కేంద్రాల్లో కొవిడ్ టీకాలు వేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తమ సమ్మతి తెలిపిన వారికే కొవిడ్ టీకా వేస్తామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై మంత్రి వికారాబాద్‌లోని కలెక్టర్ చాంబర్లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్, తాండూరు, పరిగి ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు ఈ మూడు కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ రెండుసార్లు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. టీకా వేసుకున్న వారిని అరగంటపాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే పంపిస్తామన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి విడుత వ్యాక్సినేషన్ అనంతరం జిల్లాలో 29 కేంద్రాల్లో కొవిడ్ టీకాలు వేయనున్నట్లు చెప్పారు. గర్భిణులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయకూడదన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జిల్లా వైద్యాధికారులు సుధాకర్‌షిండే, అరవింద్ పాల్గొన్నారు.