శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 14, 2021 , 00:34:28

ఉత్తమ సేవలకు కాయకల్ప అవార్డు

ఉత్తమ సేవలకు కాయకల్ప అవార్డు

  • వర్చువల్‌ విధానంలో పురస్కారం ప్రదానం 
  • జిల్లా దవాఖానాల విభాగంలో తాండూరు , సీహెచ్‌సీ విభాగంలో వికారాబాద్‌కు ప్రథమ స్థానం
  • రూ.16.66 లక్షల నగదు బహుమతి, ఆస్పత్రి  నిర్వహణకు రూ.50 లక్షల నిధులు

తాండూరు పట్టణంలోని  జిల్లా దవాఖాన, వికారాబాద్‌లోని సీహెచ్‌సీకి ఉత్తమ సేవలకు పురస్కారాలు దక్కాయి. మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన వైద్య సేవలకు గాను ఇటీవల  కేంద్ర ప్రభుత్వం ఈ దవాఖానలను కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది.. కాగా, మంగళవారం వర్చువల్‌ విధానంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌   ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో జిల్లా దవాఖానకు రూ.16.66లక్షల నగదుతో పాటు నిర్వహణ కోసం రూ.50లక్షల నిధులు అందనున్నాయి. అలాగే సీహెచ్‌సీకి రూ.7.50 లక్షల పురస్కారం, రూ.15 లక్షల నిధులు ప్రకటించారు. 

-తాండూరు, జనవరి 13

వర్చువల్‌ విధానంలో కేంద్ర  ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రదానం

తాండూరులోని జిల్లా దవాఖానకు, వికారాబాద్‌లోని సీహెచ్‌సీకి ప్రథమ స్థానం

పుట్టింటిలా మహిళలకు పురుడు

కిడ్నీ రోగులకు కొండంత అండ

తాండూరు, జనవరి 13: కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం, పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు, మౌలిక వసతులు బాగుండడంతో కాయకల్ప అవార్డులకు తాండూరులోని జిల్లా, వికారాబాద్‌లోని సీహెచ్‌సీ ప్రభుత్వ దవాఖానలు 2020 సెప్టెంబర్‌ 23న ఎంపికయ్యాయి. 2015 నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థ్థాల ఏరివేత, వైరస్‌ లాంటి రోగాల నివారణతో పాటు ఇతర అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరచిన ఆస్పత్రులకు  కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డులు ఇస్తుంది. ఈ అవార్డుకు ఎంపికైన దవాఖానకు మొదటి బహుమతిగా రూ.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.25 లక్షలు, ప్రోత్సాహక బహుమతిగా రూ.3 లక్షలు అందజేస్తున్నారు. ఈ అవార్డును ఆరేండ్లుగా ఇస్తున్నారు. 

అవార్డు ఎంపిక విధానం..

కాయకల్ప అవార్డు ఎంపికకు 6250 చెక్‌ పాయింట్ల ఆధారంగా సర్వే నిర్వహించారు. వీటిలో తాండూరు సర్కార్‌ దవాఖానకు 75 శాతానికి పైగా పాయింట్లు రావడంతో అధికారులు ఢిల్లీకి నివేదిక పంపించారు. దీని ఆధారంగా ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీలోని బృందం ఆస్పత్రిని సందర్శించారు. మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించడం, పరిశుభ్రంగా ఉంచడం, దవాఖానలో మొక్కలు నాటి గార్డెన్‌ ఏర్పాటు చేయడం, రోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లాంటివి పరిశీలించి జాతీయ ఆరోగ్య సంస్థ కాయకల్ప అవార్డులో మొదటి స్థానం కేటాయించింది.

వర్చువల్‌ విధానంలో అవార్డు..

కాయకల్ప అవార్డును మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆన్‌లైన్‌లో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌కు అందజేశారు. ఢిల్లీలో మంత్రి చేతులమీదుగా అందజేయాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో ఆవార్డును అందజేసినట్లు అధికారులు తెలిపారు. సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్యశాఖ కమిటీ పరిశీలించి, ఇచ్చిన నివేదిక మేరకు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అవార్డుకు ఎంపిక చేసిం ది. సూపరింటెండెంట్‌ కృషితో వైద్య సిబ్బందిలో చక్కటి మార్పులు తీసుకురావడం, ప్రజాప్రతినిధుల సహకారంతో తెలంగాణ సర్కార్‌ మౌలిక వసతులు కల్పించడంతో తాండూరు ఆస్పత్రి కాయకల్ప అవార్డులో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నది. దీంతో రూ.16.66 లక్షల నగదు పురస్కారంతోపాటు దవాఖాన నిర్వహణకు రూ.50 లక్షలు ప్రకటించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం విభాగంలో రాష్ట్రస్థాయిలో వికారాబాద్‌ సీహెచ్‌సీ దవాఖానకు మొదటి స్థానం వచ్చింది. దీంతో రూ.7.50 లక్షల నగదు పురస్కారంతో పాటు ఆస్పత్రి నిర్వహణకు రూ.15 లక్షలు ప్రకటించారు.

చాలా సంతోషంగా ఉంది

తాండూరు ప్రభుత్వ జిల్లా దవాఖానకు కాయకల్ప అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకు నాతో పాటు కృషి చేసిన వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. కాయకల్ప ద్వారా వచ్చిన నిధులతో ఆస్పత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. అందు కు తగ్గట్లుగానే రోగులకు మంచి సేవలు అందిస్తున్నాం. ఆస్పత్రిని అన్ని విధాలుగా చక్కగా తీర్చిదిద్దుకుంటాం. - డా.మల్లికార్జున్‌, జిల్లా ఆస్పత్రి 

సూపరింటెండెంట్‌, తాండూరు

VIDEOS

logo