సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 13, 2021 , 00:12:26

టీకా.. ఆగయా

టీకా.. ఆగయా

  • హైదరాబాద్‌  చేరుకున్న కరోనా వ్యాక్సిన్లు.. రేపు ఉమ్మడి జిల్లాకు..
  • వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి సబితారెడ్డి, కలెక్టర్లు

కరోనా టీకాలు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకోగా 14న ఉమ్మడి జిల్లాకు రానున్నాయి. ఈ నెల 16న టీకా పంపిణీ ప్రారంభం కానుండగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై మంత్రి సబితారెడ్డి, కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కాగా, మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో 9 చోట్ల 270 మందికి, వికారాబాద్‌ జిల్లాలో మూడు చోట్ల 90 మందికి టీకా అందించనున్నారు. 18వ తేదీ తరువాత అన్ని కేంద్రాల్లో టీకా వేస్తారు.

  • 90 మందికి వ్యాక్సిన్‌
  • వికారాబాద్‌ జిల్లాలో మూడుచోట్ల వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు 
  • తాండూరు, వికారాబాద్‌ ఏరియా, మహావీర్‌ దవాఖానల్లో సిద్ధం 
  • మొదట వైద్య సిబ్బందికే.. 
  • జిల్లాకు చేరిన సిరంజీలు
  • అనంతగిరి స్టోరేజీ పాయింట్‌లో నిల్వ 

వికారాబాద్‌, జనవరి 12,(నమస్తే తెలంగాణ): ఈనెల 16వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యసిబ్బందికి మొదట కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో టీకా జిల్లాకు చేరనున్నది. కరోనా టీకా సీరంజీలు జిల్లాకు సంబంధించి అనంతగిరి చేరుకున్నాయి. జిల్లా దవాఖాన వ్యాక్సిన్‌ పాయింట్‌లో వాటిని భద్రపర్చారు. జిల్లాలో మొదటి విడుతలో ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెందిన వైద్యులు, సిబ్బందికి మొదటి టీకాను వేయనున్నారు. ఇందుకు సంబంధించి మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్‌ ఏరియా దవాఖాన, మహావీర్‌, తాండూరులోని జిల్లా దవాఖానలో 30 మంది చొప్పున 90 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు వెల్లడించారు. ఎవరికి ఎక్కడ టీకా వేయనున్నారనే దానిపై వారి సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపించారు. జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానతో పాటు మహవీర్‌ దవాఖానలో కొవిడ్‌-19 టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ ఎలా వేయాలనేదానిపై వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇటీవల డమ్మీ టీకా ప్రదర్శన జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశారు. 

16న మూడు కేంద్రాల్లో ..

 జిల్లాలో తాండూరు జిల్లా దవాఖాన, వికారాబాద్‌ ఏరియా దవాఖాన, మహావీర్‌ దవాఖాన లో వ్యాక్సిన్‌ వేయనున్నారు. 17వ తేదీ సెలవుకావడంతో 18న జిల్లా వ్యాప్తంగా వంద శాతం వ్యాక్సిన్‌ (టీకా) ఇవ్వనున్నారు. డమ్మీ టీకా మొత్తం 29 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో కేవలం 3 సెంటర్లను ప్రస్తుతానికి టీకా వేయడానికి నిర్ణయించారు. 

సిరంజీలు వచ్చాయి

జిల్లాకు వ్యాక్సిన్‌ సిరంజీలు వచ్చాయి.స్టోరేజీ పాయింట్‌ భద్రపర్చాం.ఒకటి,రెండు రోజుల్లో వ్యాక్సిన్‌ కూడా రానుంది. 29 కేంద్రాలు ఏర్పాటు చేయగా..ప్రస్తుతం మొదటి రోజు 3 కేంద్రాల్లో ఏర్పాటు చేశాం.16వ తేదీన తాండూరు జిల్లా ఆసుపత్రి, వికారాబాద్‌ ఏరీయా,మహావీర్‌ ఆసుపత్రుల్లో టీకా కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది.90 మందికి మొదటి దఫాలో టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 

-డాక్టర్‌ సుధాకర్‌ షిండే, జిల్లా వైద్యాధికారి, వికారాబాద్‌ జిల్లా 

VIDEOS

logo