సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 12, 2021 , 00:09:23

నోరూరించే.. గేవర్‌

నోరూరించే.. గేవర్‌

  • సంక్రాంతి స్పెషల్‌..  మిఠాయి వంటకం 
  • తాండూరులో విక్రయం
  • పెరిగిన ధర, తగ్గని ఆదరణ
  • 80 ఏండ్లుగా గేవర్‌ తయారీలో కుటుంబం

తాండూరు, జనవరి 11 : ఉత్తర భారత దేశంలో ప్రధాన తీపి వంటకమైన గేవర్‌ను మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాండూరు పట్టణంలో ఎనభై ఏండ్ల క్రితం వెలసిన హోటల్‌లో విక్రయిస్తున్నారు. మూడు తరాలుగా హోటల్‌ కుటుంబం నుంచి ఆనవాయితీగా సంక్రాంతి పండుగ నుంచి ఫిబ్రవరి వరకు గేవర్‌ను తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. గేవర్‌ అనే మిఠాయి ఉత్తర భారత దేశంలో ఎక్కువగా తయారు చేస్తారు. రాజస్తాన్‌ స్పెషల్‌ నెయ్యి, మైదా, చక్కెరతో తయారుచేసే ఈ తీపి పదార్థం 85 సంవత్సరాల క్రితం తాండూరుకు వలస వచ్చిందని సమాచారం. అప్పట్లో రాజస్తాన్‌ నుంచి తాండూరుకు వలస వచ్చిన మార్వాడీ కుటుంబాలు అక్కడి వంటకాన్ని కూడా తాండూరుకు మోసుకొచ్చారని ప్రతీతి. తాండూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు (గంజ్‌) ఆవరణలోని అన్నపూర్ణ హోటల్‌ (హన్మప్ప దుకాణం) ఈ మిఠాయి విక్రయానికి పెట్టింది పేరు. ఆయన మరణానంతరం అతడి కొడుకులు, మనుమలు, కుటుంబ సభ్యులు గేవర్‌ తయారీని కొనసాగిస్తున్నారు. మొత్తం 25 మంది ఉమ్మడి కుటుంబ సభ్యులే సమష్టిగా గేవర్‌ తయారు చేస్తారు. రూ.300కిలో చొప్పున ఈ గేవర్‌ను విక్రయిస్తున్నారు. గేవర్‌ పేరు చెబితే ప్రజలు మా కుటుంబం పేరు గుర్తుకు తెచ్చుకుంటారని నిర్వాహకులు ఒకింత గర్వంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో దొరకని గేవర్‌ కేవలం తాండూరు పట్టణంలోనే దొరకడం విశేషం. గేవర్‌ను కొనేందుకు జిల్లాలోని తాండూరు నియోజకవర్గం ప్రజలతో పాటు వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ ప్రాంతాలనుంచి ప్రజలు తాండూరుకు వస్తారని గేవర్‌ తయారీదారులు తెలిపారు. రెండు, మూడేండ్ల క్రితం రూ.200లకు కిలో చొప్పున విక్రయించగా, ప్రస్తుతం చక్కర, మైదా, నెయ్యి ధరలు పెరిగిన కారణంగా కిలో రూ.300లకు అమ్ముతున్నట్లు తెలిపారు. 

VIDEOS

logo