కాగ్నాపై 7 చెక్‌డ్యాంలు

- రూ.47.82 కోట్లు మంజూరు
- భూ గర్భ జలాల పెంపే లక్ష్యం
- వెయ్యి ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు
సాగునీటి సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా చెరువులు, కుంటలను పునరుద్ధరించిన ప్రభుత్వం వాగులపై చెక్డ్యాంలనూ నిర్మిస్తున్నది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా వాగుపై ఏడు చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.47.82 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. నిర్మాణ పనులు చేపట్టేందుకు జిల్లా ఇరిగేషన్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కాగా బషీరాబాద్ మండలం జీవన్గీ వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే 1220 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
తాండూరు రూరల్, జనవరి 11, భూగర్భ జలాలు పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నది. తాండూరులోని కాగ్నా వాగుపై ఏడు చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి రూ.4,782.51 లక్షల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు టెండర్లు కూడా పూర్తి చేశారు. గతంలో అతివృష్టి కారణంగా భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా గత ఏడాది కరోనా వైరస్ విజృంభించడంతో ఈ పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాల కారణంగా చెక్‌డ్యాంల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం చెక్ డ్యాంల నిర్మాణానికి అనువైన కాలం కావడంతో ఇరిగేషన్ అధికారులు చెక్‌డ్యాంల నిర్మాణ పనుల చేపట్టాలని నిర్ణయించారు. తాండూరు మండలం చిట్టిఘనాపూర్ కాగ్నా వాగుపై రూ.647.50 లక్షలు, ఎల్మకన్నె కాగ్నా వాగు పై నిర్మించే మరో చెక్ డ్యాంకు రూ.804.91 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. బషీరాబాద్ మండలంలోని జీవన్గీ వాగుపై నిర్మించే చెక్ డ్యాం పనులకు రూ. 874 లక్షల ఎస్టిమెట్ కాస్ట్‌గా నిర్ణయించారు. క్యాద్గిరా సమీపంలో నిర్మించే చెక్ డ్యాంకు రూ.569.10 లక్షలుగా నిర్ణయించారు. పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి గేట్ సమీపంలో నిర్మించే డ్యాంకు రూ.350 లక్షలు మంజూరు చేశారు. వీటితోపాటు యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని మజీర సంఘం సమీపంలో నిర్మించే చెక్ డ్యాంకు రూ. 962 లక్షలు, గోవింద్రావుపేటలో నిర్మించే చెక్‌డ్యాంకు రూ.575 లక్షలు మంజూరు చేసింది. వీటన్నింటికీ టెండర్ల ప్రక్రియ పూర్తిఅయింది. బషీరాబాద్ మండలంలోని జీవన్గీలో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో ఏడు చెక్ డ్యాంలు పూర్తయితే సుమారు 1,220 ఆయకట్టు రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం చేకూరనున్నది. ఆయా ప్రాంతాల్లోని గ్రామాల రైతులకు బోర్లలో భూగర్భ జలాలు పెరిగిపోతాయి. అంతేగాకుండా సంవత్సరంలో రెండు, మూడు పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగనున్నది.
కర్నాటకలో కలుస్తున్న కాగ్నా నీరు
ప్రసుత్తం తాండూరు మీదుగా పారుతున్న కాగ్నా వాగులోని నీరు కర్నాటకలోని పలు వాగుల్లోకి వెళుతున్నది. తాండూరు ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు లేవు. ఈ ప్రాంత రైతాంగం వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు కంది, మినుము, పెసర, జొన్న, కుసుమ ఇతర వర్షాధార పంటలు సాగు చేస్తారు. కాగ్నా నీరు తాండూరు రైతాంగానికి ఉపయోగపడాలనే సదుద్దేశంలో వాగుపై ఏడు చెక్ డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ భారీగా నిధులను మంజూరు చేశారు. ఇరిగేషన్ అధికారులు మిగతా 6 చోట్ల చెక్ డ్యాంల నిర్మాణ పనులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏప్రిల్ నాటికి పూర్తి చేయిస్తాం
తాండూరు ప్రాంతంలో చేపట్టే ఏడు చెక్ డ్యాంల నిర్మాణ పనులు 2021 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్ఛిత పరిస్థితుల వల్ల పనుల్లో జాప్యం జరిగింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్నందున చెక్ డ్యాంల పనులను కూడా త్వరలో ప్రారంభిస్తాం.
- నిఖేష్, ఏఈ
తాజావార్తలు
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..