గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 10, 2021 , 00:12:10

కల్లు.. కలకలం

కల్లు.. కలకలం

 • 11గ్రామాల్లో..147 మందికి అస్వస్థత..ఒకరు మృతి 
 • వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
 • సహాయక  చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య
 • మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి సబితారెడ్డి
 • వివరాలు అడిగి తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
 • వికారాబాద్‌ ఏరియా దవాఖానను సందర్శించిన  కలెక్టర్‌ పౌసుమి బసు
 • గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ 
 • శాంపిల్స్‌  సేకరించి కల్లు దుకాణాలను మూసివేయించిన ఎక్సైజ్‌ అధికారులు 
 • బాధితులను పరామర్శించిన మంత్రి సబితారెడ్డి..
 • సంఘటనపై విచారణ జరిపి, బాధితులను శిక్షిస్తామన్న మంత్రి
 • అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన

11గ్రామాలు..147 మందికి అస్వస్థత.. ఒకరు మృతి బాధితులను పరామర్శించిన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్‌, యాదయ్య, కలెక్టర్‌ పౌసుమిబసుమెరుగైన వైద్యం అందించాలని ఆదేశం వివరాలు అడిగి తెలుసుకున్న ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డిఇంటింటి సర్వే చేసిన అధికారులుకల్లు దుకాణాలు సీజ్‌పొద్దునే లేచి పనికి పోవాల్సిన  శంకరయ్య ఎనిమిదైనా లేవకుండా ఉలుకూ పలుకూలేకుండా ఉండడంతోఇంటి సభ్యులు భయపడ్డారు. అప్పటికప్పుడు డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తారు..అందరితో హుషారుగా మాట్లాడే  వెంకట్రావు  పొద్దుట్నుంచి వింతగా ప్రవర్తిస్తూ, సంబంధం లేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు... గాబరా పడిన కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.కిష్టారెడ్డి (54) పెండ్లిమడుగు గ్రామస్తుడు.. భార్య క్యాన్సర్‌ పేషెంటు..కొడుకుతో కలిసి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నది.  ఇదే సమయంలో శనివారం ఉదయం కిష్టారెడ్డి తుదిశ్వాస విడిచాడు... ఆ కుటుంబానిది తీరని వ్యథ ఇలా ఒక్కో ఇంటిలో ఒక్కో కథ.. ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో సంఘటనలు... అందరూ రెక్కాడితేగాని డొక్కాడని వారే.. అలసిన శరీరానికి సాంత్వన కోసం శుక్రవారం రాత్రి అలవాటుగా తాగిన కల్లు.. ఈ పరిణామాలకు కారణమైంది.. ఎవరో చేసిన పొరపాటుకు 147 మంది అస్వస్థతకు గురికాగా, ఒక మరణం చోటు చేసుకున్నది.  విషయం తెలిసీ తెలియగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌, యాదయ్య, కలెక్టర్‌ పౌసుమిబసు.. ఇలా అందరూ గ్రామాల్లో పర్యటించి , దవాఖానలను సందర్శించి వైద్యసేవల్ని పర్యవేక్షించారు.. స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి ఎక్కడికక్కడే వైద్య సేవలందించారు.. సమన్వయంతో, తక్షణ వైద్య సాయంతో ఇప్పుడు అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది.  సమయానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మిగతా వారికి ప్రాణహాని లేకుండా చేయగలిగారు. 

వికారాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కూలిపని చేసి వస్తూ శుక్రవారం రాత్రి కల్లు తాగిన వారిలో వంద మందికి పైగా శనివారం ఉదయం అస్వస్థతకు గురైన సంఘటనలు వికారాబాద్‌, నవాబ్‌పేట మండలాల్లో వెలుగుచూశాయి. ఈ రెండు మండలాల్లో 147 మంది అస్వస్థతకు గురికాగా పెండ్లి మడుగు గ్రామానికి చెందిన బిల్లకంటి కిష్టారెడ్డి(52) ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కో ఊరిలో పదుల సంఖ్యలో ప్రజలు దవాఖానల పాలయ్యారు. వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగు, నారాయణపూర్‌, ఎర్రవల్లి, మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడి, పులుసుమామిడి అలాగే చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని చిట్టిగిద్ద, ఎక్‌మామిడి, కుమ్మరిగూడ, మహ్మదన్‌పల్లి, వట్టిమీనేపల్లి, మూలమడ తదితర గ్రామాలకు చెందిన వారు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే వికారాబాద్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, వికారాబాద్‌ జిల్లా ఎక్పైజ్‌ సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌ ఆయా గ్రామాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించారు. బాధితులను దగ్గరలోని దవాఖాన లకు తరలించారు. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన కిష్టయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం నగరానికి తరలించారు. కల్లు దుకాణాలను ఎక్పైజ్‌ అధికారులు సీజ్‌చేశారు. ఈ సంఘటనపై వైద్య, రెవెన్యూ, ఎక్పైజ్‌ శాఖల అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న కల్లు అమ్మకాలపై జిల్లా  అధికారులు ఆరా తీశారు. శుక్రవారం రాత్రి కల్లు తాగిన వారికే ఇలా జరిగిందని  గ్రామస్తులు చెప్పారు. కల్లు బాటిళ్లను స్వాధీనం చేసుకొని  పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. బాధితుల కోసం పరిగిలో 30 పడకల దవాఖానలో   ఏర్పాట్లు చేశారు.  డెంటల్‌, మహావీర్‌ హాస్పిటళ్లు సిద్ధం చేశారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పలు గ్రామాల్లో ప్రజలు కళ్లు తిరిగి కిందపడిపోతున్నారని తెలుసుకుని గ్రామాలకు వెళ్లారు. ఎమ్మెల్యే స్వతహాగా       డాక్టర్‌ కావడంతో బాధితుల ఆరోగ్యాన్ని పరీక్షించారు. 

మంత్రి ఆదేశాలతో..

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి విషయంపై ఆరా తీశారు. విషయం తెలిసిన  వెంటనే జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసుతో మాట్లాడారు. చేవెళ్ల,వికారాబాద్‌ ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమీప ఆసుపత్రుల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విషయం తెలుసుకుని అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. 

మూడు బృందాలు ఏర్పాటు 

- వరప్రసాద్‌, ఎక్పైజ్‌ సూపరింటెండెంట్‌, వికారాబాద్‌  

వికారాబాద్‌, నవాబ్‌పేట మండలాల్లోని 11 గ్రామాల్లో ఈ సంఘటన జరిగింది. రెండు మండలాల్లో మూడు బృందాలను ఏర్పాటు చేశాం.అన్ని చోట్ల నుంచి శాంపుల్స్‌  సేకరించాం. అన్ని కల్లు దుకాణాలు మూసివేయించాము. కల్లు శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపించాము. ఫలితాలు వచ్చినాక పూర్తి వివరాలు తెలుస్తాయి.  

VIDEOS

logo