సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 08, 2021 , 00:21:13

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

కొడంగల్‌/బొంరాస్‌పేట, జనవరి 7: రైతులను సంఘటితం చేసేందుకు ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తున్నదని, రైతు వేదికలు రైతులకు దేవాలయాలుగా రూపుదిద్దుకోనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కొడంగల్‌ మండలంలోని పర్సాపూర్‌లో రైతు వేదిక, పల్లె ప్రకృతివనం,  కొండారెడ్డిపల్లిలో  రూ.1.70కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంలో పల్లె ప్రకృతి వనాన్ని, రైతు వేదిక భవనాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందని, రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతుల కష్టాలను స్వయంగా అనుభవించిన ముఖ్యమంత్రి కాబట్టే కర్షకుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు కల్లాల వద్దనే పంట కొనుగోలు చేశారన్నారు. కోటి రతనాల తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి చొరువతో కోటీ 70లక్షల ఎకరాల్లో పంటసాగవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లాను  సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే సంకల్పంతో ఉన్నామన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, పల్లె ప్రగతితో గ్రామాభ్యున్నతికి శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామాలకు బీటీ, సీసీ రోడ్లు మంజూరుతో పాటు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డ్‌, స్మశానవాటికలు మంజూరు చేసినట్లు తెలిపారు. పర్సాపూర్‌లో విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం అందిస్తూ..వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నారా... ఏమైనా ఇబ్బందులు న్నాయా... అని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ తరగతులు చాలా బాగున్నాయని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠాలను వింటున్నామని విద్యార్థులు మంత్రికి తెలిపారు. 

పల్లెలకు కొత్తరూపు: జడ్పీ చైర్‌పర్సన్‌ 

ఒకప్పుడు గ్రామాలు కందకాలు, చెత్తకుప్పలతో  ఉండేవని నేడు పల్లె ప్రకృతి వనాలు ఇతర అభివృద్ధి పనులతో రూపు మారాయని జెడ్పీ చైర్మన్‌ పట్నం సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. రూ.2500 కోట్ల నిధులతో పట్టణ, పల్లె గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు జెడ్పీ నిధుల నుంచి రూ.50లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. పర్సాపూర్‌ గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి మరో రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా జెడ్పీటీసీ నాగరాణి  పాఠశాలలు, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు నివేదిక ఇచ్చిందని,త్వరలో  మంజూరుకు కృషి చేస్తానన్నారు. 

కొండారెడ్డిపల్లి కల తీరింది : ఎమ్మెల్యే  నరేందర్‌రెడ్డి

కొండారెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులను పడ్డారని, అటువంటి సమస్య నేడు కేసీఆర్‌ ప్రభుత్వం తీర్చిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. వెనుకబడిన కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఇందులో భాగంగా రూ.1కోటి70లక్షల నిధులతో కొండారెడ్డిపల్లికి బీటీ రోడ్డు వేసినట్టు తెలిపారు. గత ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొని ఎటువంటి అభివృద్ధిని చేపట్టలేదని పేర్కొన్నారు.సర్పంచ్‌లు, అధికారులు చురుకుగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేస్తున్నారని వారిని అభినందించారు. కార్యక్రమంలో పర్సపూర్‌, కొండారెడ్డిపల్లి గ్రామాల సర్పంచ్‌లు సయ్యద్‌ అంజద్‌, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ గోవిందమ్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బస్వరాజ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు కట్కం శివకుమార్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్‌, ప్రభాకర్‌గౌడ్‌, డా.శ్రీలతాయాదవ్‌, రహత్‌బేగం, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు గోడల రాంరెడ్డి, సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, గోవింద్‌, గుండప్ప, ఫకీరప్ప, శంకర్‌నాయక్‌లతో పాటు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్డీవో అశోక్‌కుమార్‌, ఏడీఏ వినయ్‌కుమార్‌ తదితరులు   పాల్గొన్నారు. బొంరాస్‌పేట మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణాదేశు,                    వైస్‌ ఎంపీపీ  నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో హరినందనరావు, తాసిల్దార్‌ షాహెదాబేగం,  మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కోట్ల యాదగిరి, సర్పంచ్‌ రాజేశ్వరి, ఎంపీటీసీ జగదీశ్‌, పార్టీ నాయకులు నరేశ్‌గౌడ్‌, మహేందర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo