బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Jan 08, 2021 , 00:13:10

లెక్కలన్నీ ఫర్‌ఫెక్ట్‌

లెక్కలన్నీ ఫర్‌ఫెక్ట్‌

  • 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం ఆన్‌లైన్‌ ఆడిట్‌
  • రాష్ట్రంలో వికారాబాద్‌కు 6వ స్థానం 
  • జిల్లాలోని 566 పంచాయతీల్లో ఆన్‌లైన్‌లో 35 శాతం (200) , ఆఫ్‌లైన్లో 65 శాతం (366)
  • కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్‌ ప్రక్రియ పూర్తి
  • పంచాయతీలకు నివేదికలు
  • ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే నిధులు విడుదల 
  • 1,307 అభ్యంతరాలు .. రూ.79,37,480 రికవరీకి సిఫారసు 
  • 45 రోజుల్లో నోటీసులకు సంజాయిషీ ఇవ్వాలి

15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం వికారాబాద్‌ జిల్లాలో ఆడిట్‌  ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటికే జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రక్రియ పూర్తికాగా.. మున్సిపాలిటీల్లో 50శాతం దాటింది.  జిల్లాలో మొత్తం 566 జీపీలుండగా 200 గ్రామాలు ఆన్‌లైన్‌ విధానంలో, మిగితావి ఆఫ్‌లైన్‌లో నిర్వహించారు.  ఆన్‌లైన్‌ ఆడిట్‌  అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. అయితే  రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ ఆడిట్‌లో వికారాబాద్‌ జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ ప్రత్యేక చొరవతో పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను సమన్వయం చేయడంతో ప్రక్రియ పక్కాగా సాగుతున్నది. ఆడిట్‌కు సంబంధించి నివేదికలు ఇప్పటికే గ్రామపంచాయతీలకు అందాయి. వీటిపై ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే నిధులు మంజూరు చేయనున్నారు. ఆన్‌లైన్‌ ఆడిట్‌లో మొత్తం 1,307 అభ్యంతరాలు రాగా, రూ.79,37,480 రికవరీకి సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు.  

వికారాబాద్‌, జనవరి 7, (నమస్తే తెలంగాణ): పంచాయతీలు వినియోగించిన నిధులపై ఆన్‌లైన్‌ ఆడిట్‌ పూర్తయ్యింది. వికారాబాద్‌ జిల్లాలో పంచాయతీలు వంద శాతం పూర్తి చేశాయి. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు 50 శాతమయ్యాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో ఆడిట్‌ను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం ఆన్‌లైన్‌ ఆడిట్‌ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో జిల్లాలో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 566 పంచాయతీల్లో ఆడిట్‌ పూర్తయ్యింది. రాష్ట్రంలోనే వికారాబాద్‌ జిల్లా 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలో ఆడిట్‌ కొనసాగుతున్నది. ఇప్పటికే పంచాయతీల్లో వంద శాతం పూర్తి చేయగా.. మున్సిపాలిటీల్లో 50 శాతం పూర్తయినట్లు, ఈ నెలాఖరు వరకు 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ఆన్‌లైన్‌ ఆడిట్‌ విధానంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది. ఆడిట్‌ విధానాన్ని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది పంచాయతీల్లో వంద శాతం ఆన్‌లైన్‌ విధానం తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 566 పంచాయతీల్లో 35 శాతం (200) ఆన్‌లైన్‌లో ఎంపిక చేసి ఆడిట్‌ పూర్తి చేశాయి. మిగిలిన 366 పంచాయతీలు ఆఫ్‌లైన్‌లో పూర్తిచేశాయి. జిల్లాలో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 1,307 అభ్యంతరాలు వచ్చాయి. వీటికి సంబంధించి రూ.79,37,480 రికవరీకి సిఫారస్సు చేశారు. 45 రోజుల్లో అధికారులు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్నారు. 

నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో స్పష్టత..

ఆన్‌లైన్‌లో ఆడిట్‌ చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. పంచాయతీల పనితీరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ఆడిట్‌ దోహదపడుతుంది. రాష్ట్రంలో ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ ప్రత్యేక చొరవతో పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అన్ని రకాలుగా ఆన్‌లైన్‌ ఆడిట్‌లో వికారాబాద్‌ జిల్లా 100 శాతం పూర్తిచేసింది. ఆడిట్‌ నివేదికలు ఆన్‌లైన్‌లో పొందుపరిచి,  పంచాయతీలకు నివేదికలు పంపారు. ఆన్‌లైన్‌లో ఎదురైన సవాళ్లను అధిగమించారు. వచ్చే ఏడాది 100 శాతం ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేసేందుకు వీలుగా పంచాయతీల వారీగా యూజర్‌ ఐడీలు క్రియేట్‌ చేసేలా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. 

200 పంచాయతీలు ఆన్‌లైన్‌లో.. 366 ఆఫ్‌లైన్‌లో..

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో వికారాబాద్‌ జిల్లాలోని 100 శాతం పంచాయతీల్లో పూర్తి చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఆడిట్‌ కొనసాగుతున్నది. జిల్లాలో 566 పంచాయతీల్లో ఈ ఏడాదికి గాను 35% ఆడిట్‌ను ..మొదటిసారి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో పూర్తిచేశారు. మిగిలిన 366 పంచాయతీలు ఆఫ్‌లైన్‌లో పూర్తి చేశారు. 

ఆడిట్‌ పూర్తయింది..

కేంద్ర ఆదేశాల ప్రకారం పంచాయతీల నిధుల వినియోగంపై ఆడిట్‌ పూర్తయ్యింది. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నా గ్రామాల్లో సమగ్ర పాలన లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీలో ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల వినియోగంపై ఆడిట్‌ పూర్తి చేసి ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని ఆంక్షలు విధించింది. దీంతో పంచాయతీల్లో ఆడిట్‌ అనివార్యమైంది. ఇప్పటికే నిధుల వినియోగంలో పంచాయతీల్లో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నది. ఇవి సరిపోవడం లేదు. పంచాయతీల్లో పని చేసే కార్మికుల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు ఇక నుంచి ప్రతి నెలా చెల్లించాలని ఆదేశాలివ్వడం, ట్రాక్టర్ల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలతో నిధులన్నీ ఖర్చవుతున్నాయి. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ ఉండాలని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.8,500ల చొప్పున పెంచడం, మల్టీపర్పస్‌ కార్మికులుగా గుర్తించి వారికి వేతనాలు ఇవ్వాల్సి వస్తున్న నేపథ్యంలో వచ్చిన నిధులు వాటికే సరిపోతున్నాయి. గతంలో పంచాయతీల్లో వినియోగించిన నిధులకు యూసీలు (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్స్‌) సమర్పిస్తే వాటినే పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేసేవారు. కానీ, ఇక నుంచి కేంద్ర ఆన్‌లైన్‌ ఆడిట్‌ తప్పనిసరి చేసింది. అంటే పంచాయతీల్లో వెచ్చించిన ప్రతి రూపాయికి ఎమ్మార్పీ ధరలను అనుసరిస్తూ వాటికి సంబంధించిన రశీదులను ఆన్‌లైన్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఆడిట్‌లో ధ్రువీకరించిన తర్వాతే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్‌లైన్‌ ఆడిట్‌ తప్పని సరిగా చేయడంతో ప్రతిపైసా లెక్కించాలని సూచించింది. పంచాయతీకి వచ్చిన ఆదాయం, పన్నులు, చేసిన ఖర్చులన్నీ ఆన్‌లైన్‌ ఆడిట్‌లో స్పష్టం చేసిన తర్వాత వాటి ఆమోదం వస్తేనే కేంద్రం నిధులు రానున్నాయి. 

ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకత 

రాష్ర్టానికి సంబంధించి దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రాష్ట్ర ఆడిట్‌ సంచాలకులు ఎం.వెంకటేశ్వర్‌ రావు ప్రత్యేక శ్రద్ధతో చూపించి, నంబర్‌ వన్‌గా నిలబెట్టారు. వికారాబాద్‌ జిల్లాలో 100 శాతం ఆడిట్‌ పూర్తి అయ్యింది. జిల్లాలోని ఆడిటర్లు ఎంతో కృషి చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జిల్లాకు మంచిపేరు తెచ్చారు. మార్కెట్‌ కమిటీ, మండల పరిషత్‌, మున్సిపాలిటీలను ఆడిట్‌ చేశాం. ఈ ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. - వీ.వీరభద్రరావు, జిల్లా ఆడిట్‌ అధికారి, వికారాబాద్‌

VIDEOS

logo