నిఘా నేత్రం

- పల్లె, పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు
- నేను సైతం కార్యక్రమానికి అనూహ్య స్పందన
- స్వచ్ఛందంగా దాతల విరాళాలు
తాండూరు, జనవరి 6 : పోలీస్‌శాఖలో సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. తాండూరు నియోజకవర్గ పరిధిలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజలను చైతన్యులను చేస్తున్నాయి. నేరాల నియంత్రణకు ప్రజలకు సాంకేతికతపై అవగాహన కల్పిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పోలీస్‌శాఖ ముఖ్యంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేకశ్రద్ధ చూపడంతో నేరాల నియంత్రణతోపాటు కేసుల సత్వర పరిష్కారానికి సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేస్తున్నాయి. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, దాతల సహకారంతో గ్రామాలు, పట్టణంలోని వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వేగంగా జరుగుతున్నది. సీసీ కెమెరాల అవసరాలు, ఉపయోగాలపై పోలీసులు ప్రజలను అవగాహన పరుచడంతో నేతలు, ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. తాండూరు పట్టణంలో 403, గ్రామీణ ప్రాంతాల్లో 150 నియోజకవర్గంలో పోలీస్‌శాఖ మొత్తం 553 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ రవికుమార్, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు.
553 సీసీ కెమెరాల ఏర్పాటు..
ప్రజల భద్రతే ప్రధానంగా పోలీస్‌శాఖ చేపట్టిన మేము సైతం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నది. తాండూరు నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 553 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులతోపాటు ప్రధాన చౌరస్తాల్లో 403 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా నియోజకవర్గంలోని తాండూరు మండలం పరిధిలోని చెంగోల్, కరణ్‌కోట్, గౌతాపూర్, బెల్కటూరు, చంద్రవంచ, మల్కాపూర్, కోట్బాసుపల్లిలో 52 సీసీ కెమెరాలు, యాలాల మండల పరిధిలోని యాలాల, లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా, కోకట్, అగ్గనూరులో 24 సీసీ కెమెరాలు, పెద్దేముల్ మండల పరిధిలోని పెద్దేముల్, కందనెల్లి, ఇందూరు, తట్టెపల్లి, మన్సాన్పల్లిలో 44 సీసీ కెమెరాలు, బషీరాబాద్ మండల పరిధిలోని బషీరాబాద్, ఇంద్రాచడ్, మంతటి, కాశింపూర్, రెడ్డిఘనాపూర్, కంసాన్పల్లి, జీవన్గీలో 34 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతి త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు సీఐ జలంధర్‌రెడ్డి పేర్కొన్నారు.
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో కీలకం..
పల్లెలు, పట్టణాల్లోని వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ, అక్రమాలను అరికట్టడంతోపాటు కేసుల ఛేదనకు కీలకంగా ఉపయోగపడుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అనుమానితులను త్వరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇటీవల జరిగిన దొంగతనాల్లో సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడక్కడ పలుచోట్ల పని చేయని సీసీ కెమెరాలను త్వరలో బాగు చేయిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం..
త్వరలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అం దుకు ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలకు విరాళాలు ఇస్తే బాగుంటుంది.
- జలంధర్‌రెడ్డి, తాండూరు రూరల్ సీఐ
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు