శనివారం 06 మార్చి 2021
Vikarabad - Jan 06, 2021 , 00:11:35

పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి

 పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి

  • కారుణ్య నియామకాలపై దృష్టి సారించాలి
  • ఎల్‌ఆర్‌ఈపీలో పార్ట్‌ బీలోని కేసులను రెండు నెలల్లో పరిష్కరించాలి

 కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశం ఈ నెలాఖరు వరకు అన్ని కేటగిరీల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం ఆయన నగరం నుంచి  కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ కారుణ్య నియామకాల భర్తీకి చొరవ చూపాలన్నారు. పార్ట్‌ బీలోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

  • రెండు నెలల్లో పార్ట్‌-బీ భూముల సమస్యలను పరిష్కరించండి
  • ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకా అందించేందుకు ఏర్పాట్లు చేయండి
  • - వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

వికారాబాద్‌,జనవరి 5,(నమస్తే తెలంగాణ) : ఈ నెలఖారులోగా అన్ని కేటగిరిల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు,గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు,ఇతర శాఖల అధికారులతో నగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదోన్నతుల విషయమై ఇకపై ప్రతి సోమవారం ఒక గంట కలెక్టర్లు సమ యం కేటాయించాలని, కారుణ్య నియామకాల భర్తీ పై కూడా దృష్టి సారించాలని అన్నారు. గత నెల డిసెంబర్‌ 31న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో భూములకు సంబంధించిన సమస్యలను చర్చించినట్టు తెలిపారు.. పార్ట్‌ బీలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ల సమావేశంలో కూడా చర్చించనున్నట్లు వెల్లడించారు.  రెండు నెలల్లో అన్ని కేసులను పరిష్కరించాలని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తాసిల్దార్‌ స్థాయిలో ఉన్న అన్ని కేసులు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పెండింగ్‌ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. భూములకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. 2020 సంవత్సరంలో అన్ని జిల్లాలో కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు, ఇతర అధికారులు బాగా పనిచేశారని  సీఎస్‌ అందరినీ అభినందించారు.  వేదికలలో నీటి సౌకర్యంతో పాటు  విద్యుత్‌ ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలు, కల్లాల నిర్మాణం, చెత్త వేరు చేసే షెడ్డులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. నర్సరీలలో ఇప్పటి వరకు 83శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఉపాధి హామీ కింద ఈ సంవత్సరం 14 కోట్ల పది లక్షల పని దినాలు కల్పించామని, రాబోయే మూడు నెలల్లో ఇంకా బాగా పనిచేసి 7కోట్ల పని దినాలు జరిగేట్లు చూడాలని సూచించారు. ఈ సమావేశంలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు,అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో రిజ్వానా, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఏవో గోపాల్‌  పాల్గొన్నారు.

VIDEOS

logo