శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 04, 2021 , 01:22:24

హరిత లక్ష్యం 77.18లక్షలు

 హరిత లక్ష్యం 77.18లక్షలు

  • జీపీల్లో  57.18 లక్షలు,  మున్సిపాటీల్లో 10లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలు..
  • హరితహారానికి వికారాబాద్‌ జిల్లా యంత్రాంగం సన్నద్ధం
  • గ్రామానికో నర్సరీ..  11వేలకు తగ్గకుండా  మొక్కలు 
  • గతం కన్నా మీటరు పొడువు అధికంగా ఉండేలా ఆర్నెళ్ల ముందుగానే పెంపకం ప్రారంభం
  • జిల్లాలో 566 జీపీలు.. 580 నర్సరీలు ఏర్పాటు 

హరితహారం కోసం మొక్కల పెంపకానికి వికారాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. జిల్లావ్యాప్తంగా 77.18 లక్షల మొక్కలు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 57.18లక్షలు, మున్సిపాటీల్లో 10లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలు పెంచుతున్నారు. గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయగా.. ఇప్పటికే మెజార్టీ గ్రామాల్లో మొక్కల పెంపకం ప్రారంభమైంది. ఒక్కో  గ్రామపంచాయతీలో 11వేల మొక్కలకు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మట్టిని జల్లెడ పట్టడం, మట్టిని కవర్లలో నింపడం వంటి పనులు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల విత్తనాలు సైతం నాటారు. జిల్లాలో మొత్తం 580 నర్సరీలు ఏర్పాటు చేస్తుండగా.. సుమారు రూ.6.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈసారి సుమారు 82 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో నాటేందుకు వీలుగా పండ్లు, పూల మొక్కలకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో కన్నా ఒక మీటరు ఎత్తు ఉన్న మొక్కలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆరు నెలల ముందుగానే పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల నిర్వహణను అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. కాగా జిల్లాలో మొత్తం 566 గ్రామపంచాయతీలున్నాయి. 

పరిగి : హరితహారంలో భాగంగా అవసరమైన మొక్కలు అం దించేందుకు అధికార యంత్రాంగం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం విజయవంతమవడంతో జిల్లావ్యాప్తంగా హడావుడిగా కాకుండా ఆరు నెలల ముందుగానే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టి, ఈసారి మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 77.18లక్షల మొక్కల పెంపకానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మెజార్టీ నర్సరీలలో మొక్కల పెంపకం ప్రారంభమైంది. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు అటవీశాఖ నేతృత్వంలో ప్రణాళికాబద్దంగా నర్సరీలలో చేపడుతున్నారు. గతంలో వలే కాకుండా ప్రతి గ్రామంలో మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలన్నది సర్కారు లక్ష్యం. తద్వారా ఎక్కడ, ఎవరికి మొక్కలు అవసరమైనా ఆయా గ్రామపంచాయతీల పరిధిలోని నర్సరీల నుంచి మొక్కలు అందించేందుకు నిర్ణయించారు. 

566 గ్రామపంచాయతీలలో 57.18లక్షల మొక్కలు 

వికారాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన నర్సరీలలో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా నర్సరీలలో గత పక్షం రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు చేపడుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద నర్సరీలలో మొక్కల పెంపకం చేపడుతారు. ఒక్కో గ్రామపంచాయతీలోని నర్సరీలో 11వేల మొక్కల పెంపకం చేపడుతారు. ప్రస్తుతం వీటికి సంబంధించి మట్టిని జల్లెడ పట్టించి, కవర్లలో నింపే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల విత్తనాలు సైతం తీసుకువచ్చి నాటారు. కులకచర్ల ప్రాంతంలోనే ఈ విత్తనాలు కొనుగోలు చేసి జిల్లావ్యాప్తంగా ఉన్న నర్సరీలలో నాటుతారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెలాఖరులోపు విత్తనాలు నాటే కార్యక్రమం పూర్తి చేసేందుకు వీలుగా ఇతర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామపంచాయతీలోని నర్సరీలో 11వేల మొక్కల పెంపకానికి రూ.1.21లక్షల చొప్పున, జిల్లావ్యాప్తంగా 566 గ్రామపంచాయతీలలో రూ.6.50కోట్లు ఖర్చు చేయనున్నారు. 

మున్సిపాలిటీలలో 10లక్షలు... అటవీశాఖ ఆధ్వర్యంలో 10లక్షలు 

జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో సైతం ఈసారి పెద్దఎత్తున అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలోని వికారాబాద్‌ మున్సిపాలిటీలో సుమారు 4లక్షలు, తాండూరులో 4 లక్షలు, నూతన మున్సిపాలిటీలు పరిగిలో లక్ష, కొడంగల్‌లో లక్ష మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే పట్టణాలలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసి, వాటిలో మొక్కల పెంపకంపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. ఇవేకాకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 17 నర్సరీలలో 10లక్షల మొక్కల పెంపకం చేపట్టనున్నారు. 

ఈ లెక్కన మున్సిపాలిటీలు, అటవీశాఖ ద్వారా మొత్తం 20లక్షలు పెంచి, పంపిణీ చేస్తారు. మున్సిపాలిటీలలో పెంచిన మొక్కలను ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటికీ సరఫరా, ప్రతి ప్రధాన రహదారికి ఇరువైపులా నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. అటవీశాఖ ద్వారా ఏర్పాటుచేసే నర్సరీలలో పెంచిన మొక్కలను అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున పెంచేందుకు వినియోగించనున్నారు.

82 రకాల మొక్కలు పంపిణీ

ఈసారి జిల్లాలోని నర్సరీలలో సుమారు 82 రకాల మొక్కల పెంపకం చేపడుతున్నారు. తద్వారా ఆయా గ్రామాలలో ప్రజలు, రైతులు కోరిన మేరకు వివిధ రకాలు పంపిణీ చేయవచ్చన్నది ఆలోచన. వీటిలో పండ్లమొక్కలతోపాటు వివిధ రకాల మొక్కలు, క్రోటాన్‌, పూలమొక్కలు తదితర రకాల వాటిని పెంచుతారు. గతంలో వలే కాకుండా ఈసారి కనీసం ఒక మీటరు ఎత్తు గల వాటిని పంపిణీ చేయాలని నిర్దేశించారు. ఇందులో భాగంగానే సకాలంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జనవరి నెలాఖరులోపు జిల్లావ్యాప్తంగా అన్ని నర్సరీలలో ప్రారంభించడం ద్వారా జూన్‌ నెలాఖరు వరకు మొక్కలు పెద్దగా ఎదుగుతాయని అధికారులు సూచిస్తున్నారు. 

ప్రతి నర్సరీలో పెంపకం చేపట్టిన మొక్కలు కనీసం మీటరు ఎత్తు ఉన్న వాటిని ఆయా గ్రామాలలో నాటేందుకు వినియోగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తద్వారా నాటిన ప్రతి మొక్క బతికేందుకు ఆస్కారం ఉంటుందని, రాబోయే రెండు మూడు సంవత్సరాలలోనే మరింత ఎత్తుకు పెరుగుతుందన్నది అధికారుల ఆలోచన. ఇదిలావుండగా అన్ని నర్సరీలలోనూ మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవసరమైన విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. నీటి వసతి సైతం సక్రమంగా ఉన్నదా లేదా ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమం ఈసారి జిల్లావ్యాప్తంగా మరింత పకడ్బందీగా చేపట్టడానికి ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నారు.

గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నాం

ప్రతి గ్రామపంచాయతీవారీగా గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయా రు చేస్తున్నాం. ఆయా గ్రామాలలో ఇంటి ఆవరణలో నాటే మొక్కలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్డు పక్కన నాటే మొక్కలు ఏవి పెంపకం చేపట్టాలనేది నిర్ణయించి, అందుకనుగుణంగా నర్సరీలలో మొక్కల పెంపకం చేపడుతున్నాం. జిల్లాలోని 566 గ్రామపంచాయతీలలోని నర్సరీలలో పెంచిన మొక్కలు ఆయా గ్రామాల పరిధిలో నాటిస్తాం. ఈసారి ఏవైనా మొక్కలు మిగిలితే వాటిని ప్లాంటేషన్‌ కోసం వచ్చే సంవత్సరం వినియోగిస్తాం. ఈసారి కనీసం మీటరు ఎత్తు గల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించాం.   

- ఎం.ఎ.కృష్ణన్‌, డీఆర్‌డీవో, వికారాబాద్‌ జిల్లా 

VIDEOS

logo