శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 02, 2021 , 00:10:08

కొంగొత్తగా

కొంగొత్తగా

న్యూస్‌నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ: భక్త జన సందోహంతో ఆలయాలు కిక్కిరిశాయి. కొత్త సంవత్సరం రోజున కొంగొత్త కోరికలు నెరవేరాలని ఆయా ఆలయాల్లో ప్రజలు తమతమ ఇష్ట దేవతలను కోరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ, వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరిలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయాలతో పాటు తమకు సమీపంలో ఉన్న దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు. ఈ ఏడాది అంతా ఆనందంగా, లాభదాయకంగా ఉండాలని కోరుకున్నారు. కరోనా లాంటి వ్యాధులను తరిమికొట్టాలని దేవుడిని ప్రార్థించారు. 

చిలుకూరు బాలాజీ దర్శనం

మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు బాలాజీని దర్శించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారు జామున స్వామివారికి ధనుర్మాస ఆరాధన పూజ చేశారు. స్వామివారికి నక్షత్ర హారతి, కుంభ హారతి ఇచ్చారు.  రాత్రి వరకు సుమారు 50 నుంచి 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారను. నూతన సంవత్సరంలో శుభం జరుగాలని, ఏడాది పాటు సుఖశాంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు. 

వికారాబాద్‌లోని అనంతగిరిలో..

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరిలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని కోనేటిలో పుణ్య స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సెలవు దినం కావడంతో భక్తులు, పర్యాటకులతో సందడి నెలకొంది. ఈ పుణ్యక్షేత్రానికి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ..

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తు లు భారీగా వస్తారని భావించి, ముందు జాగ్రత్త కోసం ఆలయ నిర్వాహకులు, పోలీసు లు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి వారిని దర్శించుకోవడానికి అనుమతించినా గర్భగుడి దర్శనానికి అవకాశం ఇవ్వలేదు. భక్తులు మహాద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. 10 నుంచి 15 నిమిషాల్లో స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. మాస్కు ఉంటేనే ఆలయంలోనికి అనుమతించారు. ఆలయ కమిటీ  కన్వీనర్‌ గోపాలకృష్ణ, పూజారి రంగరాజన్‌ భక్తులకు సూచనలు, సలహాలు అందజేశారు.

భారీ బందోబస్తు

చిలుకూరి బాలాజీ ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌  ఏసీపీ పర్యవేక్షణలో భారీబందోబస్తు ఏర్పాటుచేశారు. సుమారుగా 150 మంది పోలీసులు, 100 మంది వలంటీర్లతో భక్తులకు ఇబ్బందులు  కలుగకుండా సహకరింంచారు. 10 చోట్ల వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఆలయం బయట 10 వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు స్వామి వారిని తొందరగా దర్శించుకోవడానికి ఏర్పాటుచేశారు.

అనంతగిరికి పోటెత్తిన భక్తులు

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌కు నాలుగు కిలో మీటర్ల సమీపంలో ఉన్న అనంతగిరి పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ సమీపంలోని కేనేటిలో పుణ్య స్థానాలు చేశారు. ఈ పుణ్యక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. అనంతరం నంది ఘాట్‌ వద్ద సెల్ఫీలు దిగి ఆనందంగా గడిపారు. అనంతరం పర్యాటకులు వన భోజనాలు చేశారు.

- వికారాబాద్‌, జనవరి1

మైసిగండి మైసమ్మ ఆలయంలో పూజలు

రంగారెడ్డి జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవతను భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మవారికి  మొక్కులు సమర్పించుకున్నారను. ఈయేడు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, వ్యాపారాలు  అభివృద్ధి సాధించాలని కోరారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

- కడ్తాల్‌, జనవరి1 

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మర్పల్లి చర్చిలో జడ్పీటీసీ మధుకర్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకొన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని వేడుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా మరికొన్ని రోజులు నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంగీత వసంత్‌, ఉప సర్పంచ్‌ రాజు, పాస్టర్‌ గ్రామస్తులు పాల్గొన్నారు.      

- మర్పల్లి, జనవరి1

కొత్త ఏడాది జాతకం ఎట్లున్నది..

ఈసారి జాతకం ఎలా ఉందో తెలుసుకునేందుకు కొందరు ఉత్సాహం చూపారు. ఈ సంవత్సరం తమకు అన్ని కలిసి వస్తాయా.. తాము అనుకున్నవన్నీ జరుగుతాయా.. మంచి ఉద్యోగాలు వస్తాయా.. అని చిలక జోతిష్యం చెప్పించుకున్నారు. చదువు రాని వారితో చదువుకున్న వారు కొందరు తమ జాతకాన్ని చెప్పించుకోవడంతో కొందరు ఎంతో ఆసక్తిగా చూశారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి భక్తులు చిలక జోతిష్యం చెప్పించుకున్నారు.       

- మొయినాబాద్‌, జనవరి1

కరోనా పట్ల జాగ్రత్తలు అవసరం

  • వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ 

కరోనా పూర్తిగా పోలేదని, కొత్త రకం వైరస్‌ వస్తున్నదని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నారాయణ అన్నారు. జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలో అధికారులతో కలసి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామని నూతన సంవత్సరంలో పోలీసులు, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకున్నారు.  అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శాంతిభద్రతలు కాపాడాలని తెలిపారు. చట్టాలను గౌరవించి ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నిర్వహిస్తూ, పోలీస్‌ శాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

- వికారాబాద్‌, జనవరి1

VIDEOS

logo