ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 01, 2021 , 01:31:09

అభివృద్ధి వేగం భవిష్యత్తు బంగారం

అభివృద్ధి వేగం భవిష్యత్తు బంగారం

  • 2021లో మారనున్న  వికారాబాద్‌ జిల్లా రూపురేఖలు
  • రూ.400 కోట్లతో పర్యాటక వృద్ధి ప్రణాళిక
  • రూ.2.75 కోట్లతో అర్బన్‌ పార్కులు
  • మర్పల్లి, తాండూర్‌లో ఇండస్ట్రియల్‌ పార్కులు
  • త్వరలో అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌
  • జిన్‌గుర్తిలో రూ.2 కోట్లతో నైపుణ్య అభివృద్ధి కేంద్రం
  • అనంతగిరి పర్యాటక కేంద్రంగా అడుగులు
  • తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో రూ.2.75 కోట్లతో అర్బన్‌ పార్కులు
  • అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌

2021 సంవత్సరంలో వికారాబాద్‌ జిల్లా కనీవినీ ఎరుగని రీతిలో  అభివృద్ధి చెందనున్నది.  జిల్లాను రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సందర్శకుల మనుసు దోచేలా రూ.400 కోట్లతో అనంతగిరి అడవులు, కోట్‌పల్లి ప్రాంతాల్లో  పనులు చేపట్టనున్నారు. వాచ్‌టవర్లు, ట్రెక్కింగ్‌, రోప్‌వే, పారాచూట్‌ ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, యోగా, ధ్యాన కేంద్రం, స్పా వంటి అధునాతన హంగులు కల్పిస్తారు.  కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద థీమ్‌పార్క్‌తోపాటు బోటింగ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా రూ.16కోట్లతో అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.  రూ.3.25 కోట్లతో రెండు అర్బన్‌పార్కుల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.   ఇప్పటికే శివారెడ్డిపేట్‌, రాకంచర్లలో పారిశ్రామిక కేంద్రాలుండగా,  జిన్‌గుర్తి, అర్కతల, ఘనాపూర్‌లో  ఇండస్ట్రియల్‌ పార్కులు  నెలకొల్పనున్నారు. అదేవిధంగా 33 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. కాగ్నా, కాకరవేణి, మూసీనదులు, వాగులపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు ఇదే ఏడాదిలో పూర్తికానున్నాయి. 

వికారాబాద్‌, డిసెంబర్‌31, నమస్తే తెలంగాణ: 2021లో వికారాబాద్‌ జిల్లా రూపురేఖలు మారనున్నాయి. సమైక్య రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం గా ఉన్న వికారాబాద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం, తదనంతరం అన్ని రంగాల్లోనూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. ప్రతీ గ్రామానికి రోడ్లు, అభివృద్ధి వికేంద్రీకరణకు కొత్త మున్సిపాలిటీలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, గ్రామాలు, పట్టణాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుచేయడం, పల్లెప్రకృతి వనాలు, ప్రతీ గ్రామ పంచాయతీలో నర్సరీ, చివరి మజిలి గౌరవంగా జరుగాలనే ఉద్దేశంతో వైకుంఠధామాల ఏర్పాటు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశారు. 2021లో జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. అంతేకాకుండా జిల్లాపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. పారిశ్రామిక రంగాన్ని అన్ని జిల్లాలకు విస్తరించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈ ఏడాది కొత్త పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది.

రూ.400 కోట్లతో పర్యాటక అభివృద్ధి

తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. 1505 హెక్టార్లలో విస్తరించి ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంతోపాటు కోట్‌పల్లి ప్రాంతం పర్యాటకులను ఆకర్షించేందుకు రూ.400 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు చేపట్టారు. ఏడాదిలోగా అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అనంతగిరి అటవీ ప్రాంతం ఎంట్రన్స్‌లో కమాన్‌ ఏర్పాటు చేయడంతోపాటు జింక సర్కిల్‌ వద్ద మరింత అభివృద్ధి చేసి, సెల్ఫీలు తీసుకునేందుకు కాంకోవాల్‌ ఏర్పాటు, అటవీ ప్రాంతంలో పర్యాటకులకు ఉత్సాహానిచ్చే జిప్‌లైన్లు, వాటర్‌ ఫౌంటెన్లు ఏర్పాటు చేయనున్నారు. కెరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం సమీపంలో హట్‌లు, పులి బొమ్మలను ప్రదర్శించడం, రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలోనే ఉండేలా నైట్‌ క్యాంపింగ్‌లు, కేఫ్‌లు, చిన్న పిల్లలు ఆటలాడేందుకు గేమ్స్‌ ఏర్పాటు, ప్రకృతి చికిత్స అందించేందుకు ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, శారీరక దృఢత్వానికి యోగా, ధ్యాన కేంద్రం, స్పా, స్విమ్మింగ్‌ పూల్‌, ఇక్కడున్న వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్‌ టవర్లను నిర్మించడం, ట్రెక్కింగ్‌, అనంతగిరి ప్రాంతాన్ని పూర్తిగా వీక్షించేందుకు రోప్‌వేను ఏర్పాటు చేయడం లాంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అనంతగిరి ప్రాంతంలో పారాచూట్‌కు అనుకూలమైన గాలులు వీస్తుండడంతో పారాచూట్‌ కూడా పర్యాటకులకు అందుబాటులోకి రానున్నది. కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద కూడా బోటింగ్‌తోపాటు నైట్‌ క్యాంపింగ్‌లకు అనుకూలంగా ఉండేలా అభివృద్ధి చేయనున్నారు.

మరో మూడు ఇండస్ట్రియల్‌ పార్కులు

జిల్లాలో మరో మూడు పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే శివారెడ్డిపేట్‌తోపాటు రాకంచర్లలో పారిశ్రామిక కేంద్రాలుండగా మరో మూడు జిన్‌గుర్తి, అర్కతల, ఘణాపూర్‌లలో ఈ కేంద్రాలు రానున్నాయి. తాండూరు మండలం జిన్‌గుర్తిలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్‌ పార్కు శంకుస్థాపనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈనెల మొదటి వారంలో జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలోని శివారెడ్డిపేట్‌ ఇండస్రిత్టయల్‌ పార్కులో అన్ని రకాల పరిశ్రమలుండగా, రాకంచర్ల పారిశ్రామిక కేంద్రంలో స్టీల్‌ పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. జిన్‌గుర్తి గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్‌ 206లోని 305 పోరంబోకు భూమిని గుర్తించారు. వీటిలో 222 ఎకరాలు ఎలాంటి కబ్జాలో లేకుండా ఉండడం, ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు కనెక్ట్‌ అయి ఉండడం, మండల కేంద్రానికి సమీపంలో, తాండూరు రైల్వేస్టేషన్‌కు 13 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అనువైన స్థలంగా ఎంపికచేశారు. మర్పల్లి మండలం ఘణాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 57లోని 330 ఎకరాలు (గైరాన్‌ భూమి), నవాబుపేట మండలంలోని అర్కతలలో సర్వేనంబర్‌ 31లోని 246 ఎకరాల పోరంబోకు భూములు అనువుగా ఉండడంతో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. సంబంధిత పారిశ్రామిక వాడల్లో ఆహార ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. 

అటవీ సంరక్షణకు రూ.16 కోట్లు...

జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణకు తగిన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాలుండగా 95 బ్లాకులు ఉన్నాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్‌, కందకాల ఏర్పాటుకు రూ.16 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంబంధిత పనులకు టెండర్లు పూర్తి చేసి మార్చిలో పనులు చేపట్టాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటుకు టెండర్లు పూర్తికాగా, త్వరలో ఈ పనులను ప్రారంభించనున్నారు. 

అందుబాటులోకి 16 చెక్‌డ్యాంలు

జిల్లాలోని కాగ్నా, కాకరవేణి, మూసీ నదులు, లఖ్నాపూర్‌ ప్రాజెక్టుతోపాటు వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని ప్రధాన వాగులపై రూ.62.20 కోట్లతో 18 చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే బషీరాబాద్‌ మండలం జీవన్గీలో కాగ్నా నదిపై చెక్‌డ్యాం పనులు 70 శాతం పూర్తికాగా, మిగతా చెక్‌ డ్యాం పనులను ఈనెలాఖరులో చేపట్టనున్నారు. సంబంధిత చెక్‌డ్యాంలన్నీ వర్షాకాలంలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 

జిల్లాలో రెండు అర్బన్‌ పార్కులు

జిల్లాలో రెండు అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. రూ.2.50 కోట్లతో గొట్లపల్లి-అంతారం రిజర్వ్‌ అటవీ ప్రాంతంలోని 111 ఎకరాల్లో అర్బన్‌ పార్కు పనులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫెన్సింగ్‌ పనులు జరుగుతున్నాయి. పరిగి నియోజకవర్గంలోని జాఫర్‌పల్లి అటవీ ప్రాం తంలో కూడా 30 ఎకరాల్లో రూ.75 లక్షలతో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేయనున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద రూ.66 లక్షలతో నేచర్‌ థీమ్‌ పార్కు, రాత్రి వేళల్లో అక్కడే గడిపేలా టెంట్లు, నైట్‌ క్యాంపింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌

చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. దీంతో పాలన ప్రజలకు మరింత చేరువైంది. ప్రతీ కొత్త జిల్లాకు ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లను నిర్మిస్తున్నారు. జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం ఫర్నిచర్‌కు సంబంధించిన పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. 2021 జిల్లా ప్రజలకు కొత్త కలెక్టరేట్‌ అందుబాటులోకి రానున్నది. రూ.32 కోట్లతో 33 ఎకరాల్లో నూతన కలెక్టరేట్‌ నిర్మాణాన్ని చేపట్టారు. పలు పనుల డిజైన్‌లతో నూతన కలెక్టరేట్‌ నిర్మాణ వ్యయం రూ.60 కోట్లకు పెరిగింది.

VIDEOS

logo