గురువారం 04 మార్చి 2021
Vikarabad - Dec 30, 2020 , 03:20:18

తీపి కబురు

తీపి కబురు

 • ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ వరాలు
 • ప్రభుత్వ, ఆర్టీసీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, సెర్ప్‌ తదితర ఉద్యోగుల వేతనాలు పెంపు
 • పదవీ విరమణ వయస్సునూ పెంచేందుకు నిర్ణయం
 • అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
 • ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు
 • రంగారెడ్డి జిల్లాలో 5లక్షల మంది, వికారాబాద్‌లో 26989 మంది ప్లాట్ల యజమానులకు ఊరట
 • సర్వత్రా హర్షం.. సంబురాలు చేసుకుంటున్న లబ్ధిదారులు 
 • రంగారెడ్డి జిల్లా ..
 • రెగ్యులర్‌ ఉద్యోగులు : 18వేలు
 •  ఆర్టీసీ కార్మికులు : 2వేలు
 • ఎల్‌ఆర్‌ఎస్‌ తో ఊరట పొందేవారికి సంఖ్య : 5లక్షలు
 • వికారాబాద్‌ జిల్లా..
 •  ఉద్యోగులు : 9400
 • ఉద్యోగ ఖాళీలు  : 1581
 • ఎల్‌ఆర్‌ఎస్‌ తో ఊరట పొందేవారికి సంఖ్య : 26989

ఉద్యోగులు, ప్రజలకు సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సర కానుకను ముందుగానే ప్రకటించారు. ఆర్టీసీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, సెర్ప్‌ అన్నిరకాల ఉద్యోగులందరికీ  వేతనాలను పెంచాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగ విరమణ వయస్సు పెంచడంతోపాటు విరమణ రోజే బెనిఫిట్స్‌ అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నది.  అంతేకాకుండా వ్యవసాయేతర ఆస్తులకు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చింది. ఇక అన్ని శాఖాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీతోపాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని వేల మందికి లబ్ధి చేకూరనున్నది.  సర్కార్‌ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 

 • -రంగారెడ్డి /వికారాబాద్‌, నమస్తే తెలంగాణ
 • ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు,
 • పదవీ విరమణ వయసు కూడా పెంపు
 • ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా క్రయ, విక్రయాలకు అనుమతి
 • సీఎం కేసీఆర్‌ కొత్త సంవత్సర బహుమతులు
 • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న హర్షాతిరేకాలు
 • ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  అన్ని రకాల ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, సెర్ప్‌ తదితర ఉద్యోగులందరీ వేతనాలను పెంచేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో పనిచేస్తున్న 8400 మంది ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులతోపాటు మరో వెయ్యి మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. అంతేకాకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు పదవీ విరమణ రోజునే ఉద్యోగులకు బెనిఫిట్స్‌ అందించేందుకు నిర్ణయించారు. మరోవైపు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకుగాను సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. 

అయితే జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1581 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను పెంచడంతోపాటు ఆ సంస్థపై పడుతున్న భారాన్ని కూడా ప్రభుత్వమే భరించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా డిపోల పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి,..తాండూర్‌ డిపో పరిధిలో 403 మంది, వికారాబాద్‌ డిపో పరిధిలో 352 మంది, పరిగి డిపో పరిధిలో పనిచేస్తున్న 351 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా రిజిస్ట్రేషన్లు...

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు అడ్డంకులు తొలగనున్నాయి. అనుమతిలేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసేందుకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గత మూడు నెలలుగా ఆగిపోయిన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ నిర్ణయంతో ఇక పుంజుకోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 12,675 ప్లాట్ల యజమానులకు, గ్రామ పంచాయతీల్లో 14,314 ప్లాట్ల యజమానులకు లబ్ధి చేకూరనుంది. 

రంగారెడ్డి జిల్లాలో 25వేల మందికి పైగా లబ్ధి

 రంగారెడ్డి, నమస్తే తెలంగాణ :  కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని,ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని,అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్‌ నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు,గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు,వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు,డెయిలీ వైజ్‌ ఉద్యోగులు, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులు,పార్ట్‌టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులు,హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు,కాంట్రాక్టు ఉద్యోగులు,ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు,ఆశ వర్కర్లు,విద్యా వలంటీర్లు, సెర్ఫ్‌ ఉద్యోగులు,గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు,పెన్షనర్లు ఇలా ..అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని రకాల ఉద్యోగులు కలిపి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 25వేల పైగా ఉంటారని,అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుంచనుంది. 18 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లాలో 2వేల మందికి లబ్ధి చేకూరనుంది. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం,అవసరమైన బదిలీలు చేయడం,సరళతరమైన సర్వీస్‌ నిబంధనల రూపకల్పన,రిటైర్‌ అయ్యే రోజే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం,కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడంలాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ  అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి,ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అధ్యక్షుడిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ సభ్యులుగా ఒక కమిటీని సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వ నిర్ణయం శుభ పరిణామం

రంగారెడ్డి జిల్లాలో 5లక్షల మందికి ఊరట గడిచిన కొద్ది రోజులుగా సందిగ్ధంలో పడ్డ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్ల విషయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నప్పటికీ తిరిగి రిజిస్ట్రేషన్లు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాం ప్స్‌ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే రిజిస్ట్రేషన్‌ ద్వారా ఒకరికి సంక్రమించిన ప్లాట్లను తిరిగి విక్రయించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం లేదని తెలిపింది. అయితే కొత్తగా ఏర్పాటు చేసినా లే ఔట్ల విషయంలో మాత్రం ఇదివరకు విధించిన నిబంధనలే కొనసాగుతాయి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్లలో ప్లాట్లను విక్రయించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రకటించింది. దీంతో పాటు అనుమతి పొందిన లే అవుట్లు, గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఆంక్షలు ఉండవు. సబ్‌ రిజిస్ట్రార్‌లు పైన తెలిపిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నటైంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో రంగారెడ్డి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలపక్షమే. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దుతో బీద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుం ది. ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నట్లు గ్రహించిన సీఎం కేసీఆర్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ అమలును రద్దు చేయటం ఎంతో చారిత్రాత్మకమైన విషయం. 

- గుండు.సురేశ్‌ముదిరాజ్‌, గూడూరు, కొత్తూరు మండలం

ఉద్యోగుల కల నెరవేరింది

ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ కాలం పెంచడం, ఆర్టీసీ కార్మికుల కష్టాలను గ్రహించిన సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల జీతాలను పెంచడం సంతోషకరం. ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల రిజిస్ర్టేషన్లు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆలోచనలను గ్రహించి తదనుగుణంగానే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు.  

- మోరా కార్తీక్‌రెడ్డి, కొత్తూరు

మరింత కష్టపడి పనిచేస్తాం

ఆర్టీసీ ఉద్యోగులు పడుతున్న కష్టాలను కండ్లారా చూసి వేతనాలు పెంచడం చాలా హర్షించదగ్గ విషయం. పేదల బతుకుల పట్ల ప్రేమానురాగాలు ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచడం చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వానికి నిజాయితీగా డ్యూటీ చేసి రుణం తీర్చుకుంటాం. 

- నర్సింహులు డ్రైవర్‌ వికారాబాద్‌ డిపో

ప్రభుత్వ ఉత్తర్వులు హర్షణీయం

నాకు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో 100 గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటును రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వెళ్లాను. ఆన్‌లైన్‌ సెంటరు వాళ్లు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటేనే ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేయబడుతుందని చెప్పారు. దీంతో తిరిగి ఇంటికి వచ్చాను. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ప్రభు త్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అని ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషం. 

- బాల్‌రాజ్‌, గేటువనంపల్లి, నవాబుపేట మండలం 

సీఎం సార్‌కు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంతో ఎంతో మందికి మే లు జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు, డెయిలీ వైజ్‌ ఉద్యోగులు, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులు, పార్ట్‌టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆశావర్కర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవడంతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 

- లక్ష్మణ్‌, రంగారెడ్డి జిల్లా టీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు 

సీఎం సార్‌ పెద్దమనసు చాటుకుండ్రు

సీఎం కేసీఆర్‌ సార్‌ ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకొండు. కుటుంబ సభ్యుల సమస్యను ఇంటి పెద్ద ఎంత బాధ్యతగా ఆలోచిస్తోడో సీఎం సార్‌ అలాగే ఆలోచిండం సంతోషకరం. కాకపోతే నిర్ణయాలు ఆచరణాత్మకంగా నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి. ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయంపై మరింత నమ్మకం పెరుగుతుంది. సార్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులో బాధ్యత మరింత పెరిగింది. కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.

-లోకేశ్వరి, ఉపాధ్యాయురాలు, ముద్విన్‌, కడ్తాల

ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు

తక్కువ వేతనాలతో జీవితాలు గడుపుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ వేతనాలు పెంచి జీవితాల్లో వెలుగులు నింపారు. వేతనాలతో పాటు, పదవీ విరమణ వయసును పెంచడం చాలా సంతోషం. నేను 2010 నుంచి ఆర్టీసీ ఉద్యోగం చేస్తున్నా. తక్కువ వేతనం ఉండడంతో కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెంచి వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం చాలా సంతోషంగా ఉంది. 

- మాణిక్యం కండక్టర్‌ వికారాబాద్‌ డిపో 

మళ్లీ ఉపాధి అవకాశాలు లభించాయి

ధరణి పోర్టల్‌ ప్రారంభంతో దస్తావేజుల లేఖరులం ఉపాధి కోల్పోయాం. సీఎం కేసీఆర్‌ పునరాలోచించి ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసే ఆలోచనతో మళ్లీ ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి అమ్మకాలు, కొనుగోళ్ళు చేసే సదుపాయం అందుబాటు లోకి వస్తుండడంతో మామూలు జనాలకు ఇబ్బందులు తొలిగాయి. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం అమోఘం. సీఎం సార్‌కు రుణపడి ఉంటాం.

- అంజయ్య, దస్తావేజుల లేఖరి, కొడంగల్‌

వేతనాల పెంపును స్వాగతిస్తున్నాం

ఉద్యోగుల పదవీ విరమణ వయసును, వేతనాల పెంపుపై హర్షిస్తున్నాం.. స్వాగతిస్తున్నాం.. పేపర్‌ బెనిఫిట్‌ కాకుండా బకాయిలను వాయిదా ప్రకారం చెల్లిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. 2018 జులై నాటి నుంచి పీఆర్‌స్సీ పెంపు కోసం ఎదురు చూస్తున్నాం. మా కోరిక తీరింది. సీఎం కేసీఆర్‌ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడుతుంటారు. ఆయన మేలును తీర్చుకోలేం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.

- అబ్దుల్‌ హక్‌, ఉపాధ్యాయుడు, కొడంగల్‌.

సీఎం సారూ సల్లంగా ఉండాలి

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచడం ఆనందాన్నిచ్చింది. సీఎం కేసీఆర్‌ సారూ మరో 25 ఏండ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఉద్యోగ వయస్సు కూడా పెంచడం అభినందనీయం. దేశంలో ఏ సీఎం చేయని సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పేదల పక్షపాతిగా సీఎం పేరు గడించారు. సీఎం కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం. మాలాంటి వారికి అండగా నిలబడిన ముఖ్యమంత్రి సార్‌ను మేం ఎప్పటికీ మరువం.

- ఫకీరప్ప కండక్టర్‌. తాండూరు రూరల్‌

VIDEOS

logo