ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Dec 27, 2020 , 04:36:13

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

  • బస్సును ఢీకొని ఆటోపై బోల్తాపడిన లారీ 
  • ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు మహిళలు మృతి
  • ఇజ్రాచిట్టెంపల్లిలో అలుముకున్న విషాదం
  • గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యే ఆనంద్‌
  • మృతుల కుటుంబాలకు  మంత్రి సబితారెడ్డి పరామర్శ

క్షణాల్లో శంకర్‌పల్లి వెళ్లేందుకు సిద్ధం అయ్యేలోగా ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో తాండూరు వైపు వెళ్తున్న లారీ పొగమంచు ప్రభావంతో ఎదురుగా ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని పక్కనే ఆగి ఉన్న ఆటోపై బోల్తాపడింది. దీంతో అక్కడిక్కడే ఇజ్రాచిట్టెంపల్లికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో 9,10 చదువుతున్న విద్యార్థులుండగా, మరొకరు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉన్నది. లారీ డ్రైవర్‌ అతివేగమే ఐదుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో శనివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి గ్రామానికి చెందిన జాటొతు శానియాబాయి(55), రమావత్‌ సంధ్య (16), జాటోతు సోని (15), జాటోతు నితిన్‌ (14), జాటోతు రేణుకబాయి (30)లతో పాటు మరో ముగ్గురు కూలీ పనుల కోసం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో పత్తిని తీసేందుకు ప్రతి రోజు వెళ్లేవారు. శనివారం కూడా రోజు మాదిరిగానే ఉదయాన్నే పత్తి తీసేందుకు అదే గ్రామానికి చెందిన హరి టీఎస్‌ 07యుఏ1929 నంబరు గల ఆటోలో కూర్చున్నారు. ఆటో డ్రైవర్‌ హరి మరో ఇద్దరి కోసం ఊరిలోకి వెళ్లాడు. అంతలోనే మోమిన్‌పేట నుంచి ఓ మైనింగ్‌ కంపెనీకి చెందిన అశోక్‌లీలాండ్‌ ఏపీ 28వై 9596 నంబరు లారీ అతివేగంతో తాండూరు వైపునకు వస్తున్నది. ఇజ్రాచిట్టెంపల్లి గ్రామం వద్ద ఆటో రోడ్డుపై ఆగి ఉన్నది. అదే సమయంలో తాండూరు డిపోకు చెందిన టీఎస్‌ 34 టీఏ 6125 నంబరు గల ఆర్టిసీ బస్సు తాండూరు నుంచి సంగారెడ్డి వెళ్తున్న బస్సు హిజ్రాచిట్టెంపల్లి వద్ద ఆగి ఉంది. ఉదయం 7:15 గంటల సమయంలో అతివేగంతో వచ్చిన లారీ డ్రైవర్‌ బస్సుకు ఢీకొని ఇటు వ్యవసాయ కూలీలతో ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న మంకీబాయి అనే ఇంటిలోకి దూసుకువెళ్లింది. ఆటోలో ఉన్న నలుగురు శానియాబాయి, సంధ్య, సోని, నితిన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. రేణుకబాయికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం  సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మోమిన్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు జరిగిన ప్రమాదం పట్ల పూర్తిస్తాయిలో విచారణ చేపడుతున్నారు. మృతులను మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

ముగ్గురు విద్యార్థులే...  

  • మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి గ్రామానికి చెందిన సేవంత, కమాల్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. వీరిది వ్యవసాయ కూలీ కుటుంబం. 
  • జటోతు జిమ్మిబాయి, కమాల్‌ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్ప మూగ. రెండో  కూతురు జాటోతు సోని వికారాబాద్‌ కోత్తగడిలో ఉన్న సమీకృత బాలికల వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్నది. 
  • మంగీబాయి, మోత్యనాయక్‌ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాష్‌ చదువుతున్నాడు. రెండో కొడుకు జాటోతు నితిన్‌ ఇబ్రహీంపట్నం యాచారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9 వతరగతి చదువుతున్నాడు.  
  • మృతురాలు శానియాబాయి భర్త బాబు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రేమ్‌, చిన్నకొడుకు వినోద్‌. 

ఆటో డ్రైవర్‌ ఇంటిపై దాడి...

ప్రమాదానికి కారకుడయ్యాడని కోపంతో మృతుల కుటుంబీకులు, బంధువులు ఆటో డ్రైవర్‌ హరి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై ఉన్న పైకప్పు ధ్వంసం చేశారు. హరి నిర్లక్ష్యం వల్లే మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని  ఆందోళన వ్యక్తం చేశారు. 

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే  ఆనంద్‌ 

వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌  బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఘటనకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పొట్టకూటికోసం వెళ్లినవారిపై మృత్యువు కబలించడం బాధకరమన్నారు.

మర్పల్లి దవాఖానను సందర్శించిన కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం చేయాలని వైద్యులకు ఆదేశించారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన అడిషనల్‌ ఎస్పీ రషీద్‌ 

జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మోమిన్‌పేట సీఐ వెంకటేశం, ఎస్సైలతో పాటు విచారణ చేశారు. 

స్పీడ్‌ బ్రేకర్స్‌ లేకపోవడమే..  

ఈ రోడ్డు గుండా అధికంగా లారీలు, పెద్ద వాహనాలు భారీ లోడ్‌తో నడుస్తుంటాయి. కానీ రోడ్డుపై ఎక్కడ కూడా స్పీడ్‌ బ్రేకర్స్‌ లేవు. స్పీడ్‌ బ్రేకర్స్‌ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని పలువురు అనుకుంటున్నారు. 

ప్రమాదానికి పొగమంచు కూడా కారణం ?

ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తున్నది. ఈ రోడ్డు గుండా భారీ వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి.

VIDEOS

logo