శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 24, 2020 , 05:02:50

చేరువలోకి ఈఎస్‌ఐ వైద్యం

చేరువలోకి ఈఎస్‌ఐ వైద్యం

  • మన్నెగూడలో ఈఎస్‌ఐ దవాఖానకు ప్రతిపాదనలు
  • ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా యంత్రాంగం
  • చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన స్థలం గుర్తింపు
  • రాకంచర్ల, శివారెడ్డిపేట్‌లలో ఇండస్ట్రియల్‌ పార్కులు, జనరల్‌ పరిశ్రమలు ఉండడంతో ప్రాధాన్యత

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు శుభవార్త. త్వరలో జిల్లాకు ఈఎస్‌ఐ దవాఖాన మంజూరు కానుంది. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణను చేపట్టింది. ఈఎస్‌ఐ దవాఖానకు అనువైన స్థలాన్ని కూడా ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ యంత్రాంగం గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఈఎస్‌ఐ దవాఖాన మంజూరు చేయిస్తామని.. అది తాండూరు నియోజకవర్గంలోనే ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లాలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన సమయంలో హామీనిచ్చారు. తదనంతరం జిల్లాలోని ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎంతమంది ఈఎస్‌ఐ సేవలు వర్తించే ఉద్యోగులు ఉన్నారనే వివరాలను జిల్లా ఉన్నతాధికారులు సేకరించారు. 

నాలుగు నియోజకవర్గాల ప్రజలకు అనువుగా..

తాండూరు నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమలతోపాటు సుద్ద గనుల పరిశ్రమలు పెద్దమొత్తంలో ఉన్నప్పటికీ సంబంధిత పరిశ్రమల్లో చాలా పరిశ్రమలకు గుర్తింపు లేకపోవడంతోపాటు అందులో పనిచేసే మెజార్టీ కార్మికులంతా రోజువారీ కూలీలుగా ఉండడంతో జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాలకు అందుబాటులో ఉండేలా ఈఎస్‌ఐ దవాఖాన ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. మన్నెగూడలో ఈఎస్‌ఐ దవాఖాన ఏర్పాటుకుగాను జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపింది. చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనగల మీర్జాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నం.22లోని 70 ఎకరాల్లో 3 ఎకరాలను ఈఎస్‌ఐ దవాఖాన ఏర్పాటుకుగాను అనువైన స్థలంగా ప్రతిపాదనలు పంపారు. బీజాపూర్‌ జాతీయ రహదారికి పక్కనే ఉండడంతోపాటు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలకు అనువైనదిగా గుర్తించారు. పరిగి నియోజకవర్గంతోపాటు వికారాబాద్‌ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఉండడం కూడా పరిగి నియోజకవర్గంలోని మన్నెగూడ సమీపంలో ఈఎస్‌ఐ దవాఖాన ఏర్పాటుకు ఓ కారణంగా చెప్పవచ్చు. పరిగి నియోజకవర్గంలోని పూడూర్‌ మండలం రాకంచర్లలో ఇండస్ట్రియల్‌ పార్కులో స్టీల్‌ పరిశ్రమలు ఉన్నాయి. శివారెడ్డిపేట్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో అన్ని రకాల(జనరల్‌) పరిశ్రమలున్నాయి. 

జిల్లాలో 1432 పరిశ్రమల్లో 63,285 మంది ఉద్యోగులు

జిల్లావ్యాప్తంగా 1432 గుర్తింపు పొందిన పరిశ్రమలున్నాయి. సంబంధిత పరిశ్రమల్లో 63,285 మంది ఉద్యోగులున్నారు. వీరందరికీ ఈఎస్‌ఐ వర్తించనుంది. తాండూరు నియోజకవర్గంలో ప్రధానంగా సీసీఐ, పెన్నా, ఇండియా సిమెంట్‌ పరిశ్రమలున్నాయి. సీసీఐ సిమెంట్‌ పరిశ్రమలో 850 మంది ఉద్యోగులు, పెన్నా సిమెంట్‌ పరిశ్రమలో 473 మంది ఉద్యోగులు, ఇండియా సిమెంట్‌ పరిశ్రమలో 493 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిన్‌గుర్తిలోని క్లీన్‌ సోలార్‌ పరిశ్రమలో 50 మంది రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. తాండూరు బండరాయి దేశంలో ప్రసిద్ధి అయినప్పటికీ నాపరాతి పరిశ్రమల్లో మాత్రం పర్మినెంట్‌ ఉద్యోగులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. తాండూరు మండలంలో వెయ్యికిపైగా నాపరాతి పరిశ్రమలుండగా వీటిలో సగానికిపైగా రోజువారీ కూలీలతోనే కొనసాగిస్తున్నారు. మరోవైపు వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల్లోని శివారెడ్డిపేట్‌, రాకంచర్ల ఇండస్ట్రియల్‌ పార్కుల్లో పనిచేస్తున్న ఉద్యోగులే అధికంగా ఉన్నారు. వీరితోపాటు సోలార్‌ పరిశ్రమలు, పవన విద్యుత్తు పరిశ్రమలకు సంబంధించిన ఉద్యోగులున్నారు. 


VIDEOS

logo