శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 24, 2020 , 05:00:05

ఈ-వేలంతో గనుల తవ్వకాలకు అనుమతులు ?

ఈ-వేలంతో గనుల తవ్వకాలకు అనుమతులు ?

  • లీజు పద్ధతికి స్వస్తి పలికే దిశగా అడుగులు
  • ఏడాదిన్నరగా మంజూరుకాని తవ్వకాల అనుమతులు
  • వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 606 దరఖాస్తులు పెండింగ్‌
  • అనుమతిలేని ప్రాంతాల్లోనూ అక్రమంగా తవ్వకాలు చేస్తున్న లీజుదారులు
  • ఈ పద్ధతిలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం  
  • కొత్త విధానంతో భారీగా ఆదాయం పెరిగే అవకాశం
  • జిల్లాలో 610 హెక్టార్లలో 40 ఎర్రమట్టి,  100 హెక్టార్లలో 160  నాపరాయి గనులు

గనులు లీజుకిచ్చే విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వం వేలం వేసే విధానం అవలంభించాలని యోచిస్తున్నది. వికారాబాద్‌ జిల్లాలోని పెద్దేముల్‌, మర్పల్లి, వికారాబాద్‌, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులున్నాయి. తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాయి గనులున్నాయి. జిల్లాలో పెద్ద, చిన్న తరహా గనుల ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. ఈ-వేలం విధానంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. లీజు పద్ధతితో  ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వాటిల్లుతున్నదని భావించి, ఈ-వేలంతో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో  గనుల తవ్వకాల్లో అక్రమాలను అరికట్టవచ్చని భావిస్తున్నది.  

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : గనులను వేలం వేసే విధానంవైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న లీజు విధానానికి స్వస్తి పలికి వేలం వేసే విధానాన్ని తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. గనులను వేలం వేసే విధానంపై సంబంధిత ఉన్నతాధికారులతో కసరత్తు కూడా చేస్తున్నట్లు సమాచారం. లీజుకిచ్చే పద్ధతితో ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం జరుగుతుందని భావించి ఈ-వేలం విధానంతో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసేలా ఆలోచన చేస్తున్నది. అందుకే గతేడాదిన్నర కాలంగా ఒక్క అనుమతి కూడా కాకపోవడం గమనార్హం. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు కానట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. గనుల లీజుకిచ్చే విధానంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 

ప్రభుత్వ భూముల్లోనూ తవ్వకాలు

లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట అనే విధంగా కొంత ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటున్న మైనింగ్‌ వ్యాపారులు లీజుకు తీసుకోని ప్రాంతాల్లో కూడా మైనింగ్‌ జరుపుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూరుతున్నది. మైనింగ్‌ వ్యాపారులు కేవలం పది ఎకరాలను లీజుకు తీసుకొని పక్కనగల ప్రభుత్వ భూముల్లోనూ అక్రమంగా మైనింగ్‌ తవ్వకాలు జరుపుతున్నారు. వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారు. 

ఏడాదిన్నరగా పెండింగ్‌లో దరఖాస్తులు

గత ఏడాదిన్నరగా జిల్లావ్యాప్తంగా 606 దరఖాస్తులురాగా, సంబంధిత దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ-వేలం విధానంతో నిర్ణీత సమయానికి జిల్లావ్యాప్తంగా నిక్షిప్తమైన గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తారు కాబట్టి అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఉండదు. మరోవైపు ఈ-వేలం విధానంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుండడంతోపాటు అక్రమ గనుల తవ్వకాలకు పూర్తిగా చెక్‌ పడనుంది. 

2013లో లీజు పూర్తయినా..

జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో నాపరాయి, సుద్ద గనులు, ఎర్రమట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. తాండూరు మండలంలో యథేచ్ఛగా నాపరాతి గనులను అక్రమంగా తవ్వుతున్నారు. తాండూరు మండలంలోని మల్కాపూర్‌, కోటబాసుపల్లి, ఓగిపూర్‌ గ్రామాల్లో నాపరాతి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. మల్కాపూర్‌లో 338 ఎకరాలకు సంబంధించి 2013లోనే లీజు పూర్తైనా ఇంకా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇదే గ్రామంలో సర్వే నం.15లో 260 ఎకరాలు, కోట్‌బాసుపల్లిలోని సర్వే నం.116లోని 138 ఎకరాలు, కరన్‌కోట్‌ సర్వే నం.18లోని 29.31 ఎకరాలు, ఓగిపూర్‌లోని సర్వే నం.129లోని 18.22 ఎకరాల్లో అక్రమంగా గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. 

కంపిస్తున్న నివాస ప్రాంతాలు

అయితే కొంత మంది ప్రభుత్వ భూములపై కన్నేసి లీజులు లేకుండా రాత్రి, పగలు నాపరాతి నిక్షేపాల తవ్వకాలు జరుపుతున్నారు. దీని కోసం పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. రాయిని వెలికి తీసేందుకు సుమారు 10 ఫీట్ల లోతులో పేలుడు పదార్థాల(జిలెటిన్‌స్టిక్స్‌)ను అమరుస్తారు. నాపరాతి పై పొరలను తొలగిస్తే కింది భాగంలో నాపరాయి నిక్షేపాలు ఉంటాయి. పై పొరలను తొలగించేందుకు ట్రాక్టర్‌కు అమర్చిన బోరు ద్వారా 10 ఫీట్ల లోతు వరకు రంధ్రాలు వేస్తారు. ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలను పేల్చివేస్తారు. నాపరాయి గనుల చుట్టూ నివాస ప్రాంతాలైన మల్కాపూర్‌, ఓగిపూర్‌, కరణ్‌కోట గ్రామాల్లో ఇండ్లలోని వంటసామగ్రి కంపించి కిందపడిపోతున్నాయి. కొన్నిసార్లు ఇండ్ల గోడలు కూడా కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే అక్రమ పేలుళ్లను నిరోధించడం అధికారుల వల్ల కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

లీజు ఒక చోట.. తవ్వకాలు మరో చోట..

మల్కాపూర్‌, కోటబాసుపల్లి గ్రామ పరిధిలో సుమారు 338 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో ఎక్కువ శాతం అక్రమ దందా సాగుతున్నది. రెవెన్యూ అధికారులు, మైన్స్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తూతూ మంత్రంగా గనులకు వెళ్లి అక్కడున్న చిన్నచిన్న యంత్రాలను సీజ్‌ చేసి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారింది. పూర్తి స్థాయిలో అధికారులు అక్రమ తవ్వకాలపై దృష్టి సారించడంలేదనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది పట్టాభూముల్లో లీజు పొంది, పక్కనే ఉండే ప్రభుత్వ భూములను అక్రమించుకొని తవ్వకాలు జరుపుతున్నారు. వీటిని సర్వే చేయడం రెవెన్యూ అధికారుల వల్ల కూడా కావడంలేదు. కరెంట్‌ కనెక్షన్‌లో కూడా మోసం జరుగుతున్నది. సర్వే నం. పేరు ఒకటి ఉంటే, మరో చోట కనెక్షన్‌ తీసుకొని తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ, విద్యుత్‌, మైన్స్‌, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తేగానీ అక్రమ తవ్వకాలు నిలిచిపోయే అవకాశం లేదు. ఏది ఏమైనా అక్రమ తవ్వకాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. అధికారులు ఇప్పటికైనా అక్రమ తవ్వకాల నిలుపుదలకు కృషి చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం..

జిల్లాలో మైనింగ్‌ లీజులైన పెద్ద తరహా, చిన్న తరహా గనుల ద్వారా ప్రస్తుతం ఏడాదికి రూ.100 కోట్లు రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది. ఈ-వేలం విధానంతో ప్రభుత్వానికి మరింత అధికంగా ఆదాయం సమకూరనుంది. జిల్లాలోని తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాయి, 12 హెక్టార్లలో 6 గ్రానైట్‌ గనులుండగా.. పెద్దేముల్‌, మర్పల్లి, వికారాబాద్‌, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులున్నాయి. పెద్దేముల్‌, మర్పల్లి, ధారూర్‌ మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ద, వికారాబాద్‌, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులున్నాయి. దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులు ఉన్నాయి. 

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లీజులు - సాంబశివరావు, తాండూరు మైన్స్‌ ఏడీ

లీజు కోసం వచ్చిన దరఖాస్తులు గత ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయి. పాత, కొత్త విధానం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం లీజులపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా వాటిని అమలు చేస్తాం. మరో నెల వ్యవధిలో లీజులకు సంబంధించి ఉత్తర్వులు రానున్నాయి.

VIDEOS

logo