ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Dec 22, 2020 , 05:47:17

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

  • గాంధీజీ కలలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్‌
  • అరవై ఏండ్ల్ల వెనుకబాటును ఆరేండ్లలో రూపుమాపాం
  • రైతులను సంఘటితం చేయడానికే రైతు వేదికలు
  • ప్రతి ఎకరాకు నీరందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని మెట్లకుంట, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతు వేదికలు, ప్రకృతి వనాలను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో మంత్రి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. అనంతరం ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఆరేండ్లలో జరిగిందన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటుందని అన్నారు.

బొంరాస్‌పేట : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మెట్లకుంట, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో రైతు వేదికలు, ప్రకృతి వనాలను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. చౌదర్‌పల్లిలో రూ.2.33కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్వహించిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ గ్రామాలలోప్రజలకు శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని, ప్రతినెలా పంచాయతీలకు నిధులను విడుదల చేస్తూ గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. 

రైతులను సంఘటితం చేయడానికి, వారిలో భరోసా నింపడానికి, అధికారులు బాధ్యతతో పని చేయడానికి ప్రభు త్వం రైతు వేదికలను నిర్మించిందని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేసి నేరుగా రైతు ఖాతాలలో డబ్బులు జమచేసే ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. రైతుకష్టం తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండబట్టే అన్నదాత సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రూ.7300 కోట్లు విడుదల చేసిందని, జిల్లాలోని 2.10లక్షల మంది రైతుల ఖాతాలలో త్వరలో రూ.300కోట్లు జమ అవుతాయని మంత్రి సబిత పేర్కొన్నారు. రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి మృతిచెందిన రైతు కుటుంబాలకు రూ. 5లక్షల బీమా సాయం చేసి ఆదుకుంటున్నామని అన్నారు. మిషన్‌ కాకతీయ పథకంలో చెరువులలో పూడిక తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు లాభం జరిగిందని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. కులవృత్తులకు జీవం పోసి వారి జీవనోపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి వ్యవసాయ రం గాన్ని అదానీ, అంబానీలకు కట్టబెట్టే యత్నం చేస్తున్నదని మం త్రి విమర్శించారు. నియంత్రిత సాగు విధానంలో రైతులు సన్నవడ్లు పండించారని, వారికి కనీస మద్దతు ధరకంటే ఎక్కువ చెల్లించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని, అలా చేస్తే ధాన్యం కొనుగోళ్లను నిలిపేస్తామని కేంద్రం కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మంత్రి అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల ప్రైవేట్‌ మార్కెట్లు వస్తే రైతులకు నష్టం జరుగుతుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రైతుకు గౌరవం పెరిగిందని మంత్రి సబిత అన్నారు. చౌదర్‌పల్లిలో పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి సబిత హామీ ఇచ్చారు. 

ఆరేండ్లలో అభివృద్ధి చేసి చూపాం - ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంతో వెనుకబడిందని, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో ఆరేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేసి చూపామని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చిమ్మ చీకటి అవుతుందని సీమాంధ్ర పాలకులు అనేవారని, కానీ సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నారని అన్నారు. వ్యవసాయం చేసుకుంటేనే బతుకుతామన్న ధీమాను సీఎం రైతుల్లో కల్పించారని అన్నారు. రైతులు పం డించిన పంటలను ప్రాసెసింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేసుకునేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో పండించిన తెలంగాణ సోనాకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారిందని అన్నారు. గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ పట్టణాలకు దీటుగా మారుస్తున్నారని అన్నారు. 

ఆందోళన వద్దు .. సన్నాలు కొంటాం - ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

సన్నరకం ధాన్యం పండించిన రైతులు ఆందోళన చెందవద్దని, సన్నాలను కొంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. రైతులను ఒక వేదికపైకి తెచ్చి వ్యవసాయంలో మంచి చెడులను చర్చించుకోవడానికి ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందని వీటిలో త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ జ్యోతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జేడీఏ గోపాల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సర్పంచ్‌లు నారాయణ, కేశవులు, వెంకటమ్మ, ఎంపీటీసీలు తిరుపతయ్య, శ్రవణ్‌, పార్టీ నాయకులు మధుయాదవ్‌, చాంద్‌పాషా, రామకృష్ణ యాదవ్‌, నరేశ్‌గౌడ్‌, మహేందర్‌ అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo